Site icon HashtagU Telugu

PK on AP: ఏపీలో వైసీపీతో పొత్తుకు సిద్ధమవ్వాలన్న ప్రశాంత్ కిషోర్… కాంగ్రెస్ కు వర్కవుటవుతుందా?

Prashant Kishor Ys Jagan 1 Imresizer

Prashant Kishor Ys Jagan 1 Imresizer

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పవంటారు. దానిలో భాగంగా.. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవచ్చని స్కెచ్ వేశారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం.

అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టిందే.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా సాధ్యం? దీనికి విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ఆనాడు తెలుగుదేశం పార్టీ పుట్టింది కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే. అయినా తెలంగాణలో కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది కదా అని గుర్తు చేస్తున్నారు. అయినా ఆ పొత్తు వర్కవుట్ కాలేదు. అయితే అప్పుడు సరైన విజన్ లేదని.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాత్రం పక్కా డేటాతో ప్రణాళిక రూపొందించారని అంటున్నారు.

జగన్ కు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండానే 151 సీట్లు గెలుచుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే.. వేరేవారితో సర్దుకుపోయే మనస్తత్వం కాదని.. అలాంటప్పుడు పొత్తుల్లో పట్టువిడుపులు ఆయనకు అస్సలు పడవని అంటున్నారు. అయినా ఆయన ఇప్పటికే ఎన్డీఏతో అనధికారికంగా పొత్తులో ఉన్నారని.. ఆ సంగతి మరిచిపోవద్దని చెబుతున్నారు.

మోదీ, అమిత్ షాలు అంటే భయంతో కూడిన గౌరవంతో ఉండే జగన్.. వాళ్లను కాదని.. కాంగ్రెస్ తో పొత్తు కట్టడం అంత సులభం కాదు. పైగా కిందటి ఎన్నికల్లో మోదీ, అమిత్ షాలను ఎదిరించిన టీడీపీ పరిస్థితి ఏమైందో చూడాలంటున్నారు విశ్లేషకులు. అందుకే ఏ రకంగా చూసినా జగన్ తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా.. ఆయన మాత్రం అందుకు నో చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.