YSRCP Politics: వైసీపీ కోర్టులో పొలిటికల్ బాల్.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీని డిమాండ్ చేసి ప్రత్యేక హోదా తెస్తుందా?

అమరావతిలో అప్పటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 64 వేల స్థలాల్లో సుమారు 4.5 కోట్ల చదరపు గజాల స్థలం ఉంది.

  • Written By:
  • Updated On - June 19, 2022 / 02:41 PM IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షంలో ఉండగా నాటి టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. అనేక అంశాలపై నిలదీసేవారు. కానీ ఇప్పుడు అవే అంశాల విషయంలో మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా, ఉద్యోగాలు, సీపీఎస్ రద్దు.. ఇవే కాదు చాలా అంశాలపై మౌనమే సమాధానంగా మారుతోంది. అదేమంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉంది.. అలాంటప్పుడు గట్టిగా డిమాండ్ చేయలేం.. అందుకే అడుగుతూ ఉందామనే ధోరణినే కనబరుస్తోంది. ఆ పార్టీ నేతల మాటలూ అలానే ఉన్నాయి. మరి ఇలా అయితే ఏపీ అభివృద్ధి ఎలా? అందుకే ఇప్పుడు బాల్ ఏపీలో అధికారంలో ఉన్న వైపీసీ కోర్టులోకి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం. దానిని అడ్డం పెట్టుకుని.. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతికి, పోలవరానికి నిధులు కావాలని డిమాండ్ చేయచ్చు. మరి జగన్ అలా చేస్తారా?

25కి 25 ఎంపీ సీట్లలోనూ తమను గెలిపిస్తే.. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా.. ఏపీకి హోదా ఇస్తేనే.. మద్దతిస్తాం అని గట్టిగా చెప్పారు జగన్. ఇప్పుడు ఆ డిమాండ్ ను గట్టిగా అడగడానికి మంచి అవకాశం వచ్చింది. తెలుగువారికి ప్రత్యేక హోదాయే సంజీవని అని, ఆ హోదాతోనే పరిశ్రమలు వస్తాయని, పన్ను రాయితీలు లభిస్తాయని, ఉద్యోగాలు వచ్చేస్తాయని జగన్ చెప్పారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్సే ప్రాణవాయువన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కని.. దానిపై పోరాడాలని అన్నారు. మరిప్పుడు దానికోసం పోరాటం ఏది? పైగా వైసీపీకి లోక్ సభ, రాజ్యసభలో 31 మంది ఎంపీలున్నారు. అయినా ఆ నేతలు కేంద్రంపై పోరు బాట పట్టలేదు.

జగన్ సీఎం అయ్యాక.. ఈ మూడేళ్లలో సుమారు 15 సార్లయినా ఢిల్లీ వెళ్లారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పోరాటాలు ఏవి? వాటిలో ఎన్నింటిని సాధించారు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. అమరావతిని ఆధారంగా చేసుకుని.. లక్షల కోట్ల సంపదను సృష్టించి రాష్ట్రాన్ని బాగుచేద్దామనుకున్న తమ ఆశ, ఆశయం నాశనం అయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే ఆవేదన చెందుతున్నారు. మరి దానికి జగన్ సమాధానం ఏమిటి?

అమరావతిలో అప్పటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 64 వేల స్థలాల్లో సుమారు 4.5 కోట్ల చదరపు గజాల స్థలం ఉంది. అప్పటి రేటు ప్రకారం చూస్తే.. చదరపు గజం ధర సుమారు రూ.25 వేలు. అంటే రైతుల దగ్గరున్న స్థలాల విలువ దాదాపు రూ.1,25,000 కోట్లు. కానీ ఇప్పుడు దానిలో నాలుగోవంతు రేటు కూడా రావట్లేదు. అంటే సుమారుగా 90 వేల కోట్ల రూపాయిల సంపద గోవిందా! అని టీడీపీ ఆరోపిస్తోంది. అప్పట్లో సీఆర్డీఏ దగ్గర దాదాపు 10 వేల ఎకరాల స్థలం ఉండేది. ఒకవేళ అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే.. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎకరం ధర ఎలా లేదన్నా సుమారు రూ.10 కోట్లయినా ఉండేదని టీడీపీ చెబుతోంది. అంటే ఆ లెక్కన చూసినా.. ఆ భూమి విలువ రూ.లక్ష కోట్ల పైనే ఉండేది. కానీ ఇప్పుడు దాని విలువా పోయినట్టే అని విమర్శిస్తోంది.

ఏపీలో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలోనూ డెడ్ లైన్లు మారుతూ ఉన్నాయి. 2021 చివరినాటికి పూర్తి చేస్తామని చెప్పినా అది సాధ్యం కాలేదు. తరువాత 2022 జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఆ గడువులోగా పూర్తవ్వడమూ కష్టమే. అందుకే ఇప్పుడేమో.. అసలు ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి డెడ్ లైనూ లేదు. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటోంది ప్రభుత్వం. ఇక సీపీఎస్ ను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే రద్దు చేస్తామని చెప్పింది. కానీ తరువాత మాట మారింది. చివరకు దానిపై అవగాహన లేక ఆనాడు జగన్ హామీ ఇచ్చారు అని ప్రభుత్వం చెప్పింది. అంటే ఇది మాట తప్పడం కాదా.. మడమ తిప్పడం కాదా అని అని టీడీపీ ప్రశ్నిస్తోంది. అందుకే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీని డిమాండ్ చేసి.. రాష్ట్రానికి రావలసిన నిధులను రప్పించాలని, అభివృద్ధిని పరుగులు పెట్టించాలని విపక్షాలు కోరుతున్నాయి