ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ సంచలనం కలిగిస్తుంది. అత్యవసరంగా ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతున్నారు.
రాజకీయ అంశాల పైన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ, చంద్రబాబు పలకరింపులు తరువాత ప్రచారంలోకి వచ్చిన అంశాల పైన ఇప్పుడు బీజేపీలో చర్చ సాగుతోంది.
ఏపీలో కొందరు బీజేపీ నేత ఢిల్లీ వెళ్లనున్నారు. కొద్ది రోజుల క్రితమే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసారు. ఆ సమయంలోనే మరోసారి ప్రత్యేకంగా కలవాలని ప్రధానితో చెప్పారు. ఆ క్రమంలో సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కొత్తగా రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు.ఎన్నికల్లో ముర్ముకు వైసీపీ మద్దతు ఇచ్చింది. మర్ము అమరావతికి వచ్చిన సమయంలో సీఎం జగన్ తన నివాసంలో తేనేటి విందు ఏర్పాటు చేసి సత్కరించారు. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో నూతన రాష్ట్రపతితో సమావేశం అవుతారు.
ఆ తరువాత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ కర్ తోనూ సమావేశం కానున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ధన్ కర్ కు వైసీపీ మద్దతుగా నిలిచింది. మంగళవారం సాయంత్రం ప్రధానితో సీఎం జగన్ భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీతో సమావేశం లో ఈ సారి సీఎం జగన్ కీలక అంశాల పైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా పార్టీ నేతల సమాచారం. అందులో భాగంగా ప్రధానంగా పోలవరం నిర్వాసితుల సమస్య..ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అంశాలను ప్రస్తావిస్తారని తెలుస్తుంది.