Site icon HashtagU Telugu

AP And TS: గెలిస్తే అమ‌రావ‌తి, ఓడితే హైద‌రాబాద్‌.!

Amaravati Hyderabad

Amaravati Hyderabad

విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీద ప్ర‌ధాన పార్టీల చీఫ్ లు స‌వ‌తి ప్రేమను క‌న‌బ‌రుస్తున్నారు. అధికారంలో ఉండే స‌రేస‌రి లేదంటే ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల బాగోగుల‌ను హైద‌రాబాద్ నుంచి చూస్తున్నారు. అత్య‌ధిక మీడియా కూడా ఆ రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఇష్టానుసారంగా ప్ర‌జ‌ల‌పై రుద్దుతోంది. తెలంగాణ రాష్ట్ర ప‌రిపాల‌నా వైఫ‌ల్యాల‌పై మాట్లాడే ద‌మ్ముగానీ, న్యూస్ ను ఇచ్చే ధైర్యంగానీ ఇంచుమించు సింహ‌భాగం మీడియాకు లేదు. ఏపీ అంశాల‌ను హైద‌రాబాద్ కేంద్రం ఫోక‌స్ చేస్తూ రేటింగ్ పెంచుకుంటోన్న కొన్ని ఛాన‌ళ్లు కేసీఆర్ స‌ర్కార్ కు బాకా ఊదుతున్నాయి. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి ఇవాల్సిన నిధులు, ఆస్తుల ఇప్ప‌టికీ తెలంగాణ స‌ర్కార్ ఇవ్వ‌డంలేదు. ఆ విష‌యాన్ని న్యూస్ రూపంలో ఇచ్చే ద‌మ్మున్న మీడియా.. చుక్కాని వేసి వెదికినా క‌నిపించ‌దు. ఏపీ ఆస్తుల‌ను ఆస్వాదిస్తోన్న తెలంగాణ స‌ర్కార్ ను ప్ర‌శ్నించే ధైర్యం దాదాపు ఏ మీడియాకు లేద‌నే విష‌యం తెలియ‌న‌ది కాదు. పైకి మాత్రం ఏపీ ప్ర‌జ‌ల‌పై ప్రేమ‌ను ఒల‌క‌బోస్తున్నార‌న్న భావ‌న లేక‌పోలేదు.

Also Read : AP Special Status : ‘మూడు’తో ముంచుడే.!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భాం ఉమ్మ‌డి ఏపీలో జ‌రిగింది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ 1982 మార్చి నెల 29 వ తేదీన పార్టీని స్థాపించాడు. ఇప్పుడు కేవలం ఏపీలో మాత్ర‌మే ఆ పార్టీ జీవం ఉంది. పుట్టిన గ‌డ్డ‌పై ఉనికి కోల్పోయింది. అయిన‌ప్ప‌టికీ ఆవిర్భావ స‌భ‌ను హైద‌రాబాద్ లో నిర్వ‌హించాల‌ని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణ‌యం తీసుకుంది. 1923 మే 28న జ‌న్మించిన ఎన్టీఆర్ జ‌న్మించాడు. ఆ సంద‌ర్భంగా జ‌రిపే మ‌హానాడును కూడా గండిపేట‌లో మూడు రోజుల పాటు హైద‌రాబాద్ లోనే పెట్టాల‌ని తొలుత భావించారు. కానీ, స‌మీపం భ‌విష్య‌త్ లో ఎన్నిక‌లు ఉన్న విష‌యాన్ని గ్ర‌హించి ఏపీలో మ‌హానాడు నిర్వ‌హించాల‌ని పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. గ‌త రెండేళ్లుగా జూమ్ ద్వారా మ‌హానాడు జ‌రిగింది.
పార్టీ బ‌తికున్న చోట ఆవిర్భావ స‌భ పెట్ట‌కుండా, అచేత‌నంగా ఉన్న హైద‌రాబాద్ లో ఆ స‌భ‌ను పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు వెంట‌నే ఏపీకి వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. విభ‌జ‌న చ‌ట్ట ప్ర‌కారం వ‌చ్చిన హైద‌రాబాద్ లోని స‌చివాల‌య భ‌వ‌నాల‌ను సుమారు 15 కోట్ల‌తో రీ మెడ‌ల్ చేయించాడు. పంపిణీలో వ‌చ్చిన మిగిలిన ఆస్తుల‌కు రీ మోడ‌ల్ చేయించ‌డానికి మ‌రో 13కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు ఆనాడు లెక్కించారు. మొత్తం సుమారు 30కోట్ల ఖ‌ర్చుతో రీ మోడ‌ల్ చేసిన ఆఫీస్ ల నుంచి మొద‌టి ఏడాది ఏపీ ప‌రిపాల‌న అంతా హైద‌రాబాద్ నుంచే న‌డిచింది. రెండో ఏడాది త‌రువాత మూడు రోజులు హైద‌రాబాద్‌, రెండు రోజులు విజ‌య‌వాడ‌, ఒక రోజు ఢిల్లీ నుంచి పాల‌న చేయాల‌ని ప్రాథ‌మికంగా బాబు టీం వ్యూహం ర‌చించింది. ఆ లోపు ఓటుకు నోటు కేసు రావ‌డంతో ఆక‌స్మాత్తుగా చంద్ర‌బాబు అమ‌రావ‌తికి షెల్ట‌ర్ మార్చేశాడు. దాని వెనుక ఏమి జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే.


