AP Pvt Medical Colleges: ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజులుం

ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు మెడికల్ కాలేజీల ఫీ"జులుం" ఆగడం లేదు. ఓ వైపు మెడికల్ పీజీ స్టూడెంట్స్.. మరోవైపు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 7, 2022 / 02:15 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు మెడికల్ కాలేజీల ఫీ”జులుం” ఆగడం లేదు. ఓ వైపు మెడికల్ పీజీ స్టూడెంట్స్.. మరోవైపు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే మెడికల్ పీజీ స్టూడెంట్స్ ఫీజులను తగ్గిస్తూ, ఓ స్థాయిలో ఫిక్స్ చేస్తూ మార్గదర్శకాలు వచ్చాయి. కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవేం పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ఆ నిబంధనలు తమకు వర్తించవు అన్నట్టుగా ఫీజుల దోపిడీకి తెగబడుతున్నాయి.

పీజీ మెడికల్ లో దోపిడీ..

కేటగిరి -ఏ కాలేజీల్లో పీజీ మెడికల్ విద్యార్థుల ఫీజు రూ.4.32 లక్షలు, కేటగిరి -బీ కాలేజీల్లో ఫీజు రూ.8.64 లక్షలు, కేటగిరి -సీ కాలేజీల్లో రూ.50 లక్షలుగా ఇటీవల ఫిక్స్ చేశారు. ఇంతకుముందు ఏ, బీ, సీ కేటగిరీలలో ఫీజులు భారీగా రూ.7.5 లక్షలు, రూ.25 లక్షలు, రూ.75 లక్షలు ఉండేవి. అంటే ఫీజులు ఇటీవల చాలా భారీగా తగ్గించారన్న మాట. ఈ తగ్గింపు ప్రయోజనాలను మెడికల్ విద్యార్థులు పొందకుండా ఉండేందుకు పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కొత్త ప్లాన్ వేశాయి. అడ్డ దారుల్లో, అనవసర సాకులతో అదనపు బాదుడుకు తెరతీశాయి.

బాదుడు ఇలా..

పీజీ మెడికల్ ఫీజులు తగ్గిన నేపథ్యంలో ఆ మొత్తాన్ని రికవర్ చేసుకునేందుకు కాలేజీలు కొత్త దారులు వెతుకుతున్నాయి. ఈక్రమంలోనే ప్రతి విద్యార్థి అవసరం ఉన్నా.. లేకున్నా హాస్టల్ వసతిని తీసుకోవాల్సిందే అని తేల్చి చెబుతున్నాయి. ఇందుకోసం ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఏటా నిర్వహించే స్పోర్ట్స్ మీట్, లైబ్రరీ ఖర్చుల పేరిట మరో లక్ష రూపాయలు కూడా పీజీ మెడికల్ స్టూడెంట్స్ తో కట్టించుకుంటున్నారు. పీజీ మెడికల్ కోర్సు మొత్తానికి కట్టించుకునే రూ.50వేల రీఫండబుల్ ఫీజును కూడా కోర్సు ముగిసే సమయంలో రీఫండ్ చేయడం లేదు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల స్థాయిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీజీ విద్యార్థులకూ స్టై పెన్డ్ చెల్లించాలి. కానీ ప్రైవేట్ లో చాలా తక్కువగా ప్రతినెల రూ.30వేల స్టై పెన్డ్ మాత్రమే స్టూడెంట్స్ కు చెల్లిస్తున్నారు.ఇక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నుంచి కేవలం నాలుగున్నర ఏళ్ల ఫీజే వసూలు చేయాలి. కానీ ఐదేళ్ల ఫీజు గుంజుతున్నారు.

Cover Image: File