Site icon HashtagU Telugu

Vijayawada TDP : బెజ‌వాడ టీడీపీలో పోస్ట‌ర్ల క‌ల‌క‌లం.. సిట్టింగ్ ఎంపీ లేకుండానే..!

TDP

TDP

బెజ‌వాడ టీడీపీలో వ‌ర్గ‌పోరు రోజురోజుకి ముదురుతుంది. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోస్ట‌ర్లు క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. 7 అసెంబ్లీ ఇంఛార్జ్‌ల ఫోటోల‌తో కేశినేని చిన్ని ఫోటోల‌తో ఉన్న పోస్ట‌ర్లు హాల్‌చ‌ల్ చేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ అయిన ఎంపీ కేశినేని నాని ఫోటోలు లేకుండానే పోస్ట‌ర్లు అంటించారు.అయితే విజ‌య‌వాడ ఈస్ట్‌, జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జ్‌ల‌కు తెలియ‌కుండానే వారి ఫోటోల‌తో పోస్ట‌ర్లు కొట్టించి కేశినేని చిన్ని బ్యాచ్ అంటిస్తున్నార‌ని క్యాడ‌ర్ ఆరోపిస్తుంది. ఇటు తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం ఉన్న ఇంఛార్జ్ శావ‌ల దేవ‌ద‌త్ ఆఫీస్ నుంచే ఈ పోస్ట‌ర్లు అంటించేంద‌కు ఏర్పాట్లు చేశార‌ని అక్క‌డి నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇటు మైల‌వ‌రం, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో దేవినేని ఉమా, బొండా ఉమాలు కేశినేని చిన్ని ని ప్రోత్స‌హిస్తూ పార్ల‌మెంట్ ప‌రిధిలో క్యాడ‌ర్‌ని అయోమ‌యానికి గురి చేస్తున్నార‌ని టీడీపీ క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతుంది.

సిట్టింగ్ ఎంపీ ఉండ‌గానే అయ‌న ఫోటో లేకుండా ఎలా పోస్ట‌ర్లు వేస్తార‌ని ఎంపీ కేశినేని నాని వ‌ర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ విష‌యంపై ఎంపీ కేశినేని నాని మాత్రం మౌనం వ‌హిస్తున్నారు. గ‌తంలో కార్పోరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతోనే ఎంపీ కేశినేని ఈ విష‌యాల‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డంలేద‌ని తెలుస్తోంది. ఇటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ఈ వ‌ర్గ‌పోరుని క‌ట్ట‌డి చేయ‌డంపై దృష్టి పెట్ట‌డం లేదు. ఇదే విధంగా ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే పార్ల‌మెంట్ ప‌రిధిలో టీడీపీ తీవ్రంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌ర్గాల‌తో పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతుంది. కాబ‌ట్టి అధిష్టానం దీనిపై త్వ‌ర‌గా ఫోక‌స్ పెట్టి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.