PM Modi : ‘చంద్రుల‌’కు మోడీ గ్ర‌హ‌ణం

మాజీ సీఎం చంద్ర‌బాబుకు ఎలాంటి పరాభ‌వం ఢిల్లీ రూపంలో జ‌రిగిందో ఇంచుమించు అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కు ఎదురైయింది. 2019 ఎన్నిక‌ల ముందు నుంచి మోడీపై చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 12:02 PM IST

మాజీ సీఎం చంద్ర‌బాబుకు (Chandrababu Naidu ) ఎలాంటి పరాభ‌వం ఢిల్లీ రూపంలో జ‌రిగిందో ఇంచుమించు అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) కు ఎదురైయింది. 2019 ఎన్నిక‌ల ముందు నుంచి మోడీపై చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా ప్ర‌స్తావిస్తూ మోడీని టార్గెట్ చేశారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లైన త‌రువాత భార్య‌భ‌ర్త‌లు క‌లిసి ఉండాలి. కానీ, మోడీ భార్య‌ను ఏలుకోలేక‌పోయారు. అలాంటి ఆయ‌న దేశాన్ని ఏమి ఏల‌తారంటూ ఆనాడు చంద్ర‌బాబు విమ‌ర్శ‌లను గుప్పించారు. మోడీ ఇమేజ్ ను వీలున్నంత డామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. రాష్ట్రానికి వచ్చిన ప్ర‌ధాన మంత్రికి బెలూన్ల‌తో నిర‌స‌న తెలిపారు. గో బ్యాక్ మోడీ అంటూ టీడీపీ క్యాడ‌ర్ పెద్ద‌పెట్టున నినాదాలు చేస్తూ వెంట‌బ‌డింది. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మోడీ ఎక్క‌డ ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ న‌ల్ల‌టి జెండాలు, బెలూన్ల‌తో నిర‌స‌న తెలిపేలా ప్లాన్ చేశారు. నువ్వా? నేనా? అన్న‌ట్టు బాబు యుద్ధానికి దిగారు. కేంద్ర సంస్థ సీబీఐని రాష్ట్రంలోకి ప్ర‌వేశించ‌కుండా తీర్మానం చేశారు. ఆ స్థాయిలో మోడీ వ‌ర్సెస్ చంద్ర‌బాబు గేమ్ న‌డిచింది. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఇద్ద‌రి మ‌ధ్యా `ఇగో` వ్య‌వ‌హారం న‌డిచింది. సీఎం హోదాలో చంద్ర‌బాబుకు ఏడాదిన్న‌ర పాటు పీఎంవో అపాయిట్మెంట్ ఇవ్వ‌లేదు. ఫ‌లితంగా ఇద్ద‌రి మ‌ధ్యా వార్ జ‌రిగింది.

ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం విలువ ఇవ్వ‌డంలేదు. ప్రొటోకాల్ ప్ర‌కారం కేసీఆర్ కు ఇవ్వాల్సిన గౌర‌వం ల‌భించ‌డంలేదు. ఇటీవ‌ల ముచ్చింత‌ల్ స‌మ‌తామూర్తి విగ్ర‌హం (Statue Of Equality ) ఆవిష్క‌ర‌ణ‌కు వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ వెళ్ల‌లేదు. ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసీఆర్ దూరంగా ఉన్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ప్ర‌ధాని మంత్రి కార్యాల‌యం కేసీఆర్‌ను వ‌ద్ద‌ని వారించిన విష‌యాన్ని తాజాగా మంత్రి కేటీఆర్ ( Minister KTR) బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు, క‌రోనా స‌మ‌యంలో భార‌త్ బ‌యోటెక్ విజిట్ (Bharath Biotech) కు ప్ర‌ధాని వ‌చ్చిన‌ప్పుడు కూడా సీఎం కేసీఆర్ ను వ‌ద్ద‌ని ప్ర‌ధాని కార్యాల‌యం చెప్పింద‌ట‌. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా `ఇగో` వ్య‌వ‌హారం న‌డుస్తోంది. ఆనాడు చంద్ర‌బాబు, మోడీ మ‌ధ్య న‌డిచిన విధంగానే నువ్వా? నేనా? అనే రీతిలో మోడీ, కేసీఆర్ మ‌ధ్యా రాజ‌కీయం న‌డుస్తోంది.

