ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ వ్యవహారం (Fibernet Issue) రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫైబర్ నెట్ ఎండీ(Fibernet New MD)గా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్య(Praveen aditya)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మారిటైం బోర్డు సీఈవోగా ఉన్న ప్రవీణ్ ఆదిత్యకు అదనపు బాధ్యతగా ఫైబర్ నెట్ ఎండీ పదవి అప్పగించారు. అంతేకాకుండా బదిలీ అయిన దినేష్ కుమార్ నిర్వహిస్తున్న డ్రోన్, గ్యాస్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు కూడా ప్రవీణ్ ఆదిత్యకే అప్పగించారు. ఇక దినేష్ కుమార్‌ను అన్ని పోస్టుల నుంచి తొలగించి, ఆయనకు కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
జీవీ రెడ్డి రాజీనామాతో మరింత ముదిరిన వివాదం
ఫైబర్ నెట్‌లో అవినీతి ఆరోపణలు తెరపైకి రావడంతో ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా, టీడీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నేతలను కాపాడేందుకు ఎండీ దినేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని, తాను తొలగించమని సూచించిన 410 మంది ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందుతున్నాయని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మకు చెల్లించిన డబ్బుల విషయంలో కూడా దినేష్ కుమార్ ఏ చర్యలు తీసుకోలేదని జీవీ రెడ్డి మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలు పార్టీలో తీవ్రతను పెంచేలా ఉన్నాయన్న కారణంతో జీవీ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలపై ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది.
జీవీ రెడ్డి వైదొలగడంపై టీడీపీ హైకమాండ్ స్పందన
జీవీ రెడ్డి రాజీనామా టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. సోషల్ మీడియా వేదికగా ఆయనకు మద్దతు తెలిపిన కార్యకర్తలు, ఆయనకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. అయితే, టీడీపీ హైకమాండ్ మాత్రం జీవీ రెడ్డి పార్టీ నిర్ణయాలను బహిరంగంగా ధిక్కరిస్తున్నట్లు మాట్లాడుతున్నారని పేర్కొంది. మొదటి విడత కార్పొరేషన్ ఛైర్మన్‌ల జాబితాలో ఆయనకు పదవి రాకపోయినా, రెండో జాబితాలో ఫైబర్ నెట్ కీలక బాధ్యతలు అప్పగించారని పేర్కొంది. కానీ ఆయన ఆ పదవిని రాజకీయ ప్రయోజనాలకు కాకుండా, వ్యక్తిగత నిర్ణయాలతో నడిపించేందుకు ప్రయత్నించడంతోనే వివాదం ఏర్పడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో చివరికి జీవీ రెడ్డి సొంతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
SLBC Tunnel Accident : జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటుకు కేటీఆర్ డిమాండ్