KA Paul, Pawan Kalyan : పొలిటిక‌ల్ `కొస‌రు` సింహాలు!

ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌, జ‌న‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వాల‌కం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది.

  • Written By:
  • Publish Date - June 6, 2022 / 01:01 PM IST

ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌, జ‌న‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వాల‌కం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు లోక్ స‌త్తా పార్టీ ఏ విధంగా సామాన్యుల‌ను ప్ర‌భావం చేయ‌డానికి పోటీ ప‌డిందో, ఇంచుమించు అదే విధంగా ప్ర‌జాశాంతి పార్టీ(పీఎస్ పీ), జ‌న‌సేన పార్టీ(జేఎస్ పీ) దూకుడుగా వెళుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీలు ఓట‌ర్లను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయ‌డాన్ని గ‌మ‌నిస్తున్నారు. ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల‌ను పరామ‌ర్శించ‌డానికి క‌రీంన‌గ‌ర్ వెళ్లిన కేఏ పాల్ పై దాడి జ‌ర‌డంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లెవ‌ల్లో రాజ‌కీయాల‌ను నెరిపారు. అదే విధంగా జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ కూడా ఢిల్లీ బీజేపీ అగ్ర‌నేత‌లు న‌డ్డా, షా వంటి వాళ్ల‌తో పాలిటిక్స్ న‌డుపుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. చ‌నిపోయిన కార్య‌క‌ర్త‌ను పరామ‌ర్శించ‌డానికి న‌ల్గొండ వెళ్లిన సంద‌ర్భంగా ఆ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ‌, ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కం కావాల‌ని ప‌వ‌న్ ఎత్తుగ‌డ వేస్తున్నారు. అయితే, బీజేపీతో క‌లిసి వెళ‌తారా? విడిగా పోటీ చేస్తారా? అనే ప్ర‌శ్న‌లు వేసుకుంటే మూడు ఆప్ష‌న్లు ఏపీలో ప‌వ‌న్ కు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పోటీకి ఎన్ని ఆప్ష‌న్లు ఉన్నాయో ఇంకా చెప్ప‌లేదు. కానీ, కేఏ పాల్ మాత్రం ఒంటరి పోరుకు సిద్ధ‌మ‌ని తొలి నుంచి చెబుతున్నారు. స‌రికొత్త రాజ‌కీయాన్ని రెండు రాష్ట్రాల్లోనూ తీసుకొస్తాన‌ని ప్ర‌మాణం చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, ప్ర‌జాశాంతి పార్టీ ఏపీ ఎన్నిక‌ల రంగంలోకి తొలిసారిగా దిగాయి. ఆ సంద‌ర్భంగా భీమ‌వ‌రం, న‌ర్సాపురం కేంద్రంగా ఆ రెండు పార్టీల అభ్య‌ర్థుల నామినేష‌న్ల క్ర‌మంలో న‌డిచిన సంఘ‌ట‌న‌లు అంద‌రికీ గుర్తుండే ఉంటాయి.

ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్‌, ప్ర‌పంచశాంతి ధూత కేఏ పాల్. ఒక్క‌సారి అవ‌కాశం ఇస్తే ఆంధ్రాను అమెరికా చేస్తా అంటున్నారు. ఒక్క పైసా ప‌న్ను పెంచ‌కుండా విదేశాల నుంచి విరాళాలు సేక‌రించడం ద్వారా అభివృద్ధి చేస్తానంటూ ప్ర‌జ‌ల్లోకి దూకుడుగా వెళుతున్నారు. అంతేకాదు, జ‌న‌సేన పార్టీ క‌లిసి వ‌స్తే, రాబోవు ఎన్నిక‌ల్లో తాను ప్ర‌ధాన‌మంత్రినై జ‌న‌సేనాని ప‌వ‌న్ ను సీఎం చేస్తానంటూ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను గ‌ద్దె దింప‌డ‌మే లక్ష్యంగా ఆయ‌న ఇటీవ‌ల శాపం కూడా పెట్టారు. ఇలాంటి శాపాన్ని 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌గన్ మీద ప‌వ‌న్ పెట్టిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌త్య‌క్షంగా బీజేపీ, జ‌న‌సేన పొత్తు అని చెబుతున్నాయి. అదే, కేఏ పాల్ మాత్రం అమిత్ షా తో ట‌చ్ లో ఉన్నానంటూ చెబుతూనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో టార్గెట్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేసీఆర్‌, జ‌గ‌న్ లక్ష్యంగా ప‌నిచేస్తాన‌ని మీడియాకు చెబుతున్నారు. ఇంచుమించు అదే టార్గెట్ తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ దూకుడుగా మైండ్ గేమ్ ఆడుతున్నారు.

2019 ఎన్నిక‌ల్లో నామినేష‌న్ల ప‌ర్వంలోనే ప్ర‌జాశాంతి పార్టీ ఏపీలో చేతులెత్తేసింది. ఆనాడు మీడియా వ‌ర‌కు ఆయ‌న ప్ర‌చారం ప‌రిమితం అయింది. ఉత్త‌రాంధ్ర జిల్లాల వ‌ర‌కు మాత్ర‌మే పాల్ రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌లు ప‌రిమితం అయ్యాయి. ఈసారి తెలంగాణ‌, ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌లు అంశాల‌పై నిత్యం ఆయ‌న మీడియా ముఖంగా స్పందిస్తున్నారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా వెళుతున్నారు. జనసేనాని ప‌వ‌న్ 2024 దిశగా పొత్తుల‌పై ఇప్ప‌టి నుంచి మైండ్ గేమ్ కు ప‌దును పెట్టారు. పార్టీ కార్య‌క్ర‌మాలకు మాత్ర‌మే ఎక్కువ‌గా ప‌రిమితం అవుతున్న ఆయ‌న ప్ర‌జా క్షేత్రానికి చాలా అరుదుగా వెళుతుంటారు. వ్యూహాత్మ‌కంగా ఆయ‌న ఆడుతున్న మైండ్ గేమ్ టీడీపీ భ‌విష్య‌త్ కు ముడిపెట్ట‌డంలో కొంత మేర‌కు విజ‌యం సాధించారు. అనివార్యంగా టీడీపీ పొత్తుకు వ‌చ్చేలా తెలివైన రాజ‌కీయ క్రీడ‌ను ఎంచుకున్నారు. ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మాత్రం చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. అటు ప్ర‌జాశాంతి ఇటు జ‌న‌సేన రాజ‌కీయంగా చంద్ర‌బాబు విష‌యంలో భిన్నంగా ఉన్నాయి. బీజేపీతో మాత్రం ప్ర‌త్య‌క్షంగా ఒక‌రు ఉంటే ప‌రోక్షంగా మ‌రొక‌రు అడుగులు వేస్తున్నారు.

