TDP Protest : ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మార్పు ర‌గ‌డ

డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీని డాక్ట‌ర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చుతూ అసెంబ్లీలో బిల్లు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ అసెంబ్లీలో లోప‌ల‌, బ‌య‌ట నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి.

  • Written By:
  • Publish Date - September 21, 2022 / 01:06 PM IST

డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీని డాక్ట‌ర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చుతూ అసెంబ్లీలో బిల్లు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ అసెంబ్లీలో లోప‌ల‌, బ‌య‌ట నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వ‌ద్ద‌కు దూసుకు వెళ్లారు. ప్ల కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ స్పీక‌ర్ ను చుట్టుముట్టారు .బిల్లును నిర‌సిస్తూ ప్లే కార్డుల‌ను చించివేసి స్పీక‌ర్ ఛాంబ‌ర్ మీద విసిరారు. దీంతో స‌భ అదుపు త‌ప్పింది. బిల్లుపై చ‌ర్చించ‌డానికి అనువుగా ఉండేలా టీడీపీ స‌భ్యుల్ని స్పీక‌ర్ స‌స్సెండ్ చేశారు.

ఎన్టీఆర్ పేరును తొల‌గిస్తున్నార‌ని అసెంబ్లీ సాక్షిగా తెలుసుకున్న ఏపీ ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. హెల్త్ యూనివ‌ర్సిటీ కి డాక్ట‌ర్ ఎన్టీఆర్ పేరు తొల‌గించ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. మ‌రో వైపు అసెంబ్లీలో లోప‌ల ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంపై వైసీపీ స‌మ‌ర్థించుకునేలా ఎదురుదాడికి దిగింది. చంద్ర‌బాబు ఎన్టీఆర్ ను ప‌లు సంద‌ర్భాల్లో అవ‌మానించిన ఘ‌ట్టాల‌ను ప్ర‌స్తావించారు. ఆనాడు ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేశార‌ని రాజీనామా చేసిన యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ అసెంబ్లీ బ‌య‌ట ఆరోపించారు. ఇక మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని, రోజాలు ఇద్ద‌రూ చంద్ర‌బాబు ప‌లు చోట్ల ఎన్టీఆర్ కు చేసిన అవ‌మానాల పేప‌ర్ క్లిప్పింగ్ ల‌ను ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు, ఏబీఎన్ న్యూస్ ఛాన‌ల్ ఎండీ రాధాకృష్ణ‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఆరోగ్య‌శ్రీ గురించి ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాష‌ణ వీడియోల‌ను అసెంబ్లీలో ప్ర‌ద‌ర్శించారు. ఆ సంద‌ర్భంగా ఎన్టీఆర్ గురించి వాళ్లిద్ద‌రూ వాడిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను వినిపించారు.

యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టాలనే అంశంపై అసెంబ్లీ అట్టుడుకింది. వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పేరు మార్చొద్దని, ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కడప జిల్లా పేరును తాము మార్చలేదని ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు తెలిపారు. ప్రశ్నోత్తరాల మధ్యే సభలో గందరగోళం నెలకొంది. మరోపైపు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టామని చెప్పారు. ఈ గందరగోళం మధ్య సభను 10 నిమిషాల సేపు స్పీకర్ తమ్మినేని వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమయినప్పటికీ రచ్చ కొనసాగింది.

టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ, ఎన్టీఆర్ పేరు తొలగింపు ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని అన్నారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారని చెప్పారు.
`ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో టీడీపీ ప్రభుత్వంలో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టాము. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్సార్ సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోంది. ` అని అన్నారు.

`ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్లు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, వైఎస్సార్ కు ఏం సంబంధం ఉంది?` దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగించాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.