సంక్రాంతి సంబురాల హడావుడి తగ్గినప్పటికీ ప్రకాశం జిల్లా కారంచేడులో నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యుల వీడియోల సందడి ఇంకా సోషల్ మీడియాను వదలడంలేదు. నందమూరి బాలక్రిష్ణ, వసుంధర, మోక్షజ్ఞ ఈ సంబురాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా బాలయ్య గుర్రం ఎక్కాడు. ఆ గుర్రాన్ని కుమారుడు మోక్షజ్ఞ పట్టుకుని ఉన్న వీడియో వైరల్ అవుతోంది. కారంచేడు సమీపంలోని చీరాల బీచ్ తీరాన బాలయ్య ఆయన సతీమణి వసుంధరతో కలిసి చేసిన జీప్ డ్రైవ్ అభిమానులను ఆకట్టుకుంది. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి దంపతులు..నందమూరి బాలయ్య కుటుంబం కలిసి కారంచేడులోని దేవాలయం దర్శనం వీడియో కూడా హల్ చల్ చేస్తోంది. ఇదంతా సంక్రాంతి సందర్భంగా ఆ రెండు కుటుంబాలు చేసిన సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కానీ, రాజకీయంగా ఆ రెండు కుటుంబాలు ఏం మాట్లాడుకుని ఉంటాయోనని..సర్వత్రా ఇప్పుడు వినిపిస్తోన్న వినికిడి. నందమూరి బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. పైగా పొలిట్ బ్యూరో మెంబర్ కూడా. ఇక డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ 2019 లో వైసీపీ అభ్యర్థిగా పర్చూరు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ పార్టీలోనే ఉంటున్నాడు. కానీ, చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి పురంధరేశ్వరి ఉన్నారు. మూడు పార్టీలకు చెందిన ఆ రెండు కుటుంబాల సభ్యులు సంక్రాంతి సెలబ్రరేషన్స్ వెనుక రాజకీయం ఉందని తాజా టాక్.
ఇటీవల స్వర్గీయ ఎన్టీఆర్ మనవరాలి ఎంగేజ్ మెంట్ లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబునాయుడు కలిసిన ఫోటో వైరల్ అయింది. సుదీర్ఘ కాలం తరువాత వాళ్లిద్దరూ ఆ ఫంక్షన్లో మాట్లాడుకున్నారు. దీంతో ఆ రెండు కుటుంబాలు రాజకీయంగా మళ్లీ ఒకటవుతున్నాయని ప్రచారం జరిగింది. దానికి బలం చేకూరేలా మళ్లీ సంక్రాంతి సంబురాల్లో నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీ వ్యవహారం కనిపించింది. కుమారుడి రాజకీయ భవిష్యతు కోసం డాక్టర్ వెంకటేశ్వరరావు చాలా కాలంగా వ్యూహాలు రచిస్తున్నాడు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నుంచి కూడా సానుకూల సంకేతం వచ్చిందని తెలుస్తోంది. అందుకే, హితేష్ రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై బాలయ్య, దగ్గుబాటి మధ్య ప్రస్తావన వచ్చిందని సమాచారం.ప్రస్తుతం హితేష్ వైసీపీకి దూరంగా ఉంటున్నాడు. ఆ నియోజకవర్గం ఇంచార్జి పదవి కోసం చాలా కాలం గొట్టిపాటి భరత్, రామ్‌నాథంబాబు మంత్రి బాలినేని వద్ద చక్రం తిప్పుతున్నారు. అంటే, హితేష్ ఇక వైసీపీ సీన్లో లేనట్టేనని ఆ పార్టీ వర్గాల భావన. ప్రస్తుతం బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పురంధేరేశ్వరి ఉన్నప్పటికీ ఆ పార్టీలో హితేష్ చేరే ఛాన్స్ తక్కువ. ఏపీలో బీజేపీకి ప్రజాదరణ ఎలా ఉందో..అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో హితేష్ రాజకీయ భవిష్యత్ ను బీజేపీకి తాకట్టు పెట్టే ధైర్యం డాక్టర్ వెంకటేశ్వరరావు చేయడు. అందుకే, సొంత పార్టీ టీడీపీ వైపు హితేష్ ను పంపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి సరైన వారధిగా నందమూరి బాలయ్య సంక్రాంతి సంబురాల రూపంలో కారంచేడులో దిగాడని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట.
