Drugs : డ్రగ్స్ ముఠా గుట్టు ర‌ట్టు చేసిన చిత్తూరు పోలీసులు.. ఆరుగురు అరెస్ట్‌

చిత్తూరు నగరంలో డ్రగ్స్ సరఫరా చేసి వినియోగిస్తున్న ముఠాను పోలీస‌లు అరెస్ట్ చేశారు. 34 గ్రాముల మిథైలెనెడియాక్సీ...

  • Written By:
  • Publish Date - November 8, 2022 / 11:07 AM IST

చిత్తూరు నగరంలో డ్రగ్స్ సరఫరా చేసి వినియోగిస్తున్న ముఠాను పోలీస‌లు అరెస్ట్ చేశారు. 34 గ్రాముల మిథైలెనెడియాక్సీ-మెథాంఫెటమైన్ (ఎండీఎంఏ)ను స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని సూడాన్‌కు చెందిన అహ్మద్ ఒమర్ (28), చిత్తూరుకు చెందిన కె. సిరాజ్ (37), కె. సురేష్ (25), ఎస్. జయశంకర్ (32), సి. ప్రతాప్ (26), ఎస్. తేజకుమార్ (22)లుగా గుర్తించారు. ఇద్దరు పట్టణ ఎస్‌ఐలు మల్లికార్జున, లోకేష్‌ తమ సిబ్బందితో కలిసి ఆదివారం ఇరువరం-యాదమరి జంక్షన్‌లో కొందరు వ్యక్తులు స్ఫటికాల రూపంలో విక్రయించడం, కొనుగోలు చేయడంపై దాడి చేసి పట్టుకున్న‌ట్లు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ముగ్గురు వ్యక్తులు పారిపోగా..ఘటనా స్థలంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం అరగొండకు చెందిన కె.సిరాజ్‌, సూడాన్‌లోని ఖార్టూమ్‌ సిటీకి చెందిన అహ్మద్‌ ఒమర్‌తో కలిసి ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. బెంగళూరులో ఒమర్‌తో స్నేహం ఉంది. అతని వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేసి చిత్తూరు నగరానికి చెందిన యువకులు సురేష్, జయశంకర్, ప్రతాప్, తేజ, వెంకటేశ్, మోహన్, మురళిలకు విక్రయిస్తుండేవాడు. కాగా, రూ.2 లక్షల విలువైన 34 గ్రాముల మత్తుమందు, 20 సిరంజిలు, మూడు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒమర్ పాస్‌పోర్టు, వీసా స్వాధీనం చేసుకున్నారు.