దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు (AP Police Notice) అందించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య నేతృత్వంలోని పోలీస్ బృందం హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి చేరుకుని నోటీసులు అందించారు. వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో, సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా పోస్టులు చేశారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది.
నోటీసులో నవంబర్ 19న ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీసుకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు.. BNS చట్టంలోని 336 (4), 353 (2) సెక్షన్ల కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ధృవీకరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆర్జీవీ డెన్ కార్యాలయంలో వర్మకు నోటీసులు అందించినట్లు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో…కూటమి నేతలను టార్గెట్ గా వర్మ సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై నిత్యం వర్మ విరుచుకుపడేవారు. జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా తీసిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్, బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక వైసీపీ ప్రభుత్వ సమయంలో…కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీకి మద్దతుగా సోషల్ మీడియాలో కొందరు పరిధి దాటి వ్యవహరించేవారు. ఇందులో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పటికి సోషల్ మీడియాలో విచ్చలవిడితనం మరింతగా పెరిగిపోవడంతో కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకొని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన భాషలో చెలరేగిపోయిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందర్నీ అరెస్ట్ చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.
నటి శ్రీరెడ్డిపై కూడా తాజాగా రాజమహేంద్రవరం పోలీసులకు టీడీపీ మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లోనూ తెలుగు మహిళ సభ్యులు ఫిర్యాదు చేశారు. వరుస ఫిర్యాదులతో నెక్స్ట్ అరెస్ట్ చేయబోయేది శ్రీరెడ్డి నే అని తెలుస్తుంది.
Read Also : Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధి పెంపు..