2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌రువాత అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్ కు చేరుకున్నాడు. ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను హైద‌రాబాద్ నుంచి పోషిస్తూ వ‌చ్చాడు. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల పాటు హైద‌రాబాద్ లోని ఇంటి నుంచి జూమ్ మీటింగ్ ల ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్ పై పోరాటం చేశాడు. క్షేత్ర స్థాయిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డానికి హైద‌రాబాద్ నుంచి బాబు, లోకేష్ వెళుతుంటారు. లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ ను చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఉప‌యోగించుకున్నాడు. అక్క‌డే కుటుంబం ఉండేది. ఓడిపోతే, హైద‌రాబాద్ లో మ‌న‌వ‌డితో ఆడుకుంటాన‌ని 2019 ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు చెప్పాడు. ఓడిస్తే, త‌న‌కు పోయేది ఏమీ లేద‌ని తేల్చి ఆనాడే చెప్పాడు. ఆ విధంగానే హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చేశాడు. ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా ఉన్నంత కాలం హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోనే నివాసం ఉన్నాడు. ఇప్పుడు చంద్ర‌బాబు ఎలా చేశాడో..ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ కూడా ఆనాడు అదే చేశాడు. 2019 ఎన్నిక‌ల కు ముందు మాత్రం పాద‌యాత్ర‌కు వెళ్లాడు. ఆనాడు కూడా పార్టీ కార్య‌క‌లాపాలు అన్నీ హైద‌రాబాద్ నుంచే న‌డిచేవి. పాద‌యాత్ర బ్రేక్ రోజుల్లో హైద‌రాబాద్ కు జ‌గ‌న్ వ‌చ్చే వాడు. ఆ పార్టీ లీడ‌ర్లు కూడా హైద‌రాబాద్ లోనే ఉండే వాళ్లు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తాడేప‌ల్లికి జ‌గ‌న్ మ‌కాం మార్చేశాడు. కుటుంబ స‌మేతంగా అక్క‌డే ఉంటూ ప‌రిపాల‌న సాగిస్తున్నాడు. మంత్రులు మాత్రం చాలా వ‌ర‌కు వీకెండ్స్ లో హైద‌రాబాద్ లోనే క‌నిపిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో చాలా మంది హైద‌రాబాద్ లోని సొంత ఇళ్ల‌లో త‌ల‌దాచుకున్నారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు కొంద‌రు మాత్ర‌మే అందుబాటులో ఉన్నారు. మిగిలిన వాళ్లు హైద‌రాబాద్ నుంచి ఫోన్లు, జూమ్ స‌మావేశాల ద్వారా ప్ర‌జ‌ల‌ను ప‌లుక‌రించారు. ప్ర‌తిప‌క్షం, అధికార ప‌క్షం రెండూ హైద‌రాబాద్ కేంద్రంగా క‌రోనా టైంలో ఏపీ ప‌రిపాల‌న సాగించ‌డం గ‌మ‌నార్హం. సీఎం జ‌గ‌న్ మాత్రం తాడేప‌ల్లి ఇంటి నుంచి జూమ్ మీటింగ్ లు ద్వారా పరిపాల‌న సాగించాడు.

Also Read :  అసెంబ్లీ’ శాశ్వ‌త బ‌హిష్క‌ర‌ణ ?

ఎన్నికలు మరో ఏడాదిన్న‌లోనే ఉన్నాయ‌ని భావిస్తోన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఏపీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు దూసుకు వెళుతున్నారు. అధికారం ఇస్తే ఓకే, లేదంటే హైద‌రాబాద్ కు పూర్తిగా మ‌కాం మార్చే ధోర‌ణి క‌నిపిస్తోంది. సీఎం జ‌గ‌న్ కూడా అధికారం కోల్పోతే, తాడేప‌ల్లిని ఖాళీ చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ ఉంది. ఆనాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఏపీ పోలీస్‌, వైద్యుల‌ను జ‌గ‌న్ న‌మ్మ‌లేదు. ఇప్పుడు అదే త‌ర‌హాలో చంద్ర‌బాబు విశ్వ‌సించ‌డం లేద‌ని తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్థం అవుతోంది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అంతే. జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం మాత్రం మంగ‌ళ‌గిరిలో ఉంది. ఆయ‌న మాత్రం హైద‌రాబాద్ నివాసంలో ఉంటూ చుట్ట‌పుచూపుగా ఏపీకి వెళుతుంటాడు. అధికారం వ‌స్తే, త‌ప్ప ఆయ‌న కూడా హైద‌రాబాద్ ను వ‌దిలి ఏపీలో నివాసం ఉండే అవ‌కాశం లేదు. సో..అధికారం ఇస్తే అమ‌రావ‌తి లేదంటే హైద‌రాబాద్ కు వ‌చ్చేలా ఏపీ రాజ‌కీయ పార్టీల అధినేతల‌ తీరు ఉంది. ఆస్తులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ‌గా టీడీపీ, వైసీపీ , జ‌న‌సేన చీఫ్ ల‌కు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. అందుకే, ఏపీపై స‌వతి ప్రేమ‌ను ఒల‌క‌బోస్తూ అధికారం కోసం వెంప‌ర్లాడుతున్నారు. ఆ రాష్ట్రాన్ని ఎటూకాకుండా చేస్తున్నార‌ని అత్య‌ధిక ఏపీ ప్ర‌జ‌ల మ‌నోవేద‌న‌. దీనికి ప‌రిష్కారం రావాలంటే, స్థానికంగా ఉండే లీడ‌ర్ తో కూడిన‌ కొత్త పార్టీ ఆవిర్భావం జ‌ర‌గాలేమో..!