AP Ministers: ఆంధ్ర ప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులకు గౌరవప్రదమైన జీవనం అందించడం లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు తెలిపారు. ఈ చట్టం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు రక్షణ కవచంలాంటి విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని వారు స్పష్టం చేశారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్‌లో జరిగిన బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనపై తొలి సమావేశంలో, బీసీ సామాజిక వర్గానికి చెందిన 8 మంది మంత్రులు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎస్. సవిత, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ సహా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.
మొదటగా, బీసీ రక్షణ చట్టం ఆవశ్యకతను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వివరించారు. జగన్ హయాంలో బీసీల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కరవైందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల అడ్డంకిగా మారుతున్న బీసీల దుస్థితిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాదయాత్రలలో స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. బీసీలను ఆదుకోవాలని నిర్ణయించినప్పుడు, బీసీ డిక్లరేషన్‌ను ముఖ్యమంత్రి మరియు మంత్రి ప్రకటించారు.
ఇటీవలే, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేశారని మంత్రి సవిత తెలిపారు. ఆదరణ వంటి పథకాల అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో, బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పన కోసం చర్యలు చేపట్టారు. కులపరంగా మరియు వ్యక్తిగతంగా దూషించినప్పుడు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో అమలు చేయబోయే ఈ చట్టం దేశంలోనే తొలిసారని మంత్రి అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, బీసీ చట్టం రూపకల్పనలో న్యాయ నిపుణుల సూచనలను తీసుకోవాలని తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ, చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలన్నారు. ఇందుకోసం ఇతర చట్టాలను అధ్యయనం చేయాలని సూచించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, జగన్ హయాంలో బీసీలపై జరిగిన దాడులను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చట్టం రూపొందించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిర్ణయించారని పేర్కొన్నారు.
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో బీసీల రక్షణకు తీసుకునే చర్యలను పరిశీలించి, చట్టం రూపకల్పనలో వినియోగించాలన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్మాట్లాడుతూ, చట్టం బీసీలకు రక్షణ కవచంలా ఉండాలని పేర్కొన్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ మరియు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, బీసీ రక్షణ చట్టం రూపకల్పనలో మరిన్ని పర్యాయ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.