AP Politics: పుష్ప శ్రీవాణికి షాక్.. టీడీపీలో చేరుతున్న ప‌ల్ల‌వి రాజు..!

  • Written By:
  • Publish Date - March 16, 2022 / 03:06 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక‌ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయం ఉన్నా, రాజకీయ‌వ‌ర్గాల్లో మాత్రం ఇప్పుడే హీట్ మొద‌లైంది. 2024 ఎన్నిక‌ల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్ప‌టి నుంచే కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఏపీలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తుల పై మాట్లాడుతూ, టీడీపీ క‌లిసేందుకు సిద్ధ‌మే అని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఏపీలో ఇప్ప‌టికే దాదాపుగా శ‌వాస‌నం వేసిన తెలుగుదేశం పార్టీకి, ప‌వ‌న్ వ్యాఖ్య‌లు జీవం పోశాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌ధ్యంలో టీడీపీతో పోత్తు పై ప‌వ‌న్ హింట్ ఇవ్వ‌డంతో, టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం క‌న‌బుతోంది. ఈ క్ర‌మంలో ప‌లువురు ఆశావ‌హులు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆశ‌క్తి చూపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ నుంచి టికెట్ ద‌క్క‌ద‌ని భావిస్తున్న ప‌లువురు నేత‌లు ఇప్పుడు తెలుగుదేశంపార్టీలో చేరేందుకు సిద్ధమ‌వుతున్నారు.

ఈ నేప‌ధ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆడపడుచు పల్లవి రాజు టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తన తండ్రి శత్రుచర్ల చంద్రశేఖర్ రాజుతో కలిసి విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ప‌ల్ల‌వి రాజు పార్వతీపురంలో తన అనుచరులతో సమావేశమయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ క్ర‌మంలో గిరిజ‌నుల‌ సమస్యల పరిష్కారం కోసం టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప‌ల్ల‌వి రాజు తెలిపారు.

ఇక టీడీపీలో చేరిన తర్వాత తన తదుపరి కార్యాచరణ వెల్లడిస్తానని ప‌ల్ల‌వి రాజు తెలిపారు. మంత్రి పుష్ఫ శ్రీవాణి భర్త, వైసీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పరీక్షిత్ రాజుకు పల్లవిరాజు స్వయానా చెల్లెలు. గత ఎన్నికల సమయంలోనూ పల్లవిరాజు టీడీపీ టికెట్ కోసం ఆశించినా ఆమెకు టికెట్ ల‌భించ‌లేదు. అయితే ఈసారి టికెట్ విష‌యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌డంతో ప‌ల్ల‌వి రాజు టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కురుపాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ తరఫున పల్లవీరాజు సొంత వదిన మీద పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మైపోయింది. మ‌రి 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు విజ‌యం సాధించిన శ్రీవాణి 2024లో హ్యాట్రిక్ కొడుతుందో లేదో చూడాలి.