Prashant Game on AP: `పొత్తు` పై న‌మ్మ‌లేని `పీకే` అబ‌ద్ధం

`ప్ర‌త్యేక హోదా ఎవ‌రిస్తే వాళ్ల‌కే మ‌ద్ధ‌తు. అది ఏ పార్టీ అయినా పొత్తుకు సిద్ధం..` అంటూ 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా వైసీపీ చీఫ్ జ‌గ‌న్ చెప్పిన మాట‌. సీన్ క‌ట్ చేస్తే, 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత `ప్ర‌త్యేక హోదా దేవుడి ద‌య ఉంటే వ‌స్తుంది. బీజేపీ ప్ర‌భుత్వానికి ఎవ‌రి అవ‌స‌రం లేనంత మెజార్టీ సాధించింది.

  • Written By:
  • Updated On - April 22, 2022 / 01:15 PM IST

`ప్ర‌త్యేక హోదా ఎవ‌రిస్తే వాళ్ల‌కే మ‌ద్ధ‌తు. అది ఏ పార్టీ అయినా పొత్తుకు సిద్ధం..` అంటూ 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా వైసీపీ చీఫ్ జ‌గ‌న్ చెప్పిన మాట‌. సీన్ క‌ట్ చేస్తే, 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత `ప్ర‌త్యేక హోదా దేవుడి ద‌య ఉంటే వ‌స్తుంది. బీజేపీ ప్ర‌భుత్వానికి ఎవ‌రి అవ‌స‌రం లేనంత మెజార్టీ సాధించింది. ఢిల్లీ పోయిన ప్ర‌తిసారీ హోదా గురించి అడుగుతూనే ఉంటా..` అంటూ జ‌గ‌న్ ముక్తాయించారు. కానీ, ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదా డిమాండ్ ను జ‌గ‌న్ చేయ‌లేక‌పోతున్నారు. పైగా ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ రిక్వెస్ట్ చేస్తాన‌న్న ఆయ‌న ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా హోదా గురించి పూర్తిగా మ‌రిచిపోయారు. ఆ ప్ర‌స్తావ‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని క‌లిసిన సంద‌ర్భంగా తీసుకురాలేక‌పోయారు.
ఏపీలో నామ‌రూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక‌హోదా ఇస్తానంటోంది. ఆ మేర‌కు రాహుల్ గాంధీ ప్ర‌కటించారు. కాంగ్రెస్ లేదా యూపీఏ అధికారంలోకి వ‌స్తే హోదా మీద తొలిసంత‌కం పెడ‌తానంటూ ఆయ‌న అంటున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందుగా ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీనీ ఛీత్క‌రించుకున్నారు. ఉమ్మ‌డి ఏపీని విడ‌గొట్ట‌డం ద్వారా తీర‌నిద్రోహం కాంగ్రెస్ చేసింద‌నే బ‌ల‌మైన ముద్ర ఆ పార్టీ మీద ఉంది. దాన్ని ఏపీ ప్ర‌జ‌ల్లో చెరిపేయ‌డం చాలా క‌ష్టం. రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిన సోనియా, రాహుల్ అంటే ఏపీ ప్ర‌జ‌ల‌కు ఏవ‌గింపు. అందుకే, ఆ పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో రెండు శాతం ఓట్లు మాత్రం ప‌డ్డాయి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ కూడా లేదు. ఆ పార్టీకి చెందిన లీడ‌ర్లు కూడా మొఖం చెల్ల‌క ప్ర‌జ‌ల మ‌ధ్య రాలేక‌పోతున్నారు. అంత‌టి వ్య‌తిరేక‌త ఉన్న పార్టీతో వైసీపీ పొత్తు అనే అంశాన్ని ప్ర‌శాంత్ కిషోర్ ద్వారా తెర‌మీద‌కు తీసుకురావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ 2019 ఎన్నిక‌ల్లో చావు దెబ్బతింది. ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీని కూడా దూరంగా పెట్టారు. ఇలాంటి అనుభ‌వాలు చూసిన త‌రువాత కూడా ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చినంత మాత్ర‌న జ‌గ‌న్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. బీజేపీ, జ‌న‌సేన పొత్తు కోసం టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. అదే , జ‌రిగితే కాంగ్రెస్‌, క‌మ్యూనిస్ట్ లు ఆ కూటమిలో క‌లిసే ఛాన్స్ లేదు. ప్ర‌త్యామ్నాయంగా వైసీపీ ప‌క్షాన కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ లు క‌ల‌వ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. కానీ, బ‌లంగా ఉన్న వైసీపీకి ఆ పార్టీల అవ‌స‌రం లేదు. పైగా సోనియా గాంధీ కుటుంబం నుంచి ప‌రాభ‌వాల‌ను, ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న జ‌గ‌న్ మ‌ళ్లీ ద‌గ్గ‌ర కావ‌డం ఊహించ‌డానికి కూడా ఆస్కారం లేదు. ఇలాంటి వాస్త‌వాల‌కు భిన్నంగా ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు ప్ర‌తిపాద‌న ఎలా తీసుకొస్తాడు? మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయం అవసరం లేదని ఆ పార్టీ కోర్ టీమ్ భావిస్తోంది. 2014 మరియు 2019 రెండు ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకున్న జ‌గ‌న్‌, తొలి ఎన్నికల్లో విజయం సాధించలేక పోయారు. రెండో సారి ఎన్నికల్లో రికార్డు సృష్టించారు. రెండు సార్లు ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేసిన జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహంలో మాస్టర్‌గా మారినట్లు వైసీపీ టీమ్ చెబుతోంది. మూడేళ్లుగా అధికారంలో ఉండటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేతకు తదుపరి ఎన్నికలను సొంతంగా ప్లాన్ చేసుకోవడం ఉపయోగపడింది. జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు నేర్చుకుని వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విష‌యాన్ని ఆ పార్టీ నేత‌లు ప‌లుమార్లు మీడియా వేదిక‌గా చెప్పారు.
పందులు గుప్పుగా వచ్చిన‌ప్ప‌టికీ( విప‌క్షాలు)సింహం సింగిల్ (వైసీపీ)గా వ‌స్తుంద‌ని మాజీ మంత్రి కొడాలి నాని ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించిన విష‌యం విదిత‌మే. జాతీయ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తరపున పనిచేయడం కూడా జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేద‌ట‌. పైగా ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ను పక్కన పెట్టి తదుపరి ఎన్నికలకు వెళ్లాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్త‌వాలు ఇలా ఉండ‌గా, సోనియా వ‌ద్ద ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌, వైసీపీ పొత్తు ప్ర‌స్తావించార‌ని మీడియాలో మైండ్ గేమ్ ప్రారంభం అయింది. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యేందుకు రాజకీయంగా వ్యూహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాల పైన పూర్తి అవగాహన ఉంది.

ఆయన చేసిన తాజా ప్రతిపాదన వెనుక వ్యూహాలు ఏంటనేది కీలకంగా మారింది ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదన పైన జగన్ సుముఖత వ్యక్తం చేస్తారా ? అంటే వంద‌కు వంద శాతం ఒప్పకోరు అనేది ఆ పార్టీ నేత‌లు బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుచెప్పటం , ఆ తరువాత జగన్ కొత్త పార్టీ , సీబీఐ కేసులు, 16 నెలల జైలు త‌దిత‌ర అంశాల‌న్నిటికీ కారణమే కాంగ్రెస్ పార్టీ అని వైసీపీ చీఫ్ చెబుతుంటారు. రాష్ట్ర విభజన తో 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఎక్కడా ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా ప్రతిపాదన ను టీడీపీ రాజకీయంగా అందిపుచ్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ దీని పైన శుక్ర‌వారం జ‌రిగే ఒంగోలు సభలో స్పందించే అవకాశం ఉంది. పొత్తుల అంశం పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ – వైసీపీ పొత్తు పైన పీకే చేసిన‌ ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.