ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత,వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ వలసల పరంపరలో భాగంగా తాజాగా మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత (Pothula Sunitha) బీజేపీలో చేరారు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో ఈ చేరిక జరిగింది. ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే, చాలామంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్లగా, మరికొందరు జనసేన, బీజేపీలలో చేరారు. ఈ రాజకీయ మార్పులు రాష్ట్రంలో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి.
PM Modi: నేను శివ భక్తుడిని కాబట్టే విషమంతా మింగేస్తాను: ప్రధాని మోదీ
పోతుల సునీత రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఆమె 2017లో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల సమయంలో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా, ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో, 2020 నవంబర్‌లో టీడీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వైసీపీ తరపున మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీలో ఉన్న కాలంలో ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో, ఆమె తిరిగి తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచించారు.
2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. అప్పట్లో ఆమె తిరిగి టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఊహించని విధంగా ఆమె బీజేపీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా, వారి స్థానాల్లో కొత్తవారు ఎన్నికయ్యారు. పోతుల సునీత బీజేపీలో చేరికతో, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసల పర్వం ఇంకా కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ఈ చేరికలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.