Prabhala Theertham : కోనసీమ ప్రభల తీర్థం ఎందుకంత ప్రత్యేకం?

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 08:52 AM IST

కోనసీమలో కనుమ రోజున జరిగే ప్రభల తీర్దానికి (Prabhala Theertham) ఎంత ప్రాముఖ్యత ఉంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రభల తీర్థ మహోత్సవాన్ని కనుమ రోజు ఘనంగా జరుపుకుంటారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థ వేడుకలు చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాదు ఇతర రాష్ట్రాల వారు సైతం పెద్ద సంఖ్యలో వచ్చి ఈ వేడుకలను తిలకిస్తారు. వాకలగరువు, తొండపూడి, గున్నేపల్లి అగ్రహారం, చిరుతపూడిలో ప్రభల మహోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. 420 ఏళ్లుగా ప్రభల మహోత్సవం కొనసాగుతుందని స్థానికులు చెపుతుంటారు. శ్రీశైలం తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న శైవ క్షేత్రాలున్న ప్రదేశం కోనసీమ జిల్లా. అందుకే ఈ ప్రాంతాన్ని వేదసీమ అని కూడా పిలుస్తారు.

మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమనాడు మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రులు సమావేశమై.. లోకరక్షణ కోసం చర్చలు జరిపారని పురాణాలు చెబుతున్నాయి. 17వ శతాబ్ధములో కరువు కాటాకాలతో లోకం అల్లాడుతున్న పరిస్థితుల్లో 11 గ్రామాల రుద్రులు ఈ జగ్గన్నతోటలో లోకకల్యాణార్థం సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ఈనాటి వరకు ప్రబల తీర్థాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కనుమనాడు ఎన్ని అవాంతరాలెదురైనా రుద్రులను ఒక్కచోట చేర్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఏకాదశరుద్రులు అంబాజీపేట మండలంలోని వ్యాఘ్రేశ్వరం నుంచి శ్రీవ్యాఘ్రేశ్వరస్వామి పుల్లేటికుర్రు అభినవవ్యాఘ్రేశ్వరస్వామి, మొసలిపల్లి మధుమానంతభోగేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరుడు, అలాగే గంగలకుర్రు అగ్రహారం నుంచి -వీరేశ్వరుడు, పెదపూడి మేనకేశ్వరుడు, ఇరుసుమండ ఆనందరామేశ్వరుడు, వక్కలంక-విశ్వేశ్వరుడు, నేదునూరు చెన్నమల్లేశ్వరుడు, ముక్కామల రాఘవేశ్వరుడు, పాలగుమ్మి-చెన్నమల్లేశ్వరస్వామి వారి ప్రబలను కనులవిందుగా అలంకరించి మేళతాళాలతో, అత్యంత భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ నామస్మరణలతో గ్రామ గ్రామాల నుంచి జగ్గన్నపేటకు తీసుకువస్తారు.

పంట పొలాలను దాటుకుంటూ కిలో మీటర్ల కొద్దీ యువకులు ఎలాంటి అలసట లేకుండా.. మధ్యలో గోదావరి పాయ, కౌశిక కాలువ దాటి ఈ తోటలోకి ప్రబలను తీసుకువస్తారు. ప్రబలు పొలాలు, కాలువ దాటే సమయంలో ఈ ఘట్టాన్ని తిలకించేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. వరి పంట పొలాన్ని దాటి ప్రబలను మోసుకువస్తుంటే.. ఆ భూ యజమాని ఆపరమేశ్వరుడు తమ చేలగుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారట. అలా ప్రబలు తమ పొలాల్లో నుంచి వెళితే ధన ధాన్యాలతో తులతూగుతామని నమ్ముతారట. అందుకే ప్రతి ఏటా కనుమ రోజు ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుతూ వస్తుంటారు.

Read Also : Shocking Incident Viral : ఫ్లైట్ ఆలస్యం కావడం తో సిబ్బందిపై దాడి చేసిన ప్రయాణికుడు..