Site icon HashtagU Telugu

AP PAC Chairman: ఏపీ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. అసెంబ్లీ నిరవధిక వాయిదా!

Ap Pac Chairman Post

Ap Pac Chairman Post

AP PAC Chairman: ఆంధ్రప్రదేశ్ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా శ్రీరాం రాజగోపాల్‌, బీవీ జయనాగేశ్వర్‌ రెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, ముత్తుముల అశోక్‌ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికలో కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకొని.. పులపర్తి రామాంజనేయులను ఎన్నుకున్నారు.

పీఏసీ ఎన్నిక జరగడం ఇదే తొలిసారి:

పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) సభ్యులుగా తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరిగాయి. సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో, ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఈ ఎన్నికలో పులపర్తి రామాంజనేయు విజయం సాధించారు.

అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. 2047 విజన్ డాక్యుమెంట్‌ను ప్రవేశపెట్టామని, 1999లో ధరలు పెంచడం అనివార్యంగా జరిగిందని వివరించారు. ప్రజలు నమ్మారని, అందుకు అనుగుణంగా 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని తెలిపారు. నేర రాజకీయాలు చేస్తాం అంటే ఊరుకునేది లేదన్న సీఎం సంపద కలిగిన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఏపీ తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

చంద్రబాబు 4.0 – వెర్షన్ 1 ప్రారంభం:

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రణాళికలను తెలియజేస్తూ, “చంద్రబాబు 4.0″లో వెర్షన్ 1 ప్రారంభం ఆరంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తా. డిసెంబర్ నుండి అమరావతి పనులు ప్రారంభం అవుతాయి. ఆరు నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌తో పాటు, ఆలిండియా సర్వీసెస్ ఆఫీసర్ల క్వార్టర్స్ నిర్మాణం పూర్తి చేస్తాం. మూడేళ్లలో అమరావతికి ఒక రూపం ఇచ్చి, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. డిసెంబర్ నుండి నా ప్రభుత్వం గేర్ మార్చుకుంటుంది. మీరు కూడా నాతో కలిసి పనిచేయాలి. అమరావతి పూర్తయ్యాక, ఏడాదికి రూ. 10 నుండి 15 వేల కోట్లు వచ్చేలా మేము చేస్తాం.” అని చెప్పారు.

జగన్ అక్రమాలు, అవినీతిపై బీజేపీ విరుచుకుపడింది:

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఈ సందర్భంగా “అక్రమాలలో జగన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. అవినీతి మూలాలు అన్నీ జగన్ వైపునే చూపిస్తున్నాయి. గంగవరం వాటాలను రూ.651 కోట్లకు అదానీకి అమ్మారని ఆరోపించారు. జగన్‌ స్కామ్‌లపై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని” వ్యాఖ్యానించారు.

ఏపీ అసెంబ్లీ 10 రోజుల పాటు కొనసాగింది:

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 10 రోజుల పాటు సమావేశాలు కొనసాగాయి. మొత్తం 59 గంటల 57 నిమిషాలు సభ కొనసాగింది. ఈ సమయంలో 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. 21 బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సమావేశాలు అనంతరం, అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది.