CM Chandrababu : అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ని ఏర్పాటు చేయడమే తన ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. 2026 జనవరి 1 నాటికి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించాలనే దిశగా ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థలు భాగస్వాములవుతున్నాయని ఆయన ప్రకటించారు. విజయవాడలో సోమవారం జరిగిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ జాతీయ వర్క్‌షాప్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రబాబు, భవిష్యత్ టెక్నాలజీని రాష్ట్ర అభివృద్ధికి సాధనంగా ఉపయోగించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, ఫార్మా, నిర్మాణ, వాణిజ్య రంగాలకు చెందిన బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: Liquor case : పోలీస్ కస్టడీకి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ఈ సందర్భంగా గతంలో తాను చేపట్టిన ఐటీ రంగ విప్లవాలను చంద్రబాబు గుర్తుచేశారు నేను మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలసి హైదరాబాద్‌లో హైటెక్ సిటీ అభివృద్ధికి మద్దతు తెచ్చాను. పీపీపీ మోడల్‌లో ఎల్ అండ్ టీ సహకారంతో ఆ ప్రాజెక్టును నిర్మించాం. అదే ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు అమరావతిని క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం అని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ వల్ల పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని సీఎం తెలిపారు. ఇది కేవలం శక్తివంతమైన కంప్యూటర్ కాదు, ఒక పూర్తి టెక్నాలజీ ఎకోసిస్టమ్ అని వివరించారు. వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజాసేవలు వంటి రంగాల్లో దీనివల్ల వేగవంతమైన, ఖచ్చితమైన సేవల్ని ప్రజలకు అందించడం సాధ్యమవుతుందని చెప్పారు.
ఇప్పటికే ఏపీలో వాట్సప్ ద్వారా సేవలు అందిస్తున్నామని, ఆగస్టు 15 నాటికి వంద శాతం సేవలను వాట్సప్ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రంలోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తామని, యువత వీటిని ఉపయోగించుకుని సాంకేతిక రంగంలో అగ్రగాములవ్వాలన్నారు. స్టార్టప్‌లకు ఇది అనూహ్య అవకాశం. క్వాంటం టెక్నాలజీలో ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు. రాష్ట్రంలో పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధికి టెక్నాలజీ కీలకంగా మారనుంది అని పేర్కొన్నారు. ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసే బాధ్యతను ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు అప్పగించినట్లు చంద్రబాబు చెప్పారు. అనంతరం లోకేశ్‌తో కలిసి వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన స్టార్టప్‌ల ప్రదర్శన శాలలను పరిశీలించారు.
Read Also: Alcohol : ఫుల్ మద్యం తాగారు..కారులోనే ప్రాణాలు విడిచారు