తొలి రోజుల్లో టీడీపీని అన్నీ తామై దగ్గుబాటి దంపతులు నడిపారు. ఆ తరువాత నారా చంద్రబాబునాయుడు ఎంటర్ అయ్యాడు. ఇద్దరు అల్లుళ్లకు ప్రాధాన్యం ఇస్తూ స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు రాజకీయం నడిపాడు. ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేసిన ఎపిసోడ్ లోనూ ఇద్దరు అల్లుళ్లు సూత్రధారులుగా ఉన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల. క్రమంలో దగ్గుబాటి కుటుంబాన్ని చంద్రబాబు దూరంగా ఉంచాడు. ఫలితంగా ప్రత్యామ్నాయ రాజకీయవేదికగా కాంగ్రెస్ పార్టీని దగ్గుబాటి కుటుంబం ఎంచుకుంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు పర్చూరు ఎమ్మెల్యేగా డాక్టర్ వెంకటేశ్వరరావు, బాపట్ల ఎంపీగా పురంధరేశ్వరి పోటీ చేసి 2004 ఎన్నికల్లో గెలుపొందారు. కేంద్ర మంత్రిగా పురంధరేశ్వరికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ తరువాత 2009 ఎన్నికల్లో విశాఖ నుంచి పురంధరేశ్వరి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. మరోసారి కేంద్ర మంత్రి పదవి ఆమెను వరించింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తూ 2014 ఎన్నికల్లో పురంధరేశ్వరి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో టీడీపీ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు సాగినట్టు ప్రచారం జరిగింది. కానీ, చంద్రబాబునాయుడు నుంచి ఎలాంటి సానుకూలత రాకపోవడంతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా దగ్గుబాటి ఫ్యామిలీ ఉంది. 2018లో తెలుగుదేశం, బీజేపీ పొత్తు బెడిసిన తరువాత పురంధరేశ్వరి బీజేపీ వైపు మొగ్గారు. ఆ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదే ఏడాది దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. కుమారుడు హితేష్ భవిష్యత్ కోసం జగన్మోహన్ రెడ్డిని కలిసి పర్చూరు ఎమ్మెల్యే టిక్కెట్ ను కోరాడు. ఆ మేరకు హితేష్ 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీచేసి ఓడిపోయాడు. జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి చాలా కాలం పనిచేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించింది. ఇలాంటి పరిస్థితుల్లో కుమారుడ్ని బీజేపీలోకి తీసుకెళ్లకుండా టీడీపీలోకి పంపితే పురంధరేశ్వరి రాజకీయ ప్రయాణంపై ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. ఒక వేళ బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరితే ఆమె ప్రయత్నం నల్లేరుమీద నడకగా ఉంటుంది. లేదంటే హితేష్ రూపంలో ఢిల్లీ బీజేపీ వద్ద ఆమెకు ఒక మచ్చలా ఉంటుందని ఏపీ బీజేపీ వర్గాల టాక్.కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్ కోసం పురంధరేశ్వరి, డాక్టర్ వెంకటేశ్వరరావు దంపతులు చాలా కాలంగా వర్రీ అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదనే అభిప్రాయానికి రాజకీయ వర్గాలు వస్తోన్న క్రమంలో టీడీపీ వైపు మొగ్గాలని దగ్గుబాటి కుటుంబం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చిందని వినికిడి. అందుకే, నారా, దగ్గుబాటి ఫ్యామిలీని రాజకీయంగా కలిపేందుకు అంఖండ ప్రయత్నం జరుగుతోందట. సంక్రాంతి సందర్భంగా బాలయ్య చేసిన రాయభారం సమీప భవిష్యతులోనే ఫలిస్తుందని కారంచేడు వర్గాల టాక్.