ఏపీ హైకోర్టు (AP High Court) టీడీపీ శ్రేణులకు కాస్త ఉపశమనం కలిగించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగల్లు కేసుల్లో (Punganur Incident) అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న టీడీపీ నేతలు 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఇప్పటి వరకూ వీరంతా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి (TDP MLC Ram Bhopal Reddy) కూడా వీరిలో ఉన్నారు. వీరిందరికి బెయిల్ రావడం తో టీడీపీ పార్టీ కి కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.
ప్రతి మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన మరికొందరికి కూడా వూరట లభించింది. అంతకు ముందు హైకోర్ట్ ముందస్తు బెయిల్ ఇవ్వడంతో సీఐడీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించిందని హైకోర్టు గుర్తు చేసింది. తదుపరి విచారణ వరకూ వీరిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
Read Also : Hyderabad : పార్టీ లో సభ్యత్వం తీసుకుంటే..హైదరాబాద్ లో 200 గజాల స్థలం ఫ్రీ..
ఇదిలా ఉంటె ఇదే కేసులో చంద్రబాబు (Chandrababu)ను ఏ వన్ గా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలిచ్చారు. అంగళ్లులో ర్యాలీ నిర్వహణ కోసం పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నామని చంద్రబాబు తన పిటిషన్‌లో తెలిపారు. ర్యాలీ అంగళ్లు కూడలికి చేరుకోగానే అధికారపార్టీకి చెందినవారు తన కాన్వాయ్‌పై రాళ్లు వేశారని.. తమపైనే దాడి చేసి తిరిగి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని వెల్లడించారు.
