చంద్ర‌న్న బాట‌న తెలుగు ప్ర‌భుత్వాలు..వ‌రి పంట చుట్టూ రాజ‌కీయ క్రీడ‌

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చంద్ర‌బాబు చెప్పిన సందేశాన్ని ఇప్పుడు కేసీఆర్, జ‌గ‌న్ స‌ర్కార్లు వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - October 29, 2021 / 08:00 AM IST

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చంద్ర‌బాబు చెప్పిన సందేశాన్ని ఇప్పుడు కేసీఆర్, జ‌గ‌న్ స‌ర్కార్లు వినిపిస్తున్నాయి. ఆనాడు వ‌రి పంట‌ను త‌గ్గించుకోండ‌ని చెబితే..పెద్ద ఎత్తున స్వ‌ర్గీయ వైఎస్ ఆర్, కేసీఆర్ విమ‌‌ర్శ‌లు కురిపించారు. బోర్ల కింద వ‌రి సాగు చేయ‌డానికి వీల్లేద‌ని కొన్ని ఆంక్ష‌లు పెట్టడానికి ప్ర‌య‌త్నం చేసిన చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌తిప‌క్షాల నుంచి ఒత్తిడి మేర‌కు విర‌మించుకుంది. సీన్ క‌ట్ చేస్తే..ఇప్పుడు కాల్వ‌ల కింద కూడా వ‌రి వేయ‌డానికి లేద‌ని కేసీఆర్ స‌ర్కార్ ఆంక్ష‌లు పెట్టింది. అంతేకాదు, వ‌రి పండిస్తే కొనుగోలు చేయ‌మ‌ని తెగేసి తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతోంది. ఇదే పంథాను ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తోంది.

భౌగోళిక స్వ‌రూపం రీత్యా తెలంగాణ పీఠ‌భూమి. ఇక్క‌డ స‌మ‌శీతోష్ణ స్థితిని క‌లిగి ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి నుంచి ఏపీకి భిన్నంగా పంట‌ల‌ను పండిస్తుంటారు. ఎక్కువగా కృష్ణా, గోదావ‌రి డెల్టా ప్రాంతాల్లో వ‌రి పంట‌ను తొలి నుంచి రైతులు సాగు చేస్తుంటారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌రతో పాటు ఖ‌చ్చిత‌మైన పంట‌గా వ‌రిని భావిస్తుంటారు రైతులు.
అందుకే తెలంగాణ వ్యాప్తంగా బోర్ల కింద వ‌రి పంట‌ను సాగుచేసేందుకు రైతులు ముందుకొచ్చారు. ఉచిత క‌రెంట్ ప‌థ‌కాన్ని వైఎస్ఆర్ తీసుకొచ్చిన త‌రువాత బోర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. త‌ద‌నుగుణంగ‌దా బోర్ల కింద వ‌రి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఫ‌లితంగా భూ గ‌ర్భ జ‌లాలు తెలుగు రాష్ట్రాల్లో అడుగంటి పోయాయి. విద్యుత్ భారం త‌డిసి మోపెడు అవుతోంది. ఆ భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌కు వెళ్లాల‌ని రైతుల‌ను ఆదేశిస్తున్నాయి.

కాళేశ్వ‌రంతో సహా ప‌లు ఎత్తిపోతల ప‌థ‌కాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మించింది. ఒక‌ట‌న్న‌ర ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసింది. సాగు విస్తీర్ణం పెంచింది. ఫ‌లితంగా గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా వ‌రి పంట దిగుబ‌డిని తెలంగాణ రాష్ట్రం సాధించింది. పంట‌ను క‌నీసం మ‌ద్ధ‌తు ధ‌ర ఇచ్చి ప్ర‌భుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం నుంచి ఆదేశం మేర‌కు వ‌రి సాగును త‌గ్గించాల‌ని కేసీఆర్ స‌ర్కార్ ఆంక్ష‌లు పెడుతోంది. రైతు బంధుతో పాటు ఇత‌ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కావాలంటే వ‌రి సాగు చేయ‌డానికి లేద‌ని కొంద‌రు మంత్రులు చెబుతున్నారు. ఒక్క గింజను కూడా యాసంగిలో కొనుగోలు చేయ‌మ‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి రైతులు తేల్చి చెప్పాడు. రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా ప్ర‌త్యామ్నాయ పంట‌ల సాగు వైపు వెళ్లాల‌ని ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం మాదిరిగా ఆంక్ష‌లు పెట్ట‌న‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం కూడా వ‌రికి ప్ర‌త్యామ్నాయం చూసుకోవాల‌ని చెబుతోంది. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు 20ఏళ్ల క్రిత‌మే గ్ర‌హించాడు. ఆనాటి నుంచి ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు రైతుల‌ను విడ‌త‌ల‌వారీగా మ‌ళ్లించ గ‌లిగితే ఇవాళ ఆంక్ష‌ల దిశ‌గా వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వాలు చంద్ర‌బాబు ఆనాడు చెప్పిన మాట‌ను చెబుతున్నాయి. అందుకే చంద్ర‌బాబు విజ‌న్ తో ఎవ‌రూ పోటీప‌డ‌లేమ‌ని కేటీఆర్ ఎప్పుడో చెప్పాడు. సో…చంద్ర‌న్న మాట నేటి ప్ర‌భుత్వాల‌కు గీటురాయ‌న్న‌మాట‌.