Politics On Ambedkar : అంబేద్క‌ర్ విగ్ర‌హాల ప‌బ్లిసిటీ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయన విగ్ర‌హాల చుట్టూ రాజ‌కీయం నడుస్తోంది. ప్ర‌పంచం మొత్తం మీద ఎక్క‌డా లేనివిధంగా ఎత్తైన అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేస్తాన‌ని 2016లో ఆనాటి సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

  • Written By:
  • Publish Date - April 14, 2022 / 01:05 PM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయన విగ్ర‌హాల చుట్టూ రాజ‌కీయం నడుస్తోంది. ప్ర‌పంచం మొత్తం మీద ఎక్క‌డా లేనివిధంగా ఎత్తైన అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేస్తాన‌ని 2016లో ఆనాటి సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అంబేద్క‌ర్ క్యాంస్య విగ్ర‌హాన్ని 125 అడుగుల‌తో నిర్మించ‌డానికి తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంద‌ని రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ వెల్లడించారు. విజ‌య‌వాడ న‌డిబొడ్డున 125 అడుగుల విగ్ర‌హాన్ని వేగంగా నిర్మించాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ఏడాది క్రితం ఆదేశించారు. ఏప్రిల్ 14న అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా అదే వాయిస్ ను ప్ర‌ధాన పార్టీల నేత‌లు వినిపించ‌డం గ‌మ‌నార్హం.ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద 125 అడుగుల పొడ‌వుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇందిరా నగర్ డిగ్నిటీ హౌజింగ్ కాలనీ ప్రారంభోత్సవం సందర్భంగా గ‌త ఏడాది కేటీఆర్ ప్ర‌క‌టించారు.ఆ రోజు నుంచి ఎన్టీఆర్ అభిమానులు టీఆర్ఎస్ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించారు. దీంతో పీవీ మార్గ్ లో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డ‌మే కాదు, అందుకోసం డెడ్ లైన్ కూడా కేటీఆర్ పెట్టారు. గ‌త‌ ఎనిమిది నెల‌లుగా అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటు ప‌నులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని వెల్ల‌డించారు. ప‌ర్యాట‌క రంగాన్ని ఆక‌ర్షించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామ‌ని కూడా చెప్పారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహం పనులు ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తవుతాయని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. అదేవిధంగా 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో అంబేద్కర్‌ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న స్థలంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండేళ్ల కిందటే పనులు మొదలు పెట్టాలనుకున్నప్ప‌టికీ ఆలస్యమయ్యింది. వచ్చే దసరా నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు కాబోతోంది. రెండంతుస్తుల భవనంతో పాటు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. 104 కోట్లతో ఈ స్మృతి వనాన్ని నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.మరో నెలలోపు 25 అడుగుల నమూనా విగ్రహం అందుబాటులో ఉంచనుందని గురువారం అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు.ఏపీ రాష్ట్రంలో విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌)లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని (125 Feet Ambedkar Statue) జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్పాటు చేయనుంది. అందుకు సంబంధించిన శంకుస్థాపన గ‌త ఏడాది జ‌రిగింది. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, మెమోరియల్‌ హాలు, మెమోరియల్‌ లైబ్రరీ, స్టడీ సెంటర్, ల్యాండ్‌ స్కేపింగ్, గార్డెన్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ నిర్మించాలని గ‌త ఏడాది జ‌గ‌న్ ఆదేశించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం గ‌మ‌నార్హం.

అమ‌రావతి ప్రాజెక్టును త‌యారు చేసిన చంద్ర‌బాబు ఆయ‌న సీఎంగా ఉండ‌గా 15 ఎకరాలలో 210 కోట్లు ఖర్చు చేసి అంబేద్కర్ స్మతి వనం, అంబేద్కర్ లైబ్రరీ,బౌద్ధ ధ్యాన కేంద్రం ఏర్పాటుచేస్తామని కూడా చంద్ర బాబు ప్రకటించారు. ఆ ప్రాజక్టు సమీక్ష జరిపిన దాఖలా లేదు. అంబేద్కర్ ప్రాజక్టు వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని నవ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కత్తి పద్మారావు డిమాండ్ చేస్తున్నారు. పబ్లిసిటీ సాధనంగా అంబేద్కర్ పేరు ప్రతిష్టలను దుర్వినియోగం చేయవద్దని క‌త్తి ప‌ద్మారావు ప‌లుమార్లు ప్ర‌భుత్వాల‌కు చుర‌క‌లు వేశారు. అమరావతిలో కట్టాలనుకున్న 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టు మూల‌న‌ప‌డింది.అంబేద్క‌ర్ భావ‌జాలం ఉన్న ప‌రిపాల‌న అందిస్తే పేద‌లు బాగుప‌డ‌తారు. ఆయ‌న చెప్పిన విలువ‌ల‌తో కూడిన రాజకీయం చేస్తే స‌మ‌స‌మాజం ఏర్ప‌డుతుంది. ఆర్థిక అంతరాలను నానాటీ పెంచుకుంటూ పోయేలా ప‌రిపాల‌న అందిస్తోన్న తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌తో ఎస్సీల‌ను మెప్పించాల‌ని చూడ‌డం బాధ‌క‌రం. ఎస్సీల‌కు మాత్ర‌మే న్యాయం చేయాల‌ని ఆయ‌న రాజ్యాంగం రాయ‌లేదు. పేద‌ల క‌న్నీళ్లు తుడిచే ప్ర‌భుత్వాలు ఉండాల‌ని రాజ్యాంగాన్ని ర‌చించారు. రాజ్యాంగంలో క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల‌ని కూడా సూచించారు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన, అస్పృశ్య‌త‌కు గుర‌వుతున్న వాళ్ల‌ను కులాల‌కు అతీతంగా ప్ర‌భుత్వాలు ఆదుకోవాల‌ని విశాల‌హృద‌యంతో అంబేద్క‌ర్ రాజ్యాంగాన్ని అందించారు. కానీ, ప్ర‌స్తుత ప్ర‌భుత్వాలు అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి ద‌ళిత ఓట్లను సంపాదించుకునే దిశ‌గా ఆలోచించ‌డం శోచ‌నీయం.నాడు చంద్ర‌బాబు ఇప్పుడు కేసీఆర్, జ‌గ‌న్ పోటీప‌డి అంబేద్క‌ర్ విగ్ర‌హాల ఎత్తును 125 అడుగులు వ‌ర‌కు తీసుకొచ్చారు. వాటి నిర్మాణానికి కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేయ‌డానికి సిద్ధ ప‌డ్డారు. కానీ, పాఠ్య‌పుస్త‌కాల్లో మాత్రం ఆయ‌న స్కూర్తికి ఒక పాఠాన్ని కూడా చేర్చ‌లేక‌పోయారు. కేవ‌లం ఓటు బ్యాంకు సాధ‌నంగా అంబేద్క‌ర్ విగ్ర‌హాల‌ను వాడుకుంటున్నార‌ని సామాజిక‌వేత్త‌లు ప‌ద్మారావులాంటి వాళ్లు ప‌డుతోన్న ఆవేద‌న‌లో నిజం లేక‌పోలేదు.