Site icon HashtagU Telugu

Inspectors Promotion Issue: ప‌చ్చి అబ‌ద్ధం..నికార్సైన నిజం.!

8709

8709

జ‌గ‌న్‌ విశ్వసనీయతను వైసీపీ బ్రాండ్‌గా వాడుకుంటోంది. మడమ తిప్పం, మాట తప్పని వంశంగా వైఎస్ ఫ్యామిలీని ఫోక‌స్ చేస్తోంది. ప‌దేప‌దే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్ర‌చారం అది. కానీ ఆయన అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన ప్రభుత్వమే ప‌రోక్షంగా తేల్చి చెప్పింది. గత ఎన్నికల ప్రచారం సమయంలో సీఐల ప్రమోషన్ లకు సంబంధించి జగన్ కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అవన్నీ అబద్దాలే అని ఏపీ హోంమంత్రి సుచరిత తేల్చేయ‌డం గ‌మ‌నార్హం.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 37 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు. కానీ వీరిలో 35 మంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే అని జగన్ ఆనాడు ఆరోపించారు. డీఎస్పీల జాబితా ఇదే అని.. ఒకే కులానికి ప్రమోషన్ లు ఇచ్చారని ఆనాడు ప్రచారం చేశారు. దీనిని జనం కూడా నమ్మేలా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. దీనిపై 2019 ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కు కంప్లయింట్ కూడా చేశారు. అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఈ వీడియో క్లిప్ ను విపరీతంగా వాడుకుంది. కానీ జగన్ ఆనాడు చేసిన ఆరోప‌ణ‌లు అబద్ధమ‌ని తాజాగా జగన్ సర్కారు లోని హోంమంత్రి చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

సీఐల ప్రమోషన్ కు సంబంధించి జగన్ చెప్పింది అబద్ధమని ఆనాడు పోలీస్ శాఖ అన్ని వివరాలను బ‌య‌ట‌పెట్టిన‌ప్ప‌టికీ జగన్ మాత్రం ఆ ఆరోప‌ణ‌ల‌ను ఆపలేదు. అందుకే అసలు జగన్ చేసిన ఆరోపణ నిజమో, అబద్ధమో ప్రజలకు తెలియడానికి.. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, అశోక్ బెందాళం, మంతెన రామరాజులు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రశ్న సంధించ‌డంతో అసలు నిజం వెలుగుచూసింది.

2019 ఎన్నికలకు ముందు 35 మంది సీఐలకు డిఎస్పీలుగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి ప్రమోషన్ ఇచ్చారా.. అసలు వాళ్ల డీటైల్స్ ఏమిటి? అప్పుడు నష్టపోయిన వారి వివరాలతోపాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంది అని అడిగారు. దీంతో ఏపీ హోంశాఖా మంత్రి మేకతోటి సుచరిత లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అసలు నిజం బయటపడింది. 2016-17, ఇంకా 2017-18 ప్యానెల్ లో మొత్తం 36 మంది పోలీస్ అధికారులకు డీఎస్పీలుగా ప్రమోషన్ వచ్చింది. ఇందులో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఆఫీసర్ కూడా ఉన్నారు. అంటే దీనిని బట్టి చూస్తే.. వీరిలో ఇద్దరు మినహాయించి మిగిలినవారంతా చంద్రబాబు సామాజికవర్గం కాదని జగన్ సర్కారే ఒప్పుకుంది.

గతంలో ఇచ్చిన ప్రమోషన్లలోనూ ఎలాంటి అవకతవకలు లేవని, ఎవరికీ అన్యాయం జరగలేదని హోం శాఖామంత్రే తెలిపారు. 2014-15, 2015-16 ప్యానెల్ లో కూడా 35 మందికి ప్రమోషన్ ఇచ్చారు. ఈ జాబితాలో చూసినా… వారంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కాదు. పైగా ప్రమోషన్ వచ్చిన అధికారి పేరు, పుట్టిన తేదీ, ప్రమోషన్ పొందిన తేదీ.. ఇలా అన్ని డీటైల్స్ ను ప్రభుత్వమే చెప్పింది. అంటే ఆనాడు జగన్ చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని తేలిపోయింది. దీంతో వైసీపీ వర్గాలు డిఫెన్స్ లో పడ్డాయి.