Amaravati: అమ‌రావ‌తిపై ఎన్నిక‌ల చ‌ద‌రంగం

అమ‌రావ‌తి చుట్టూ భ‌విష్య‌త్ రాజ‌కీయాన్ని పార్టీలు అల్లేస్తున్నాయి. ఏ పార్టీకి తోచిన విధంగా ఆ పార్టీ అమ‌రాతిపై చ‌ద‌రంగాన్ని ఆడుతున్నాయి. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎజెండాగా తీసుకుని ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని చంద్ర‌బాబు స‌వాల్ విసిరాడు.

  • Written By:
  • Updated On - March 25, 2022 / 02:57 PM IST

అమ‌రావ‌తి చుట్టూ భ‌విష్య‌త్ రాజ‌కీయాన్ని పార్టీలు అల్లేస్తున్నాయి. ఏ పార్టీకి తోచిన విధంగా ఆ పార్టీ అమ‌రాతిపై చ‌ద‌రంగాన్ని ఆడుతున్నాయి. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఎజెండాగా తీసుకుని ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని చంద్ర‌బాబు స‌వాల్ విసిరాడు. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించాడు. ఇద్ద‌రూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాజ‌కీయ కోణం నుంచి చూడ‌డం గ‌మ‌నార్హం.
సీఆర్డీయే ఒప్పందం ప్ర‌కారం రైతుల‌కు న్యాయం చేయాల‌ని ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన విష‌యం విదిత‌మే. మూడు రాజ‌ధానుల బిల్లును స్వ‌చ్చంధంగా జ‌గ‌న్ స‌ర్కార్ ఉపసంహ‌రించుకున్న త‌రువాత ఇచ్చిన తీర్పు అది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ఏ ఒక్క‌టీ త‌రలించ‌డానికి లేద‌ని కోర్టు తీర్పు చెప్పింది. రైతుల‌కు ఇవ్వాల్సిన ప్లాట్ల‌ను అబివృద్ధి చేసి ఇవ్వ‌డానికి డెడ్ లైన్ పెట్టింది. రైతులతో సీఆర్డీయే చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం అభివృద్ధి చేయాల‌ని కోర్టు తేల్చేసింది. ఆ తీర్పును య‌థాత‌దంగా అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. కానీ, హైకోర్టు తీర్పు ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌ని అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్ స‌ర్కార్ చెబుతోంది. అంతేకాదు, మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని వెల్ల‌డించింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి రాజ‌ధాని ఎజెండా ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని ప్ర‌క‌టించాడు. ఆ మేర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి మ‌ళ్లీ గెలిస్తే..హైకోర్టు తీర్పును ధిక్క‌రించ‌డానికి అవ‌కాశం ఉందా? అనే ప్ర‌శ్న ఇక్క‌డ ఉత్ప‌న్నం అవుతుంది. విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బాబు ఇలాంటి ఎజెండాను ఫిక్స్ చేశాడు. అమ‌రావ‌తి రాజ‌ధాని కావాల‌నుకునే వాళ్లు గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేషన్ పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర‌వేయాల‌ని పిలుపు ఇచ్చాడు. ఒక వేళ ఓడిపోతే మీరే..రాజ‌ధాని వ‌ద్ద‌ని అంగీక‌రించిన‌ట్టు అవుతుంద‌ని వెల్ల‌డించాడు. అంతేకాదు, హైద‌రాబాద్ కు పాచిప‌నులు చేసుకోవ‌డానికి వెళ్లాల్సి వ‌స్తుంద‌ని కూడా హెచ్చ‌రించాడు. సీన్ కట్ చేస్తే..గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్లో గ‌ట్టి పోటీ ఇచ్చేలా కూడా అక్క‌డి ఓట‌ర్లు టీడీపీ ప‌క్షాన నిల‌వ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి రాజ‌ధాని ఎజెండాగా ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని చంద్ర‌బాబు స‌వాల్ విస‌రడం గ‌మ‌నార్హం.
వాస్త‌వంగా మూడు రాజధానుల అంశంపై ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని వైసీపీ భావిస్తోంది. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ల్లోని సెంటిమెంట్ ను న‌మ్ముకుంటోంది. క‌ర్నూలు రాజ‌ధానిగా ఉండాల‌ని రాయ‌ల‌సీమ వాసులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. క‌నీసం న్యాయ రాజ‌ధాని అయినా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నారు. ఒక వేళ దాన్ని అడ్డుకుంటే టీడీపీ అక్క‌డ న‌ష్ట‌పోయే ప్ర‌మాదం లేక‌పోలేదు. 2019 ఎన్నిక‌ల్లో హైకోర్టు బెంచ్ ను క‌ర్నూలులో పెడ‌తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చాడు. దానికి మ‌రింత సెంటిమెంట్ ను అద్దుతూ న్యాయ రాజ‌ధాని క‌ర్నూలు అంటూ జ‌గ‌న్ ముందుకొచ్చాడు. క‌ర్నూల రాజ‌ధాని కోసం రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఉద్య‌మిస్తోంది. ఆ ప్రాంతంలోని న్యాయ‌వాదులు వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు.
ఉత్త‌రాంధ్ర‌కు పరిపాల‌న రాజ‌ధాని కావాల‌ని అక్కడి ప్ర‌జ‌లు కోరుకోవ‌డంలేదని టీడీపీ అంచ‌నా. కానీ, సెంటిమెంట్ ను ఇప్ప‌టికే వైసీపీ అక్క‌డి ప్ర‌జ‌ల్లో తీసుకొచ్చింది. అందుకే, అమ‌రావ‌తి రాజ‌ధానికి మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని ఏడాదిన్న‌ర క్రితం విశాఖ వెళ్లిన బాబుపైన చెప్పులు, రాళ్లు వేసి నిర‌స‌న తెలిపారు. అదంతా వైసీపీ చేసిన ప‌నిగా టీడీపీ కొట్టివేస్తోంది. కానీ, రాజ‌ధాని కోసం జోలి ప‌ట్టి వివిధ ప్రాంతాల‌కు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేసిన బాబు ఆ త‌రువాత‌ నిమ్మ‌కుండి పోయిన సంఘ‌ట‌న మ‌రువ‌లేం. రాయ‌ల‌సీమ ప్రాంతంలోని అనంత‌పురం వ‌ర‌కు ఆయ‌న జోలె కార్య‌క్రమం ప‌రిమితం అయింది. ఇటీవ‌ల న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం మ‌హా పాద‌యాత్ర కూడా రాజ‌ధాని అమ‌రావ‌తి కావాల‌ని భావిస్తోన్న జ‌నం ఉండే ప్రాంతాల నుంచే వెళ్లింది. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల‌కు మ‌హా పాద‌యాత్ర వెళ్ల‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తి ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళితే..చంద్ర‌బాబు అనుకున్న‌ది జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఎంత అనేది పెద్ద ప్ర‌శ్న‌.
ఒక వేళ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి మూడు రాజ‌ధానుల ఎజెండాగా జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు వెళితే..హైకోర్టు ఇచ్చిన తీర్పును మార్చుకుంటుందా? అప్పుడు రాజ్యాంగం ప్ర‌కారం మూడు రాజ‌ధానులు ఏర్పడ‌తాయ‌ని రైతుల‌కు భ‌రోసా ఇస్తుందా? టీడీపీ గెలిస్తే ఓకే..లేదంటే రైతులు న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. ఇప్ప‌టికే గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తి ఎజెండా ఓడిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు ఎన్నిక‌ల ఎజెండాగా దాన్ని ఫిక్స్ చేస్తే..హైకోర్టు అంగీక‌రించ‌డానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అంటే స‌మాధానం చెప్పే వాళ్లే దొర‌క‌రు. క‌నుక‌, హైకోర్టు ఇచ్చిన తీర్పును శిరోధార్యంగా భావించాల్సిన బాధ్య‌త అటు ప్ర‌భుత్వం పైన ఇటు ప్ర‌తిప‌క్షాల‌పై ఉంది. రైతుల భ‌విష్యత్ ను ఎన్నికల ఎజెండాగా పెట్టాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో మేధావులు ఆలోచించాలి. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ముల‌కు బోలెడు కార‌ణాలు ఉంటాయి. ఒకే అంశంపై ఏ ఎన్నిక‌ జ‌ర‌గ‌దు. ఆ విష‌యం తెలిసి కూడా హైకోర్టు తీర్పును ధిక్క‌రిస్తూ అధికార‌, ప్ర‌తిప‌క్షం ముందుకు వెళ్ల‌డం శోచ‌నీయం.