Bal Puraskars : 17 మంది బాలలు జాతీయ స్థాయిలో మెరిశారు. వారికి ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రదానం చేశారు. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో 10 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. స్వయంగా ప్రధాని మోడీ ఈసందర్భంగా వారిని కలిసి అభినందించారు. వారితో మోడీ ముచ్చటించి.. వివిధ రంగాల్లో సాధించిన విజయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సత్కారాన్ని అందుకున్న బాలల జాబితాలో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక జెస్సీ రాజ్ మాత్రపు కూడా ఉంది. క్రీడా విభాగంలో ఆమె సాధించిన అద్భుత ఫలితాలకుగానూ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. జెస్సీ రాజ్.. స్కేటింగ్ విభాగంలో బాగా రాణించారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆమె స్కేటరుగా మంచి పేరు సంపాదించారు. 62వ జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సోలో డ్యాన్స్ విభాగంలో జెస్సీ రాజ్ సిల్వర్ మెడల్‌ను గెల్చుకుంది. అయితే అంతకంటే ముందు దాదాపు మూడేళ్లపాటు ఆమె ఎంతో కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ శ్రమ ఫలించి మెడల్ దక్కింది.
Also Read :Sonu Sood : పిలిచి సీఎం పోస్టును ఇస్తామంటే.. వద్దని చెప్పాను : సోనూ సూద్
బాల పురస్కార్‌లు అందుకున్నది వీరే..
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సింధూర రాజా (ఇన్నోవేషన్ విభాగం), తమిళనాడుకు చెందిన జననే నారాయణన్(ఆర్ట్ అండ్ కల్చరల్ విభాగం), పంజాబ్‌కు చెందిన సాన్వీ సూద్ (స్పోర్ట్స్ విభాగం), జమ్మూకు చెందిన రిషీక్ కుమార్ (టెక్నాలజీ విభాగం), కీయా హట్కర్ (ఆర్ట్ అండ్ కల్చర్ విభాగం), కశ్మీర్‌కు చెందిన 12 ఏళ్ల అయాన్ సజ్జాద్ (కశ్మీరీ సంగీతం విభాగం), 17 ఏళ్ల వ్యాస్ ఓం జిగ్నేష్(సంస్కృత సాహిత్యం విభాగం), 9 ఏళ్ల సౌరవ్ కుమార్(సాహసం కేటగిరీ), 17 ఏళ్ల అయోనా థాపా (సాహసం కేటగిరీ), హేంబటి నాగ్ (జూడో ప్లేయర్), అనీశ్ సర్కార్ (చెస్ ప్లేయర్)లను ఈ పురస్కారాలు(Bal Puraskars) వరించాయి.