AP Politics : 175/175 మావే!

ఏపీ ప్ర‌జ‌ల నాడి ఒక్కో పార్టీ ఒక్కో విధంగా క‌నిపిస్తోంది. సంతృప్త స్థాయిలో మేలు చేశామ‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 9, 2022 / 12:32 PM IST

ఏపీ ప్ర‌జ‌ల నాడి ఒక్కో పార్టీ ఒక్కో విధంగా క‌నిపిస్తోంది. సంతృప్త స్థాయిలో మేలు చేశామ‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే, ఈసారి ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ స్థానాల‌కు 175 వైసీపీ గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయ‌డానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిలు చురుగ్గా వెళ్లాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. సంతృప్త స్థాయిలో చేసిన ప‌ని గురించి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం మాత్రమే ఛాలెంజ్ అంటూ ఆయ‌న అన్నారు. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతోన్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం జ‌రుగుతోన్న తీరుపై జ‌గ‌న్ స‌మీక్షించారు. ఆ సంద‌ర్భంగా ఎవ‌రి ప‌నితీరు ఎలా ఉందో గ‌మ‌నిస్తున్నానంటూ లీడ‌ర్ల‌కు దిశానిర్దేశం చేస్తూ కుప్పం మున్సిపాలిటీ గెలుపును గుర్తు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఏపీలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై బాదుడేబాదుడు కార్య‌క్ర‌మాన్ని టీడీపీ కొన్ని రోజులు నిర్వ‌హిస్తోంది. ఆ ప్రోగ్రామ్ ను విజ‌య‌వంతం చేయ‌డానికి అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప‌లుమార్లు దిశానిర్దేశం చేశారు. తాజాగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న బాదుడేబాదుడుకు వ‌స్తోన్న స్పంద‌న గురించి ఆయ‌న స‌మీక్షించారు. నియోజ‌వ‌ర్గాల వారీగా ఇంచార్జిల‌తో ఆయ‌న సమీక్షించారు. ప్ర‌జా ఉద్య‌మాన్ని తీసుకురావాల‌ని పిలుపు నిచ్చారు. ఆ మేర‌కు తొలుత ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో జ‌రిగిన బాదుడేబాదుడు కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఆ త‌రువాత రాయ‌ల‌సీమ జిల్లాల్లోనూ ప‌ర్య‌టించారు. ఒంగోలు మ‌హానాడు సూప‌ర్ హిట్ కావడంతో బాదుడేబాదుడు కార్య‌క్ర‌మాన్ని మ‌రింత విజ‌య‌వంతం చేయాల‌ని బాబు డైరెక్ష‌న్ ఇచ్చారు. ఈసారి 175 స్థానాల‌కు 175 స్థానాలు గెలుచుకోవాల‌ని బాబు సూచిస్తున్నారు. రాష్ట్రాన్ని ఒక్క‌ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. అందుకే, ఒక్క చోట కూడా వైసీపీ గెల‌వ‌కుండా చేయాల‌ని చంద్ర‌బాబు చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇటీవ‌ల చంద్ర‌బాబునాడు క‌డ‌ప జిల్లాల‌కు బాదుడేబాదుడు కార్య‌క్ర‌మం కోసం వెళ్లారు. ఆ జిల్లా నుంచి వ‌చ్చిన స్పంద‌న చూసిన త‌రువాత ఈసారి పులివెందుల‌లో కూడా జ‌గ‌న్మోహన్ రెడ్డి గెలవ‌కుండా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌ధాన పార్టీలు 175కు 175 స్థానాలు గెలుచుకోవాల‌ని వ్యూహాలు ర‌చిస్తుంటే, బీజేపీ గోదావ‌రి గ‌ర్జ‌న పేరుతో రాజ‌మండ్రి వ‌ద్ద స‌భ‌ను పెట్టింది. ఆ స‌భ‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌జా విశ్వాసాన్ని కోల్పోయార‌ని చెబుతున్నారు. రాబోవు రోజుల్లో కింగ్ మేక‌ర్ అవుతామ‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. ఇంకొంద‌రు ఈసారి ప్ర‌భుత్వాన్ని ఏపీలో ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని చెబుతున్నారు. ఇక కేఏ పాల్‌, ప‌వ‌న్ ఇద్ద‌రూ ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని క్యాడ‌ర్ కు ఆశ క‌ల్పిస్తున్నారు. జ‌నసేన వీడి ప్ర‌జాశాంతి పార్టీలో చేరితే, ప‌వ‌న్ సీఎం తాను పీఎం అవుతానంటూ పాల్ చెబుతున్నారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతోంది.

ఇలా, అధికార , ప్రతిప‌క్షం 175/175 ఫార్ములాను వినిపిస్తుంటే, కింగ్ మేక‌ర్ లేక కింగ్ అంటూ బీజేపీ విశ్వ‌సిస్తోంది. రాజ్య‌ధికారం మాదేనంటూ ప‌వ‌న్‌, పాల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. మొత్తం మీద ఏపీ ఓట‌ర్ల నాడిని ఎవ‌రికివారే అనుకూలంగా అన్వ‌యించుకుంటూ రాజ‌కీయాన్ని `ముంద‌స్తు`గా ర‌క్తిక‌ట్టిస్తున్నారు. ఎన్నిక‌ల నాటికి ఇంకా ఎలాంటి కొత్త వ్యూహాల‌ను బ‌య‌ట‌కు తీస్తారో చూడాలి.