30 Ft bronze statue: మ‌న్యంవీరుని కోసం ప్ర‌ధాని `మోడీ `

భీమవరం పట్టణంలోని ఏఎస్‌ఆర్ నగర్‌లో 30 అడుగుల విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. జులై 4న మహా దినోత్సవంకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

  • Written By:
  • Updated On - July 1, 2022 / 01:17 PM IST

భీమవరం పట్టణంలోని ఏఎస్‌ఆర్ నగర్‌లో 30 అడుగుల విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. జులై 4న మహా దినోత్సవంకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య’ వేడుకల సందర్భంగా గొప్ప స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే ఆజాదీ-కా-అమృతోస్త్వవ్ కార్యక్రమం కింద, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేశాయి. క్షత్రియ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ యూనిట్లతో పాటుగా అల్లూరి సీతారామ రాజు సేవా సమితి (ASRS) ప్రభుత్వ అధికారులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నాయి.

పాలకొల్లు మండలం అగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.3 కోట్లు ఇచ్చారు విగ్రహానికి 16 కిలోల కంచును వినియోగించినట్లు శిల్పులు తెలిపారు. విజయవాడ నుంచి గురువారం రాత్రి భీమవరం పట్టణానికి విగ్ర‌హాన్ని తీసుకొచ్చారు. శుక్రవారం విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని 30 రోజుల్లోనే రూపొందించారు. ప్రధాని నేరుగా సంఘటనా స్థలానికి చేరుకునేందుకు వేంపాడు కాలువపై ప్రత్యేక వంతెన, పెదఅమిరం గ్రామం వద్ద హెలిప్యాడ్‌ను అధికారులు నిర్మిస్తున్నారు.

జూలై 4న జరగనున్న ప్రధాని పర్యటనకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని పశ్చిమగోదావరి కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. భీమవరాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుతో సంబంధమున్న 36 కుటుంబాలను అధికారులు గుర్తించారు. వారిని ప్రధానమంత్రి సత్కరించేలా ఏర్పాట్లు చేశారు.

భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ నగర్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని అల్లూరి సీతారామరాజు సేవాసమితి అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు తెలిపారు. ప్రభుత్వ నిధుల కోసం క్షత్రియ సేవా సమితి, ఏఎస్‌ఆర్‌ సమితి ఎదురుచూడలేదని, ప్రధాని రాకలోపు పనులు పూర్తి చేసేందుకు తక్షణమే పనులు జరుగుతున్నాయన్నారు.

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించగా, రాష్ట్ర మంత్రులు కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు.
జూలై 4న జరిగే కార్యక్రమానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హాజరు కానున్నారు. ఆ రోజు భీమవరం వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నది తెలియడం లేదు.