సామాజిక‌వ‌ర్గం ప‌రంగా ఇద్ద‌రూ ఒక‌టే. ఒక‌రు ప్ర‌పంచ‌శాంతి దూత అయితే మ‌రొక‌రు పాపుల‌ర్ సినీ హీరో. ఉత్త‌రాంధ్ర మీద ఇద్ద‌రికీ సామాజిక‌వ‌ర్గం ప‌రంగా ప‌ట్టు ఉంది. శాంతిదూత‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా కేఏ పాల్ పాపుల‌ర్‌. సినీ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌న్ కు క్రేజ్ ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తొలి రోజుల్లో హిందుత్వం కోసం పోరాటం చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. సెక్యుల‌ర్ కోసం పోరాడ‌తాన‌ని పాల్ చెబుతున్నారు. క్రిస్టియ‌న్స్ చాలా మంది కేఏ పాల్ కు అభిమానులు ఉన్నారు. పాస్ట ర్స్ కొన్ని వేల మంది తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న్ను ఫాలో అవుతుంటారు. సినీ హీరో ప‌వ‌న్ కు అభిమానులు ఉంటే మ‌త‌ప్ర‌బోధ‌కునిగా పాల్ కు క్రిస్టియ‌న్ల‌లో క్రేజ్ ఉంది. ఇక సామాజిక‌వ‌ర్గం ప‌రంగా పాల్ కంటే ప‌వ‌న్ కు మ‌ద్ధ‌తు ఎక్కువ‌గా ఉంద‌ని అంచ‌నా. ఇలా ప‌లు కోణాల నుంచి చూస్తే, ఆ రెండు పార్టీలు ప్ర‌ధాన పార్టీల గెలుపు ఓటముల మీద ఎంతో కొంత ప్ర‌భావం చూపుతాయ‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జాశాంతి పార్టీ బ‌లం ఎంత అనేది స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేం. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషంలో రంగంలోకి పాల్ దిగారు. అదే, జ‌న‌సేన పార్టీ ఆ ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీలో క‌లిసి వెళ్లింది. ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేయ‌డానికి ఆ పార్టీకి అభ్య‌ర్థులు దొర‌క‌లేదు. పోటీ చేసిన స్థానాల్లో 120 చోట్ల డిపాజిట్ గ‌ల్లంతు అయింది. పార్టీ చీఫ్ ప‌వ‌న్ కు టీడీపీ తెర‌వెనుక మ‌ద్ధ‌తు ఇచ్చిన‌ప్ప‌టికీ రెండు చోట్లా ఓడిపోయారు. ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వ‌రప్ర‌సాద్ గెలిచారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీతో క‌లిసి న‌డుస్తున్నారు. ఆ ఎన్నిక‌ల్లో గ్లాస్ గుర్తుతో పోటీ చేసిన జ‌న‌సేన‌కు ఆ గుర్తు ఈసారి ఉంటుంద‌న్న న‌మ్మ‌కం లేదు. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిన‌ప్ప‌టికీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఓట్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోలైన మొత్తం 3 కోట్ల 14 లక్షల ఓట్లలో జనసేన కేవలం 17 లక్షల 36 వేల ఓట్ల చిల్లర సాధించింది. పార్టీకి కేటాయించిన “గ్లాసు” గుర్తు నిలుపుకోవాలంటే జనసేన కనీసం 8 శాతం ఓట్లు సాధించి ఉండాలి లేదా మొత్తం పోలైన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించి కనీసం ఇద్దరు సభ్యులను శాసనసభకు గెలిపించుకోవాలి. ఈ పరిస్థితుల్లో రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేయవలసి వస్తే గ్లాస్ గుర్తు నిలుస్తుందని ఇదమిద్దంగా చెప్పలేం. అందువల్లే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో జనసేన గుర్తును ఓ స్వతంత్ర అభ్యర్ధికి ఎన్నికల సంఘం కేటాయించింది.

ప్రస్తుతం ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న గ్లాసు గుర్తు ఎవరైనా స్వతంత్ర అభ్యర్థికో, మరో పార్టీ అభ్యర్థికో కేటాయించ‌డానికి అవ‌కాశం ఉంది. ఇక డిపాజిట్ల‌కు కూడా చాలా దూరంగా ఉన్న ప్ర‌జాశాంతి పార్టీ 2019 ఎన్నిక‌ల్లో హెలికాప్టర్ గుర్తు ఎంచుకుంది. హెలికాప్ట‌ర్ సింబ‌ల్ వైసీపీ గుర్తు ఫ్యాన్ కు పోలి ఉంద‌ని ఆనాడు ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. ఈసారి ప్ర‌జాశాంతి పార్టీకి హెలికాప్ల‌ర్ గుర్తు వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేదు. మొత్తం మీద అటు జ‌న‌సేన ఇటు ప్ర‌జాశాంతి పార్టీ వెనుక‌టి సింబ‌ల్స్ పొందుతాయ‌న్న న‌మ్మ‌కంలేని పార్టీల జాబితాలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీల గెలుపు ఓట‌ముల‌ను తారుమారు చేస్తాయ‌న్న మైండ్ గేమ్ లో మాత్రం స‌క్సెస్ కావ‌డం గ‌మ‌నార్హం.