R Krishniah : వైసీపీ కండువాకు ఆర్ కృష్ణ‌య్య దూరం!

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన ఆర్ కృష్ణ‌య్య ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న‌ట్టా? పార్టీల‌కు అతీతంగా ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌విని పొందారా?

  • Written By:
  • Publish Date - May 24, 2022 / 01:10 PM IST

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన ఆర్ కృష్ణ‌య్య ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న‌ట్టా? పార్టీల‌కు అతీతంగా ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌విని పొందారా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. రాజ్య‌స‌భ ప‌ద‌విని ఇచ్చిన వైసీపీ జెండా, అజెండా, కండువా వేసుకోవడానికి ఆయ‌న సిద్ధంగా లేరు. ఆ విష‌యం ఇటీవ‌ల ఒక ప్రెస్మీట్ సంద‌ర్భంగా తేట‌తెల్లం అయింది. వైసీపీ కండువా వేసుకుంటారా? అని విలేక‌రులు అడిగిన‌ప్పుడు దాట‌వేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆ టైంలో వైసీపీ కండువా ఇవ్వ‌డానికి ప‌క్క‌న వాళ్లు ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు సున్నితంగా తిర‌స్క‌రించారు. అంటే, వైసీపీ కండువా వేసుకోవ‌డానికి మానసికంగా ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డంలేద‌ని అర్థం అవుతోంది.

ద‌శాబ్దాలుగా బీసీ కోసం పోరాటాలు చేసిన ఆర్ కృష్ణ‌య్య చుట్టూ ఏపీ రాజ‌కీయం న‌డుస్తోంది. ఆయ‌న తెలంగాణ‌కు చెందిన లీడ‌ర్‌. ఉమ్మ‌డి ఏపీలో బీసీల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. ప‌లు స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించి వెనుక‌బడిన వ‌ర్గాల నాయ‌కునిగా గుర్తింపు సంపాదించారు. ఉమ్మ‌డి ఏపీలో తొలిసారిగా ఆయ‌న టీడీపీ నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌ను న‌డిపారు. తెలంగాణ టీడీపీ సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కృష్ణ‌య్య పెద్ద‌గా ప్రాబ‌ల్యం చూప‌లేదు. శాస‌న స‌భ‌ప‌క్ష నేత‌గా ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ప్ప‌టికీ పోరాట‌ప‌టిమను చూప‌లేదు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత టీడీపీ సీఎం అభ్య‌ర్థిగా ఎల్బీన‌గ‌ర్ నుంచి బ‌రిలోకి దిగారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఉన్న బ‌ల‌మైన ఓటు బ్యాంకు కారణంగా ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఆ త‌రువాత ఆయ‌న కార‌ణంగా పార్టీ బ‌ల‌హీన‌ప‌డింది. పైగా ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ అడ్ర‌స్ లేకుండా ఆ పార్టీ పోయింది. దీంతో 2018 ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తీసుకుని మిర్యాల‌గూడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న పోటీ చేసి ఓడిపోయారు.

కొన్ని రోజులు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా ఒక‌టిరెండుసార్లు భేటీ అయ్యారు. ఆయ‌న‌కు సంఘీభావం తెలిపారు. సీన్ క‌ట్ చేస్తే, రాజ్య‌స‌భ ప‌దవిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌ట్ట‌బెట్టారు. ఫ‌లితంగా బీసీలంద‌రూ వైసీపీకి మ‌ద్ధ‌తుగా నిలుస్తార‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. కానీ, ఆయ‌న తెలంగాణ‌కు చెందిన లీడ‌ర్ కావ‌డంతో ఏపీలోని బీసీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. సుదీర్ఘంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల నాయ‌కులు ఏపీలో పోరాటాలు చేస్తున్నారు. కానీ, రాజ‌ధాని కేంద్రం ఉమ్మ‌డి ఏపీకి హైద‌రాబాద్ ఉండ‌డం కార‌ణంగా తెలంగాణ బీసీ నేత‌లు హైలెట్ అయ్యారు. ఏపీలోని బీసీ నాయ‌కులు పోరాటాలు చేసిన‌ప్ప‌టికీ ఆశించినంత ఎలివేట్ కాలేదు. ఇప్పుడు ఆ నాయ‌కులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యాన్ని నింపాదిగా గ‌మ‌నిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, వైసీపీ కండువా క‌ప్పుకుని ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డానికి ఆర్ కృష్ణ‌య్య ఇష్ట‌ప‌డ‌డంలేదు. పైగా ఈనెల 26న మంత్రుల `సామాజిక భేరి` కి కూడా ఆయ‌న దూరంగా ఉంటున్నారు. ఫ‌లితంగా ఆర్ కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ ఇచ్చిన‌ప్ప‌టికీ వైసీపీ ఆశించిన మ‌ద్ధ‌తు ఆ పార్టీకి ఉండ‌ద‌ని అర్థం అవుతుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వైసీపీ ఆయ‌న్ను మార్చుతుందా? లేక కృష్ణ‌య్య వాల‌కంతో రాజ‌కీయ ప‌డుతుందా? అనేది చూడాలి.