NTR Politics: ఎన్టీఆర్ సామాజిక పాలాభిషేకం

స్వర్గీయ ఎన్టీఆర్ భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన చరిష్మా మాత్రం నానాటికీ పెరుగుతుంది. రాజకీయ పార్టీలు దాదాపుగా అన్నీ ఏదో ఒక సందర్భంలో ఆయన్ని స్మరించుకుంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేసాయి .

  • Written By:
  • Publish Date - January 29, 2022 / 07:27 PM IST

స్వర్గీయ ఎన్టీఆర్ భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన చరిష్మా మాత్రం నానాటికీ పెరుగుతుంది. రాజకీయ పార్టీలు దాదాపుగా అన్నీ ఏదో ఒక సందర్భంలో ఆయన్ని స్మరించుకుంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేసాయి . తాజాగా వైసీపీ కి చెందిన మంత్రి కొడాలి నాని పాలాభిషేకం చేసి ఆయన మీద ఉన్న భక్తిని చాటుకున్నాడు. పార్టీ పరంగా బీజేపీ కూడా విజయవాడ కేంద్రంగా ఏర్పడే ఎన్టీఆర్ జిల్లాకు స్వాగతం పలికింది. ఆ పార్టీలోని వంగవీటి నరేంద్ర వ్యక్తిగత అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. అంతకు మినహా బీజేపీ ఏకగ్రీవంగా ఎన్టీఆర్ పేరుకు మద్దతు పలికింది. ఇక జిల్లాకు ఎన్టీఆర్ పెట్టిన వైసీపీ ఆ అంశాన్ని వీలున్నంత సానుకూలంగా మలుచుకోవాలి అని భావిస్తుంది. అందుకే వైసీపీ మంత్రిగా ఉన్న కొడాలి ఏకంగా ఎన్టీఆర్ విగ్రహం కు పాలాభిషేకం చేసాడు. నందమూరి కుటుంబం అభిమానిగా కొడాలి చాలా సంతోషంగా ఆ పని చేసాడు. ఇదంతా జగన్ అనుమతి లేకుండా జరగదు. పైగా జిల్లాకు ఎన్టీఆర్ పెట్టడంపై ఇప్పటి వరకు టీడీపీ స్వాగతించ లేదు. అందుకే రాజకీయంగా ఈ అంశాన్ని బాగా హైలైట్ చేయాలి అని వైసీపీ నిర్ణయించిందని తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు కమ్మ సామాజిక వర్గం ద్వేషిగా జగన్ ను టీడీపీ టార్గెట్ చేసింది. ఆ సామాజిక వర్గాన్ని బాగా రెచ్చగొట్టింది. చంద్రబాబును వ్యతిరేకించే ఆ సామాజిక వర్గంలోని వాళ్ళు కూడా జగన్ పై మండిపడేలా ప్రచారం చేసింది.

కమ్మ సామాజిక వర్గం ద్వేషిగా జగన్ ను చిత్రీకరణను బలంగా తీసుకెళ్లారు. దీంతో ప్రపంచంలో ఉండే ఆ సామాజిక వర్గం చంద్రబాబు పక్షానికి దాదాపుగా చేరింది. ఇప్పుడు ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడంతో కమ్మ సామాజిక పునరాలోచనలో పడేసేలా చేసింది. అందుకే కొడాలి వ్యూహాత్మక అడుగు వేసాడు. పాలాభిషేకం తో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్మరించుకుని వైసీపీ వైపు ఆలోచించేలా కమ్మ సామాజిక వర్గాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు.

దివంగత వైఎస్ కూడా ఎన్టీఆర్ పథకాలను ప్రశంసించాడు. పైగా ఆయన బాటలోనే వెలుతున్నామని ఒకానొక సందర్భంలో చెప్పాడు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న దగ్గుపాటిపురంధరేశ్వరి,వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అందుకు అంగీకారం తెలిపింది. 2009 ఎన్నికల్లో పలు చోట్ల ఎన్టీఆర్ ను దివంగత వైఎస్ స్మరించుకున్నాడు. ప్రచార వేదికలపై ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చుతున్నాం అంటూ ప్రచారం చేసాడు. ఎన్టీఆర్ కు తెలుగు ప్రజల్లో ఉన్న చరిష్మాను 2009 ఎన్నికల్లో వైఎస్ బాగా అనుకూలంగా మలచుకున్నాడు. అందుకే ఆ ఎన్నికల్లో ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ దింపింది. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదని వైఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. పైగా 1983లో ఎన్టీఆర్ పెట్టిన కూడు, గుడ్డ, నీడ , విద్య, వైద్యం చుట్టూ వైఎస్ పథకాలను రూపొందించాడు. అందుకే ఎన్టీఆర్ ఆశయాలను తాము నెరవేర్చున్నాం అంటూ అసెంబ్లీలో కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆనాడు వైఎస్ చమత్కరించిన సందర్భాలు అనేకం. ఇప్పుడు జగన్ కూడా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడుతూ రాజకీయ అనుకూలతను కమ్మ సామాజిక వర్గం నుంచి కోరుకుంటున్నాడు. అధికారికంగా జీఓ విడుదలైన తరువాత కమ్మ సంఘం పెద్దలు కొందరు జగన్ కు సన్మానం కూడా చేయడానికి సిద్దం అవుతున్నారని తెలుస్తుంది. ఇదే పంథాలో జగన్ వెళ్తే ఎన్నికల నాటికి ఆ సామాజిక వర్గంలో జగన్ మీద ఉన్న ద్వేషం చాలా వరకు పోయే అవకాశం లేకపోలేదు.

పైగా పలు సందర్భాల్లో ఎన్టీఆర్ మీద చంద్రబాబు చేసిన వ్యతిరేక సంఘటనలను బయటకు తీసుకురావడానికి కొడాలి రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. కేంద్రంలోని బీజేపీ నాయకులు కూడా పలు సందర్భాల్లో ఎన్టీఆర్ పేరు ను ఎన్నికల ప్రచారంలో సానుకూలంగా వాడుకున్నారు. 2014, 19 ఎన్నికల్లో మోడీ ప్రచారంలోనూ ఎన్టీఆర్ గొప్పతన్నాన్ని ప్రశంసించారు. కమ్యూనిస్టులు మొదటి నుంచి ఎన్టీఆర్ పక్షాన ఉండే వాళ్లు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏకంగా కుమారుడుకు ఆయన పేరు వచ్చేలా కేటీఆర్ అని నామకరణం చేశాడు. ఎన్టీఆర్ బాటన కేసీఆర్ నడుస్తున్నాడు. ఎన్టీఆర్ కుటుంబం అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం.ఇలా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఎన్టీఆర్ ను స్మరించు కుంటాయి. అందుకే ఇప్పుడు జగన్ కూడా ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టడం ద్వారా రాజకీయంగా వీలున్నంత లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ మంత్రి కొడాలి పాలాభిషేకం. ఇక ముందు రోజుల్లో కమ్మ సంఘం కూడా జగన్ కు సన్మానం చేసే అవకాశం లేకపోలేదు. దీంతో సామజిక ద్వేషం అనే ప్రచారానికి తెర వేయాలని జగన్ భారీ స్కెచ్ వేస్తున్నారు. పైగా చంద్రబాబు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై సానుకూలంగా స్పందించక పోవడాన్ని కూడా వైసీపీ అనుకూలంగా మలుచుకోనుంది.