Site icon HashtagU Telugu

TDP Road Map: టీడీపీ దిశ‌గా `ఆన్ రోడ్` మ్యాప్‌

AP Trend

Cbn Pawan

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగుల‌పై ఏపీ రాజ‌కీయం ముడిప‌డి ఉంది. క‌ర్నూలులో జ‌రిగిన బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో జ‌న‌సేన‌కు ఆ పార్టీ రోడ్ మ్యాప్ ను ప‌రోక్షంగా ఇచ్చేసింది. తెలుగుదేశం పార్టీతో క‌లిసి వెళ్లే అవ‌కాశం లేద‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోమువీర్రాజు వెల్ల‌డించాడు. దీంతో ఇక ప‌వ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నాడ‌నే అంశం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఉగాది త‌రువాత ఏపీలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌వ‌న్ స‌మీక్ష‌కు సిద్ధం అయ్యాడు. క్యాడ‌ర్ ఒపినియ‌న్ తీసుకున్న త‌రువాత ఏదో ఒక నిర్ణ‌యం ప‌వ‌న్ తీసుకునే అవకాశం లేక‌పోలేదు. అందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేయ‌డంలో జ‌న‌సైనికులు ఉన్నారు.
ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోనివ్వ‌న‌ని ఆవిర్భావం స‌భ వేదిక‌గా ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. అంటే, టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌ని ప‌రోక్షంగా సంకేతం ఇచ్చాడు. ప్ర‌స్తుతం బీజేపీతో క‌లిసి జ‌న‌సేన ఉన్న‌ప్ప‌టికీ గ‌త కొంత కాలంగా ఆ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ ఉంది. జ‌నసేనాని ప‌వన్ తో సంప్ర‌దించ‌కుండానే బీజేపీ ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. అయిన‌ప్ప‌టికీ బీజేపీతోనే క‌లిసి వెళ్ల‌డానికి ప‌వ‌న్ మొగ్గుచూపాడు. పైగా ఐదు రాష్ట్రాల ఫ‌లితాల త‌రువాత అనివార్యంగా క‌మ‌ల‌ద‌ళంతో క‌లిసిమెలిసి ఉండాల్సిన ప‌రిస్థితి. కానీ, ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోవ‌డానికి సై అనేలా జ‌న‌సేన సంకేతాలిస్తోంది.
తాజాగా సోము వీర్రాజు క‌ర్నూలు వేదిక‌గా టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని ప్ర‌క‌టించిన త‌రువాత జ‌న‌సేనాని సీరియ‌స్ గా ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో..సూచాయ‌గా తెలిసిన‌ త‌రువాత ప‌వ‌న్ త్రిశంకు స్వ‌ర్గంలో ప‌డ్డాడు. అందుకే, క్యాడ‌ర్ తో అభిప్రాయాలు పంచుకోవాల‌ని ప్ర‌ణాళిక‌ను ర‌చించుకున్నాడ‌ని తెలుస్తోంది. వాస్త‌వంగా బీజేపీ, జ‌న‌సేన మధ్య సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిత్వాన్ని ఖరారు చేసే స‌మ‌యంలో బీజేపీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింది. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ స‌హ‌క‌రించాడు. క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి జ‌న‌సేన వెళ్ల‌కుండా దూరంగా ఉంది.
విభ‌జ‌న చ‌ట్టంలోని చాలా అంశాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నెరవేర్చ‌లేదు. ఆ విష‌యంలోనూ బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశంలోనూ ఆ రెండు పార్టీలు క‌లిసి పోరాటం చేయ‌లేని ప‌రిస్థితి. ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక నిధులు, రాజ‌ధాని అంశంపై భేదాభిప్రాయాలు ఉన్నాయి. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇలాంటి అంశాలన్నీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లి హైలెట్ చేయాల‌ని టీడీపీ భావిస్తోంది. తెర వెనుక వైసీపీ, బీజేపీ స‌హ‌జ మిత్ర‌త్వాన్ని కొన‌సాగిస్తున్నాయ‌ని చెప్ప‌డానికి ప‌లు ఘ‌ట‌న‌లు ఉన్నాయి. దీంతో బీజేపీని వ‌దులుకోవ‌డానికి ప‌వ‌న్ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.
ఇప్ప‌టికే చంద్ర‌బాబునాయుడు పొత్తు కోసం జ‌న‌సేన‌కు ద్వారాలు బార్లా తెరిచాడు. వ‌న్ సైడ్ ల‌వ్ అంటూ ఇటీవ‌ల ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల క్ర‌మంలో క‌నీసం 60 స్థానాల‌ను జ‌న‌సేన డిమాండ్ చేస్తోంద‌ట‌. కానీ, టీడీపీ మాత్రం 25 నుంచి 30 మించి ఇవ్వ‌లేమ‌ని చెబుతోంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల స‌మాచారం. క‌మ్యూనిస్ట్ లు, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌కు క‌లుపుకుని 35 నుంచి 40కి మించ‌కుండా ఇవ్వాల‌ని టీడీపీ భావిస్తుంద‌ట‌. ఇలాంటి ఈక్వేష‌న్స్ న‌డుమ పొత్తులు ఈజీగా ఫ‌లించే అవ‌కాశాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ స‌ర్కార్ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా ఉండడానికి ప‌వ‌న్ సీట్ల సంఖ్య విష‌యంలో రాజీప‌డ‌తార‌ని టాక్‌.
ఒంటరి పోరుకు బీజేపీ వెళ్లే సాహ‌సం ఏపీలో చేయ‌దు. ఒక వేళ జ‌న‌సేన విడిపోయి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చివ‌రి నిమిషంలో క‌మ‌ల‌నాథులు క‌లిసి న‌డిచే అవ‌కాశాలు లేక‌పోలేదు. అలాంటి సంద‌ర్భాల్లో వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ ఇత‌ర‌త్రా చిన్నాచిత‌క పార్టీల‌తో క‌లిసి కూట‌మి ఏర్ప‌డే అవ‌కాశాలు మెండు. ఫ‌లితంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా చేయ‌డం ప‌వ‌న్ కు సాధ్య‌పడ‌దు. అందుకే, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎంతో కొంత మెరుగ‌ని జ‌న‌సేన అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఉగాది త‌రువాత నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌రిగే స‌మీక్ష‌ల్లో ప‌వ‌న్ ఎత్తుగ‌డ‌కు ఒక క్లారిటీ రానుంది. అప్ప‌టి వ‌ర‌కు వేచిచూడాల్సిందే.!