Site icon HashtagU Telugu

AP Politics : ఏపీ `నార్త్` ర‌చ్చ‌! ఎవ‌రికి వారే ఉత్త‌రాంధ్ర వైపు!

Pawan Babu Jagan Amaravati

Pawan Babu Jagan Amaravati

ఉత్త‌రాంధ్ర మీద ఏపీ రాజ‌కీయ పార్టీల చూపంతా ఉంది. అక్క‌డ విజ‌యం సాధిస్తే అధికారంలోకి రావ‌చ్చ‌నే సెంటిమెంట్ కూడా చాలా కాలంగా ఉంది. ఉమ్మ‌డి ఏపీ నుంచి విడిపోయిన ఏపీ వ‌ర‌కు ప‌శ్చిమ గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌ జిల్లా ప్ర‌జ‌ల మూడ్ కు అనుగుణంగా అధికారం వ‌స్తుందా? రాదా? అనేది ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే, అక్క‌డి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను రాజ‌కీయ పార్టీలు పోటీప‌డి నిర్వ‌హంచ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని స‌ర్వేల సారాంశం. సామాజిక ఈక్వేష‌న్ కూడా అక్క‌డ బాగా ప‌నిచేస్తోంది. అందుకే, ప‌వ‌న్ ఎప్పుడూ కార్య‌క్ర‌మాల‌ను ఎక్కువ‌గా పెడుతుంటారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ భీమవ‌రం కేంద్రంగా మెగా బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయాన్ని వేడెక్కించారు. ఆ త‌రువాత ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఎంతో కొంత జ‌న‌సేన ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంది. అందుకే, ఆ పార్టీ సామాజిక‌ ఈక్వేష‌న్ కు చెక్ పెట్టేలా మూడు రాజ‌ధానుల అంశాన్ని వైసీపీ తీసుకుంద‌ని తెలుస్తోంది.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల కంటే విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల ప్ర‌జ‌లు విశాఖ రాజ‌ధాని కావాల‌ని కోరుకుంటారు. అక్క‌డ ద‌శాబ్దాలుగా ఉత్త‌రాంధ్ర వాదం ఉంది. తెలుగు భాష‌లోని యాస‌, సంస్కృతులు, సామాజిక అంశాలు వేర్వేరుగా ఉంటాయి. సామాజిక అంశం ప్ర‌కారం ఓటు వేయాల‌నే దృక్ప‌దం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే, ప్రాంతీయ వాదాన్ని వైసీపీ అక్క‌డ లేపింద‌ని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌. నేప‌థ్యం వేరుగా ఉంటుంది. ఏపీలోని మిగిలిన జిల్లాల కంటే ఆ మూడు జిల్లాల్లో లా అండ్ ఆర్డ‌ర్ కూడా చాలా కూల్ గా ఉంటుంది. అందుకే , అక్క‌డ భావోద్వేగాల‌ను సామాన్యుల్లో రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం పార్టీలు చేస్తున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర అమ‌రావ‌తి టూ అర‌స‌వ‌ల్లి చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తిరోజూ ఉత్త‌రాంధ్ర‌పై రాజ‌కీయ దాడి అంటూ వైసీపీ వినిపిస్తోంది. ఒరిస్సా బోర్డర్లో ఉండే ఆ మూడు జిల్లాల‌ను ట‌చ్ చేస్తూ మ‌హాపాద‌యాత్ర‌ను అమ‌రావ‌తి రైతులు పెట్టారు. ప్ర‌తిగా అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆలోచింప చేసేలా వైసీపీ నేత‌లు విశాఖ రాజధాని ప్రచారాన్ని వైసీపీ అందుకుంది. ఆ క్ర‌మంలో ఇప్ప‌టికే ఎమ్మెల్యే ధ‌ర్మ‌శ్రీ రాజీనామా చేయ‌గా మ‌రికొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధ ప‌డ్డారు. ఈనెల 15వ తేదీ నాటికి ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు మ‌హాపాద‌యాత్ర చేరుకుంటుంది. అదే తేదీల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా మూడు రోజుల పాటు టూర్ షెడ్యూల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఆయ‌న `జ‌న‌వాణి` పేరుతో వివిధ స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదుల‌ను అందుకుంటున్నారు. ఆయ‌న‌కు సినిమా షూటింగ్ విరామం ఏర్ప‌డిన‌ప్పుడు `జ‌న‌వాణి`ని షెడ్యూల్ చేస్తున్నారు. ఈనెల 16వ తేదీన
త ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌లో `జ‌న‌వాణి` నిర్వ‌హిస్తార‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న పెట్టుకున్న 15, 16,17 తేదీల్లో వైసీపీ కూడా కొన్ని కార్య‌క్ర‌మాల‌ను రూపొందించింది. ఈ నెల 15వ తేదీన విశాఖ గ‌ర్జ‌న పేరుతో రాజ‌ధానికి అనుకూలంగా పెద్ద బ‌హిరంగ స‌భ, ర్యాలీకి వైసీపీ సిద్ధం అయింది. ఆ మేర‌కు మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ
విశాఖ గ‌ర్జ‌న‌లో భాగంగా న‌గ‌రంలోని అంబేద్క‌ర్ విగ్ర‌హం నుంచి వైఎస్సార్ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ర్యాలీకి మ‌ద్ద‌తుగా ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వ‌హించాల‌ని పిలుపునివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

మొత్తం మీద మ‌హాపాద‌యాత్ర‌, ప‌వ‌న్ చేప‌ట్టే `జ‌న‌వాణి`, వైసీపీ చేయ‌బోయే విశాఖ గ‌ర్జ‌నల‌తో ఈనెల 15వ తేదీన ఉత్త‌రాంధ్ర గంద‌ర‌గోళంగా మార‌నుంది. ఇప్పుడున్న‌ ప‌రిస్థితుల‌ను ఏ పార్టీ ఏ విధంగా అనుకూలంగా మ‌లుచుకుంటుందో చూద్దాం