Vangaveeti: ‘గుడివాడ పాలిటిక్స్’ లో రాధా ఎంట్రీ ఖాయమా? 

వచ్చే ఎన్నికలు నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు కనిపించబోతున్నాయా? ప్రస్తుత పరిణామాలను చూస్తే అదే అనిపించకమానదు.

  • Written By:
  • Publish Date - March 10, 2022 / 11:37 AM IST

వచ్చే ఎన్నికలు నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు కనిపించబోతున్నాయా? ప్రస్తుత పరిణామాలను చూస్తే అదే అనిపించకమానదు. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ దాదాపు మూడేళ్లుగా హాట్ హాట్ గానే ఉన్నాయి. ఇప్పుడు దానికి గుడివాడ సెగ తగులుతోంది. అక్కడ మంత్రి కొడాలి నాని తీరుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న వంగవీటి రాధా అభిమానులు మొత్తం వ్యూహాన్నే మార్చే పనిలో ఉన్నారు. గుడివాడ నుంచి బరిలోకి దిగాలని వంగవీటి రాధాపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పైగా గుడివాడ వాసులతో రాధ విస్తృత మంతనాల వెనుక రహస్యం కూడా అదే అంటున్నారు. దేవినేని వర్గంతో మంత్రి కొడాలి నాని సన్నిహితంగా ఉండడం రాధా వర్గీయులకు నచ్చలేదు. అందుకే గుడివాడలో రాధా పోటీ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. రాధా కాని బరిలోకి దిగితే గుడివాడ పొలిటికల్ సీన్ మారిపోతుంది.

గుడివాడలో కొడాలి నాని వ్యవహార శైలి వల్ల ఆయన క్యాడర్ ఇబ్బంది పడుతోందని.. అదే తమకు లాభిస్తుందని రాధ వర్గం అంచనా వేస్తోంది. గుడివాడ వాసులు కూడా కొత్త నాయకత్వం కోసం చూస్తున్నారని అదే రాధకు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని రాధాకు చెప్పినట్టు తెలుస్తోంది. నానితో ఫ్రెండ్ షిప్ కావాలా.. తమతో ఆత్మీయ బంధం కావాలా అనే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. అభిమానులు ఒత్తిడి చేస్తు్న్నా.. గుడివాడ వాసుల నుంచి ఆహ్వానం ఉన్నా.. విజయవాడను వదిలి వెళ్లడానికి రాధాకు ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. గుడివాడ స్థానికులనే పోటీకి దింపి వారికి మద్దతిద్దాం అని చెప్పినా రాధా మద్దతుదారులు దానికి ఒప్పుకోలేదని సమాచారం. అందుకే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి రాధా కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రాధా కాని గుడివాడ బరిలోకి దిగాలని భావిస్తే.. అది గుడివాడతో పాటు విజయవాడ రాజకీయాలపైనా ప్రభావం చూపించే ఛాన్సుంది.