చైనా, భార‌త్ స‌రిహ‌ద్దుల్లో ఏమి జ‌రుగుతుందో తెలుసుకోలేని ద‌ద్ద‌మ్మంటూ ప్ర‌ధాని మోడీపై కేసీఆర్ విరుచుకుప‌డుతున్నారు. దేశాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. హైద‌రాబాద్ లోని కంటోన్మెంట్ ఏరియాకు క‌రెంట్‌, నీరు క‌ట్ చేస్తామంటూ హెచ్చ‌రించే స్థాయికి టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య వైరం వెళ్లింది. ఎప్పుడూ లేనివిధంగా ఈసారి వ‌రి ధాన్యం విష‌యం కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య వివాద‌స్ప‌దం అయింది. ఆ క్ర‌మంలో న‌రేంద్ర మోడీ (PM Narendra Modi) స‌ర్కార్ ను వీలున్నంత డామేజ్ చేసే ప్ర‌య‌త్నం టీఆర్ఎస్ చేసింది. మోడీయేత‌ర ప్ర‌భుత్వాన్ని ఇప్పుడు కేసీఆర్ కోరుకుంటున్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే సీరియ‌స్ గా అడుగుల వేశారు. కాంగ్రెస్ తో కూడిని యూపీయేను అధికారంలోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ ప‌క్షాన నిల‌బ‌డుతున్నారు. ప్ర‌శాంత్ కిషోర్ (Prashanth Kishor) తో మంత‌నాలు సాగిస్తూ మోడీ టార్గెట్ గా వెళ్లాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే, దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్ట‌డానికి కూడా సిద్ధ‌మే అంటూ కేసీఆర్ ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌క‌టించారు.

ఆనాడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డానికి అవినీతిపై సీబీఐ రంగంలోకి దిగుతోంద‌ని బీజేపీ (BJP) ప్ర‌చారం చేసింది. అందుకే, సీబీఐకి ఎంట్రీ లేకుండా ఏపీ స‌ర్కార్ అప్ప‌ట్లో ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్పుడు కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామంటూ తెలంగాణ బీజేపీ ప‌దేప‌దే చెబుతోంది. కాళేశ్వ‌రంతో పాటు ప‌లు అంశాల‌ను చూపిస్తూ ఈడీ దాడులు చేయ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐటీ దాడులు కూడా ఉంటాయ‌ని కేసీఆర్ కుటుంబం భావిస్తోంది. అందుకే, రండి చూసుకుందామంటూ మంత్రి కేటీఆర్ స‌వాల్ విసురుతున్నారు. మోడీకి వ్య‌తిరేకంగా ఆనాడు చంద్ర‌బాబు ధ‌ర్మ‌యుద్ధం చేసిన‌ట్టే ఇప్పుడు కేసీఆర్ కూడా వార్ ను షురూ చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వ‌లేద‌ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు స‌మాచారాన్ని టీఆర్ఎస్  (TRS) చేర‌వేస్తోంది. అంతేకాదు, దేశాన్ని పాలించే స‌త్తా మోడీకి లేదంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. జాతీయ వ్య‌వ‌సాయ పాల‌సీ కావాల‌ని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తానంటే ఏమిటో చూపిస్తానంటూ స‌వాల్ చేస్తున్నారు. గుజ‌రాత్ కిలాడీ మోడ‌ల్ ను చూపించి మోసం చేసిన మోడీకి తెలంగాణ గోల్డెన్ మోడ‌ల్ రుచిచూప్తిస్తానంటూ హెచ్చ‌రిస్తున్నారు.

మొత్తం మీద ఆనాడు చంద్ర‌బాబుకు జ‌రిగిన అవ‌మానం ఇప్పుడు కేసీఆర్ కు ట‌చ్ చేసింది. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం చేస్తోన్న అవ‌మానాల‌ను తెలంగాణ సీఎం త‌ట్టుకోలేక‌పోతున్నారు. 2019లో ఓడిపోవ‌డంతో చంద్ర‌బాబు ఏమీచేయ‌లేని ప‌రిస్థితుల్లో మౌనంగా ఉన్నారు. కానీ, కేసీఆర్ మాత్రం త‌ఢాఖా చూపిస్తానంటూ దూకుడుగా ముందుకు క‌దులుతున్నారు. మోడీపై వార్ షూరూ చేసిన కేసీఆర్ 2019లో చంద్ర‌బాబు మాదిరిగా మిగులుతారా? చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తారా? అనేది ఆస‌క్తిక‌ర అంశం.