Quantum Valley : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం

శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది.

Published By: HashtagU Telugu Desk
Quantum Valley to be launched in Amaravati on January 1st next year

Quantum Valley to be launched in Amaravati on January 1st next year

Quantum Valley : క్వాంటం కంప్యూటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందువరుసలో నిలపాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి  చంద్రబాబు  2026, జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ని అమరావతిలో నెలకొల్పనుంది.

ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక రోజు ..

ఎంవోయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా నాయకత్వం వహిస్తుందని అన్నారు. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందం ‘ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మకం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు. సాంకేతికరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌‌పైనే ఆధారపడి ఉంటాయని అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, క్వాంటమ్ వ్యాలీ తక్కువ సమయంలోనే నిర్మించవచ్చన్నారు. ఇప్పటికే ఎల్&టీకి స్థలాన్ని కేటాయించామని, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక కమిటీ నిర్మాణం పురోగతిని పరిశీలిస్తే, మరొక కమిటీ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి త్వరలోనే ఈ ప్రాజెక్టును సవివరంగా తెలియజేస్తామన్నారు.

క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు

భారతదేశంలో ఐబీఎం క్వాంటం సిస్టం 2 స్థాపన, దేశ క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు కానుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – టీసీఎస్‌తో కలిసి పని చేయడం వల్ల క్వాంటం అల్గోరిథం అభివృద్ధి వేగవంతం అవుతుందని ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా అన్నారు. క్వాంటం, క్లాసికల్ సిస్టమ్‌లను కలిపిన హైబ్రిడ్ కంప్యూటింగ్ ద్వారా జీవశాస్త్రం, మెటీరియల్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో విప్లవాత్మక ఫలితాలు సాధించవచ్చని ఇది ఒక కీలక ఘట్టమని టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీసీఎస్ తొలిసారి రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు బీజం వేసిందని టీసీఎస్ ప్రతినిధులు వి. రాజన్న, సి.వి. శ్రీధర్ గుర్తు చేశారు. క్వాంటం వ్యాలీ ద్వారా పరిశోధన, అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని చెప్పారు. COIN నెట్‌వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో 43 కేంద్రాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని వివరించారు. క్వాంటం కంప్యూటింగ్ అనేది రెండో క్వాంటం విప్లవమని, ఈవీ బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు దీని ఉపయోగాలు విస్తృతంగా ఉంటాయని ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ అన్నారు. తాజా ఒప్పందంతో అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగు పడినట్టయ్యింది. క్వాంటం కంప్యూటింగ్ పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ కేంద్రంగా మార్చడం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం.

Read Also: PM Modi : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ

  Last Updated: 02 May 2025, 03:52 PM IST