Droupadi Murmu: తిరుమల శ్రీవారి సేవలో ద్రౌపతి ముర్ము

భారత రాష్ట్రపతి ఏపీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - December 5, 2022 / 11:56 AM IST

భారత రాష్ట్రపతి ఏపీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం రాష్ట్రపతి తిరుమలను దర్శించుకున్నారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలు దేరి తిరుమల సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. అనంతరం వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.

ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. పెద్దజీయంగార్‌ స్వామి, చిన్నజీయంగార్‌ స్వామి ఆమె వెంట ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని , సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి రాష్ట్రపతికి వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం తీర్థప్రసాదాలను ద్రౌపతి ముర్ముకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రులు శ్రీ నారాయణ స్వామి, సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి రోజా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి , అదనపు డిజి శ్రీ రవిశంకర్ అయ్యర్ ఉన్నారు. రాష్టప్రతి ముర్మును చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.