B.Tech Ravi Arrest : పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ ర‌వి అరెస్ట్‌.. మార్గ‌మ‌ధ్య‌లో కారు ఆపి మ‌రీ..!

పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ ర‌విని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తొలుత ఆయ‌న్ని కిడ్నాప్ చేశార‌నే వార్త‌లు

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 08:35 AM IST

పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ ర‌విని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తొలుత ఆయ‌న్ని కిడ్నాప్ చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న్ని కారులో ఎక్కించుకుని వెళ్తున్న‌ట్లు సమాచారం వ‌చ్చింది. ఆ త‌రువాత ఆయ‌న్ని రిమ్స్ ఆసుప‌త్రికి తీసుకురాగా పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు ఆయ‌న అనుచ‌రులు తెలిపారు. బీటెక్ రవి ఆచూకీ కోసం ఆయ‌న‌ సతీమణి భయాందోళనకు గురై స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. అయితే రవికి సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు తెలియదని పోలీసులు చేతులెత్తేశారు. పది నెలల కిందట పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించార‌నే కేసును పోలీసులు బ‌య‌టికి తీశారు. ఆ కేసును ఇప్పుడు నాన్‌ బెయిలబుల్‌గా మార్చేసి.. సినీ ఫక్కీలో బీటెక్ ర‌వి కారును పోలీసులు చుట్టుముట్టి కిడ్నాప్‌ తరహాలో బలవంతంగా తమతో తీసుకెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించే ముందు జనవరి 25న కడప చేరుకుని  కడపలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద దర్గా, మరియాపురం చర్చిల్లో పార్థనలు చేశారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు బీటెక్‌ రవి టీడీపీ శ్రేణులతో కలసి అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అప్పట్లో బీటెక్‌ రవిపై వల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో సెక్షన్‌ 324 కింద కేసు నమోదు చేశారు. ఇది జరిగి పది నెలలు దాటింది. దానిని ఇప్పుడు నాన్‌బెయిలబుల్‌గా మార్చారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పులివెందుల నుంచి కడపకు వెళ్తున్న బీటెక్‌ రవిని యోగి వేమన యూనివర్సిటీ వద్ద కమలాపురం సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రవితోపాటు ఆయన గన్‌మెన్ల ఫోన్లను తీసుకుని స్విచ్చాఫ్‌ చేశారు. దీంతో ఆయన సతీమణి, కుటుంబసభ్యులు ఆందోళనచెందారు. బీటెక్‌ రవిని అరెస్టు చేశారా, అగంతకులు కిడ్నాప్‌ చేశారా అనేది తెలియక కడప ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, డీఎస్పీ ఎండీ ష‌రీఫ్‌కు పలుమార్లు ఫోన్‌ చేసినప్పటికీ స్పందనలేదు. చివరికి ఆయనను అరెస్టు చేసినట్లు స్పష్టమైంది. రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం రాత్రి 11గంటల సమయంలో కడప మేజిస్ర్టేట్‌ ముందు హాజరుపరిచారు.

Also Read:  Hyderabad : సదర్ ఉత్సవ్ మేళా దృష్ట్యా హైద‌రాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు