JSP: మంచినీటి కోసం అడుక్కోవాలా ‘జగన్’?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ప్రజా సమస్యల పైనే పోరాటం కొనసాగిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 14, 2022 / 10:28 PM IST

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా ప్రజా సమస్యల పైనే పోరాటం కొనసాగిస్తోంది. వివిధ వర్గాల ప్రజలని కలుస్తూ… వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తోంది. తాజాగా మత్స్యకారులకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టిన జనసేన… వారి అభ్యున్నతి కోసం యాత్ర చేపట్టింది. మత్స్యకార అభ్యున్నతి యాత్ర అ సోమవారంతో రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏమన్నారంటే… రూ.2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించింది ఎంత? వారి సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు ఎందుకు తగ్గిస్తున్నారు? అని ప్రశ్నించారు. 2022వ సంవత్సరంలో కూడా రెండు బిందెల మంచినీటి కోసం మత్స్యకార మహిళలు ఎందుకు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార గ్రామాలు దాహార్తితో ఉన్న సంగతి అసలు ఈ ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. మంచి నీటి కోసం కూడా అడుక్కునే పరిస్థితి ఉంటే ప్రభుత్వాలు ఎందుకు? పదవులు ఎందుకని అన్నారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేసి నిధులు ఎవరికిచ్చారన్నారు. మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా రెండో రోజు ముమ్మిడివరం నియోజకవర్గంలోని రామన్నపాలెంలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “మత్స్యకార పల్లెల్లో మహిళలు పడుతున్న బాధలు, ఇబ్బందులు కన్నీరు తెప్పిస్తున్నాయి. కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సక్రమంగా లేక అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీలో మురుగు నీరు నిండిపోవడంతో ఒక మహిళ బకెట్ తో మరుగునీరు తోడి బయటపడేసే దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేయోచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేకపోవడంతో మత్స్యకార గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి.

డీజిల్ ధరలు పెరుగుతున్నా అదే సబ్సిడీ:

ఒక వైపు డీజిల్ ధరలు పెరుగుతుంటే… ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరడగం లేదు. ఒకప్పుడు లీటరు రూ.30 ఉన్నప్పుడు రూ. 9 సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు లీటర్ ధర వంద దాటినా అదే తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు. అది కూడా అందరికీ దక్కడం లేదు. వేటకు వెళ్లినప్పుడు 3వేల లీటర్ల డీజిల్ అవసరమైతే కేవలం 300 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. అధికారంలోకి రాక ముందు గ్రామాల్లో తిరిగి హామీలు ఇచ్చిన నాయకులు … గెలిచాక ఇప్పుడెందుకు గ్రామాల్లోకి రావడం లేదు. మీ సమస్యలు ఎందుకు తీర్చడం లేదు. మత్స్యకారుల సమస్య ఒక ప్రాంతానికి చెందింది కాదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన నరసాపురంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మత్స్యకార సమస్యలను గళమెత్తుతారు. వాటిపై పార్టీ స్టాండును కూడా వెల్లడిస్తారని అన్నారు.

మత్స్యకార గ్రామాలకు రక్షిత మంచినీరు

వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తే మత్స్యకార గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకం తీసుకొస్తుంది. మహిళలు వ్యాపారం చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న మిని స్టోరేజ్ లు నెలకొల్పుతాం. మత్స్యకార గ్రామాలు ఉన్న తీర ప్రాంతంలో పడవలు నిలుపుకునేందుకు వీలుగా జెట్టీలు నిర్మిస్తాం. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తాం. అలాగే మత్స్యకార యువతకు ఉపాధి కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. వైసీపీ, అధికారులను చూపి భయపడకుండా అందరం కలిసి కట్టుగా పనిచేస్తే మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేసి తీరుతామని అన్నారు.

రూ.5 లక్షలు బీమా సాయం

జనసేన క్రియాశీలక సభ్యుడు మేడిశెట్టి సాయిబాబా ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి గ్రామానికి చెందిన ఆయన కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. సాయిబాబా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భార్య శ్రీమతి లక్ష్మీ నరసమ్మ, కుమారులు లోవరాజు, నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులను మనోహర్ గారు ఓదార్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల బీమా చెక్కును అందజేశారు.

రెండో రోజు యాత్ర సాగిందిలా

జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి యాత్ర రెండో రోజు ముగిసింది. సోమవారం యాత్రంలో భాగంగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నాయకులు, మత్స్యకార వికాస విభాగం నాయకులు కాకినాడ, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని పలు మత్స్యకార గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలపై అధ్యయనం చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండో రోజు కాకినాడలోని మహాలక్ష్మినగర్ ప్రాంతంలో ప్రారంభమైన జనసేన పార్టీ మత్స్యకార అభ్యున్నతి యాత్ర డ్రైవర్స్ కాలనీ, పగడాలపేట, ముమ్మడివరం నియోజకవర్గం పరిధిలోని చొల్లంగిపేట, జి.వేమవరం, కొత్తూరు, రామన్నపాలెం తదితర గ్రామాల్లో సాగింది. పెద్ద సంఖ్యలో నాయకులు, జనసైనికులు తోడు రాగా జనసేన జెండాలు రెపరెపలాడుతూ యాత్ర సాగింది. ప్రతి గ్రామంలోనూ మత్స్యకార మహిళలు మనోహర్ తో పాటు పార్టీ నాయకులకు హారతులతో స్వాగతం పలికారు. దారి పొడుగునా పూల దండల వర్షం కురిపించారు. ప్రతి గ్రామంలోనూ మనోహర్ మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి యువకులను, కుటుంబ పెద్దలను మహిళలను కలుసుకొని వారు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి మీద ఆరా తీశారు. యాత్రలో భాగంగా గురజనాపల్లి జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మనోహర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. మట్లపాలెం వద్ద మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం జనసేన పార్టీ చేస్తున్న కృషి, పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై కొత్తూరులో వివిధ పార్టీలకు చెందిన మత్స్యకార నాయకులు జనసేన పార్టీలో చేరారు. వీరందరినీ నాదెండ్ల మనోహర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పి.ఎ.సి. సభ్యులు పితాని బాలకృష్ణ, పంతం నానాజీ, ముత్తా శశిధర్, పార్టీ ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారులకు హెల్ప్ లైన్:

జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం తరఫున ఒక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేస్తున్నామని మనోహర్ తెలిపారు. 83 31 83 83 83 అనే నంబర్ ఈ విభాగం తరఫున ఉంటుంది. అర్హత ఉన్నా ప్రభుత్వం నుంచి మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ అందుకోలేకపోయిన మత్స్యకారులు పై హెల్ప్ లైన్ నంబరుకి ఫోన్ చేసి సమస్య తెలియచేయవచ్చని మత్స్యకార వికాస విభాగం తెలిపింది.