Site icon HashtagU Telugu

CM Chandrababu : తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు

Cm Chandrababu (4)

Cm Chandrababu (4)

CM Chandrababu : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకల్లో పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన శ్రీరాముల్ని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆయన పాడె మోయడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి దయనీయమని, ఆ సమయంలో టంగుటూరు ప్రకాశం పంతులు, ఘంటసాల వంటి మహనీయులు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. శ్రీరాముల ఆత్మార్పణతో 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన వివరించారు.

పొట్టి శ్రీరాములు సేవలు నిరుపమానమని, ఆయన త్యాగాలను భావితరాలకు గుర్తుండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సామాజికవాది, మానవతావాది అయిన శ్రీరాములు, జాతి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు అని ఆయన ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం శ్రీరాములు ఆత్మార్పణ చేయకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇచ్చి ఉంటే బాగుండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు సేవలకు గుర్తుగా మరో తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో స్థాపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే, నెల్లూరులో ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రజల సౌలభ్యం కోసం త్వరలో వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెడతామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు వాట్సాప్‌లో సమస్యలు తెలపగానే వెంటనే పరిష్కరించి, మళ్లీ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని, తమ 2047 స్వర్ణాంధ్ర విజన్ ఇందుకు ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన కంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని ఆయన విమర్శించారు.

2025 మార్చిలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములు ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. “మహనీయులను గుర్తుంచుకోవడం ఎంత అవసరమో, చెడువారిని గుర్తించడం కూడా అంతే అవసరం” అని చంద్రబాబు అన్నారు.

Read Also : Maharashtra Politics : ఈరోజు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ.. ఎవరెవరికి కాల్స్‌ వచ్చాయంటే..!