Bird Flu: తూర్పుగోదావరి జిల్లాలో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరణానికి బర్డ్ ఫ్లూ కారణమని అధికారులు నిర్ధారించారు. ముందుజాగ్రత్త చర్యగా కొద్దిరోజుల పాటు చికెన్ తినకుండా ఉండాలని, పౌల్ట్రీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు. పరిస్థితిపై స్పందించిన అధికారులు పలు గ్రామాల్లోని కోళ్ల ఫారాల నుంచి నమూనాలు సేకరించారు. కానూరు గ్రామంలోని పౌల్ట్రీ ఫారం నుంచి వచ్చిన శాంపిల్స్‌లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలిందని పరీక్షల్లో నిర్ధారించారు. బర్డ్‌ఫ్లూ (Bird Flu) వ్యాప్తిపై ఆందోళనల మధ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. మరింత సమాచారం కోసం 9542908025 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.
గత కొన్ని రోజులుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కోళ్లను వణికిస్తున్న ఈ వైరస్ నివారణకు సమగ్ర ప్రణాళికపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం పశుసంవర్ధక, అటవీ, పోలీసు, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కానూరు గ్రామం చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్‌గా ప్రకటించారు. గ్రామానికి ఒక కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ విధించాలని ఆమె పోలీసులను ఆదేశించారు.
Also Read: Chief Minister Chandrababu: ఆలయ ప్రధాన పూజారిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
బర్డ్‌ఫ్లూపై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
మరోవైపు బర్డ్ ఫ్లూ పట్ల తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు.
బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి?
బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా అని కూడా అంటారు. ఈవ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది. ‘హెచ్5ఎన్1’ (H5N1) అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినపుడు మొదట్లో కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రమైనప్పుడు కోడి వివిధ శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటలలో చనిపోతుంది.