నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామ పరిసరాల్లో ఇండోసోల్ సోలార్ కంపెనీ (Indosol Solar Unit) ఏర్పాటు కోసం రైతుల భూములు సేకరించే ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం 8,000 ఎకరాల భూమి కావాలని పేర్కొనగా, ఇప్పటి వరకు 4,500 ఎకరాల భూమికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రకృతి రమణీయంగా, సారవంతమైన పంట భూములను పరిశ్రమ కోసం తీసుకోవడం సరైంది కాదని, తమ జీవనాధారమైన భూములను తాకిపడనివ్వమంటూ రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిని దిగ్బంధించి, గ్రామ సభల్లో ఓటు వేయడం ద్వారా తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఇతర సందర్భాల్లో స్పందనలతో ముందుండే సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఇలా ఎవ్వరూ ఈ విషయంలో స్పందించకపోవడం కలకలం రేపుతోంది. ఎన్నికల ముందు టీడీపీ నేతలు, ముఖ్యంగా లోకేష్ ఈ కంపెనీపై “ఫేక్ కంపెనీ” అని ఆరోపించిన సందర్భాలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు అదే సంస్థపై సైలెంట్ గా ఉండడంతో ప్రభుత్వ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సైతం గతంలో వ్యతిరేకించిన ప్రాజెక్టుపై ఇప్పుడు “ప్రభుత్వం పరిశీలిస్తోంది” అనే మౌనోపదేశంతో తప్పుకుంటోంది.
ఈ కంపెనీకి నిజంగా అంత భారీ పెట్టుబడి ఏలాంటిదో స్పష్టత లేదు. మొదట 5,000 ఎకరాలకు ప్రణాళిక ఉండగా, ఇప్పుడు 8,000 ఎకరాలు అవసరమంటూ చెబుతున్నారు. కంపెనీ స్థాయి, పెట్టుబడి సామర్థ్యం, భూముల అవసరం వంటి అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. గతంలో ఇది జగన్ సర్కార్‌కు అనుకూలంగా వ్యవహరించిన సంస్థగా అభిప్రాయపడిన టీడీపీ నేతలే ఇప్పుడు మౌనం పాటించడం ప్రశ్నలు రేపుతోంది. రైతులు కనీసంగా నివాస, ఉపాధి భద్రత లేకుండా భూములు కోల్పోతున్నారన్న వాదన న్యాయంగానే ఉంది.
సాధారణంగా ఇలాంటివి అధికారపక్షం తప్పు చేస్తే ప్రతిపక్షాలు తగిన రాజకీయ మైలేజ్ కోసం అయినా స్పందిస్తాయి. కానీ ఇండోసోల్ విషయంలో వైసీపీ మౌనమే కాక, కూటమిలోని మిత్రపక్షాలు కూడా నిశ్శబ్దమే కొనసాగిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ప్రభుత్వ ప్రొ-కార్పొరేట్ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల జీవితాలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తున్నా, అధికారికంగా ఎవరూ విషయాన్ని సమర్థించడం గానీ, ఖండించడం గానీ చేయడం లేదు. ఫలితంగా ప్రజల్లో “అప్పుడు ఫేక్, ఇప్పుడు ఫేవరెట్” అనే విమర్శ బలపడుతోంది. ప్రజలకు దీన్ని స్పష్టంగా చెప్పకపోతే ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి రావొచ్చు .