‘జగన్’ స్కెచ్ కు ‘పవన్, చంద్రబాబు’ కౌంటర్ ఎటాక్..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువున్నప్పటికీ... తమ సత్తా చాటుకునేందుకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దం అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - February 1, 2022 / 11:34 AM IST

ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు

వ్యూహ, ప్రతివ్యూహాలతో సన్నద్దంగా పార్టీలు

ఆసక్తిగా మారిన ఆంధ్రా రాజకీయాలు

గెలుపే లక్ష్యంగా పొత్తుకోసం చంద్రబాబు పాట్లు

గెలుపుపై ధీమాలో వైసీపీ

సత్తా చాటేందుకు సిద్ధంగా జనసేన, బీజేపీ

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువున్నప్పటికీ… తమ సత్తా చాటుకునేందుకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ, మూడు రాజధానులతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు తమదైన శైలిలో పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇందులోనూ జనసేన పార్టీ మాత్రమే ఈ మూడు అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ… ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమం చేస్తున్న వారికి అండగా జనసేన పార్టీ నిలబడింది. 3 రాజధానుల అంశంలోనూ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. టీడీపీ కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పట్టు సాధించేందుకు ట్రై చేస్తూనే ఉంది. ఇక అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రజా సంక్షేమమే పరమావధిగదా పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, త్వరలోనే రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అభివృద్ధి అనే విషయంలో కాస్త వెనకబడ్డా సరే.. అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల నిర్ణయం, పాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాల ఏర్పాటు తదితర అంశాలు తమ పార్టీ గెలుపునకు బాట వేస్తాయని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇకపోతే, అసలు వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం…!

జనసేన, బీజేపీతో పొత్తుకోసం తీవ్ర ప్రయత్నాల్లో టీడీపీ:
ఇక వచ్చే ఎన్నికల్లో గనుక తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే… తమ ఉనికే ప్రశ్నార్దకరంగా మారుతుందన్న భయంలో ఉన్నారు చంద్రబాబు. అందులో భాగంగానే ఆయన రాబోయే ఎలక్షన్స్ లో ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న తలంపుతో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అతి బలమైన శక్తిగా ఉన్న జగన్ పార్టీని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని భావించిన చంద్రబాబు… పొత్తుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ పార్టీతో పొత్తుకోసం… ‘వన్ సైడ్ లవ్’ ఉంటే ఎలా..? రెండు వైపులా ఉండాలి కదా అని, జనసేన పార్టీతో పొత్తుకోసం సంకేతాలు ఇచ్చారు బాబుగారు. అలానే బీజేపీతో మరోసారి పొత్తుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు వర్కౌట్ అయితే… రాబోయే ఎన్నికల్లో మరోసారి జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే పొత్తుకోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. మరి తన పొత్తు ప్రయత్నాల్లో బాబు గారు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

సత్తా చాటేందుకు సిద్దంగా జనసేన:
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీనే. ఆ పార్టీ అధ్యక్షుడు పిలుపిస్తే చాలు… పార్టీ కార్యకర్తలు ఆ పిలుపును అందుకుని ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటారు. ఇప్పటికే ఆంధ్రా రోడ్లపై పెద్దఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశారు. శ్రమదానం పేరుతో పవన్ తో సహా పార్టీ క్యాడర్ అంతా కూడా గుంతలు పడిన రోడ్లను బాగుచేసే ప్రయత్నం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అక్కడి రైతులకు అండగా నిలిచింది జనసేన. అలానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది భావోద్వేగాలతో కూడుకున్నదని చెప్పి, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అమిత్ షా ను కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆందోళనలో మద్దతుగా పాల్గొన్నారు కూడా. ఇలా ప్రజా సమస్యలపై బలంగా తన గళాన్ని వినిపిస్తూ ముందుకువెళుతోంది జనసేన పార్టీ. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని పక్కనపెట్టి, ఈసారి ఎలక్షన్స్ లో తమ సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన… రాబోయే ఎన్నికల్లో అప్పటి పరిస్థితులకు అనుగునంగా… పొత్తు విషయంలో పార్టీ కార్యకర్తల అభీష్టంమేరకే నడుచుకుంటామని స్పష్టంగా పేర్కొంది. అలానే ఇక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పూర్తిగా మసకబారిందని భావిస్తోన్న జనసేన… అక్కడి ప్రజలతో పాటు, టీడీపీ క్యాడర్ కూడా వైసీపీ కి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీనే చూస్తున్నారని… ఇవన్నీ కూడా పార్టీ గెలుపుకు సహకరించే అంశాలేనని జనసేన నేతలు లెక్కలు గడుతున్నారు. ఏది ఏమేనా సరే… ఈసారి ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం పక్కా అన్నట్టుగా ఆ నేతలు చెప్పుకుంటున్నారు.

వైసీపీలో కనిపిస్తున్న గెలుపు ధీమా:
కరోనా రాని, ఇంకా వేరే వైరస్ ఏదైనా రాని… సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లు వైసీపీ సర్కార్ ఆలోచనగా ఉంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్ధితి ఎలా ఉన్నా… కూర్చోబెట్టి వివిధ పథకాల రూపంలో అందరి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాం… అది కచ్చితంగా వర్కౌట్ అవుతుంది… వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందన్న ధీమాలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరోవైపు చూస్తే… ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్న జగన్ పార్టీ, భారతీయ జనతా పార్టీతో లోపాయికారీ ఒప్పందాన్ని కొనసాగిస్తుందన్న పుకారు ఉంది. కేంద్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అంతగా వ్యతిరేకించకపోవడం సహా అనేక కారణాలు వైసీపీ ప్రభుత్వం, సెంట్రల్ లో ఉన్న పార్టీకి సహకరిస్తుందన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. ఇవన్నీ పక్కనపెడితే…. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీతో జనసేన – భారతీయ జనతా పార్టీలు జత కలుస్తాయని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే… ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు జట్టుకట్టి బరిలో దిగినా… వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందని… అధికారాన్ని కూడా దక్కించుకుంటుందని ఆ పార్టీ శ్రేణులు ఢంకా భజాయించి చెబుతున్నాయి. ఒకవేళ వ్యతిరేకత అనేది ఎంత ఉన్నా సరే… గత ఎన్నికల్లో గెలిచిన సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే.. 151 స్థానాలకు గాను, పైన 51 సీట్లు పోయినా…. 100 స్థానాల్లో గెలుస్తాం… అలా చూసినా మాదే మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని జగన్ ఫాలోవర్స్ అంటున్న మాట. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ వేసే వ్యూహాలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు లు వేసే ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయో…? ఎవరి వ్యూహాలు ఫలించి, ఎవరి పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటారో అన్నది వేచి చూడాలి.