Kanakadurga Temple: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పవన్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు, తరువాత ఆయన ఆలయ మెట్లను శుభ్రం చేశారు.
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్లు కడిగిన తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Telegram : టెలిగ్రాం యూజర్లకు అలర్ట్.. పావెల్ దురోవ్ సంచలన ప్రకటన
మరోవైపు ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కల్యాణ్ తిరుమలలో విరమించనున్నారు. ఈ మేరకు ఆయన అక్టోబర్ 1న తిరుపతి వెళ్లనున్నారు. అలిపిరి మెట్లమార్గంలో నడుచుకుంటూ తిరుమల కొండకు చేరుకుంటారు. అక్టోబర్ 2న ఉదయం శ్రీవారి దర్శించుకుంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభను నిర్వహించనున్నారు.
కాగా, తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంకటేశ్వరస్వామిని క్షమించమంటూ పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల దీక్ష ప్రస్తుతం కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శించిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కళ్యాణ్ విరమించనున్నారు.