pm vizag tour: ప్ర‌ధాని విశాఖ షెడ్యూల్ ఖ‌రారు, మ‌ళ్లీ జ‌న‌సేనానికి జ‌ల‌క్‌!

ముసుగులో గుద్దులాట మాదిరిగా జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడ‌ర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌లిసి ప‌నిచేయ‌రు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌మానించేలా ఏపీ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు పాల్గొనే వేదిక‌ల‌పై ప‌వ‌న్ కు చోటు దొర‌క‌డంలేదు.

  • Written By:
  • Updated On - November 2, 2022 / 04:15 PM IST

ముసుగులో గుద్దులాట మాదిరిగా జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడ‌ర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌లిసి ప‌నిచేయ‌రు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌మానించేలా ఏపీ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు పాల్గొనే వేదిక‌ల‌పై ప‌వ‌న్ కు చోటు దొర‌క‌డంలేదు. అయిన‌ప్ప‌టికీ బీజేపీతో ఆయ‌న కొన‌సాగ‌డం అంత‌బ‌ట్ట‌ని అంశం.

ఈనెల 11వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏపీ రాష్ట్రానికి వ‌స్తున్నారు. విశాఖ కేంద్రంగా జ‌రిగే ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటారు. ప‌లు ప‌థ‌కాలకు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలకు ఈనెల 12న ఆయ‌న హాజ‌రవుతారు. ప్ర‌ధాని షెడ్యూల్ కు సంబంధించిన రూట్ మ్యాప్ వెలువ‌డింది. కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఈసారి కూడా చోటులేక‌పోవ‌డం అవ‌మానంగా జ‌న‌సేన ఫీల్ కావ‌డం స‌హ‌జం.

షెడ్యూల్ ప్ర‌కారం ఈనెల 11న ఐఎన్ఎస్ వద్ద ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి స్వాగతం ప‌లుకుతారు. అక్కడి నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి మోడీ చేరుకుంటారు. రాత్రికి ఐఎన్ఎస్ బంగ‌ళాలో బస చేస్తారు. మరుసటి రోజు ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మోడీ దాదాపు 14 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

తూర్పుగోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణకు ఇటీవ‌ల మోడీ వ‌చ్చారు. ఆ సంద‌ర్భంగా మెగా స్టార్ చిరంజీవికి ల‌భించిన ఆహ్వానం జ‌న‌సేనాని ప‌వ‌న్ కు మాత్రం అంద‌లేదు. పైగా చిరంజీవికి వేదిక‌పై మోడీ ఇచ్చిన ప్రాధాన్యం ప‌లు రాజ‌కీయ కోణాల‌ను ఆవిష్క‌రించింది. సిట్టింగ్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజుతో పాటు ప‌వన్ కు ఆహ్వానం లేకుండా జ‌గన్ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించింది. అంతేకాదు, టీడీపీ త‌ర‌పున ఆహ్వానం ఇచ్చిన‌ప్ప‌టికీ ప్రోగ్రామ్ స‌మ‌యానికి ప్రొటోకాల్ లేకుండా చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈనెల 11న విశాఖ‌కు వ‌స్తోన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖరారు అయింది. అయితే, ఈసారి కూడా ప‌వ‌న్ కు ఏ మాత్రం అవ‌కాశం లేకుండా జ‌గ‌న్ స‌ర్కార్ టూర్ ఫిక్స్ చేసింది. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు ఉన్నామ‌ని చెప్పుకునే జ‌న‌సేన‌కు ఈసారి మోడీ టూర్ మ‌రింత బాధ‌ను క‌లిగిస్తోంది. రెండు వారాల క్రితం విశాఖ కేంద్రంగా ప‌వ‌న్ కు జ‌రిగిన అవ‌మానం పొత్తుల ప్ర‌కంప‌న‌ల‌ను రేపింది. బీజేపీతో క‌టీఫ్ చేసుకుంటూ ప‌వ‌న్ నోటి వెంట ప‌రోక్షంగా సంకేతాలు వెలువ‌డ్డాయి. ఆ లోపు ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల నుంచి ఫోన్లు వ‌చ్చాయ‌ని జ‌న‌సేన బ‌య‌ట‌కు చెప్పుకుంది. ఎలాంటి ఫోన్ కాల్స్ ప్ర‌ధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి ప‌వ‌న్ కు రాలేద‌ని ఆల‌స్యంగా వెలుగుచూసింది.

బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తోన్న ప‌వ‌న్ కు మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విశాఖ రాక సంద‌ర్భంగా అవ‌మానం జరుగుతుంద‌ని షెడ్యూల్ ఆధారంగా అర్థం అవుతోంది. ఒక రాజ‌కీయ పార్టీ అధినేత‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసే అవ‌కాశం ప‌వ‌న్ కు ఉంటుందా? ఉండ‌దా? అనేది కూడా సందేహ‌మే.