Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భీమ‌వ‌రం వేదిక‌పై చిరంజీవి మీద చూపిన ఆప్యాయ‌త అపారం. ప్ర‌త్యేకంగా `మెగా`పై ప్రేమ‌ను కురిపించారు. ప్ర‌ధాని మోడీలాంటి లీడ‌ర్ స్పెష‌ల్ గా చిరంజీవి చేతులు ప‌ట్టుకుని అభిమానం కురిపించ‌డం ఎన్నో ఊహాగానాల‌కు అవ‌కాశం ఇస్తోంది.

  • Written By:
  • Updated On - July 4, 2022 / 05:45 PM IST

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భీమ‌వ‌రం వేదిక‌పై చిరంజీవి మీద చూపిన ఆప్యాయ‌త అపారం. ప్ర‌త్యేకంగా `మెగా`పై ప్రేమ‌ను కురిపించారు. ప్ర‌ధాని మోడీలాంటి లీడ‌ర్ స్పెష‌ల్ గా చిరంజీవి చేతులు ప‌ట్టుకుని అభిమానం కురిపించ‌డం ఎన్నో ఊహాగానాల‌కు అవ‌కాశం ఇస్తోంది. సాధార‌ణంగా న‌రేంద్ర మోడీలాంటి పొలిటిక‌ల్ లీడ‌ర్ క‌న్నుప‌డిందంటే ఏదో ఉంటుందని ఊహించుకోవ‌డం స‌హ‌జం. మెగాస్టార్ చిరంజీవిపై ఆప్యాయ‌త‌తో కూడిన మోడీ పల‌క‌రింపు మ‌రువ‌లేనిది. ఆ దృశ్యం చూసిన మెగా అభిమానులు సంబ‌ర‌ప‌డ‌కుండా ఉండ‌లేరు.

ప్ర‌స్తుతం చిరంజీవి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌లేదు. కానీ, ఆ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరం జ‌రిగారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితంగా మెలుగుతున్నారు. గ‌త సంక్రాంతి సంద‌ర్భంగా చిరంజీవిని ఇంటికి ఆహ్వానించి జ‌గ‌న్ కుటుంబం విందు ఇచ్చింది. ప్ర‌త్యేక విమానం ద్వారా ఆయ‌న్ను తాడేప‌ల్లి ప్యాలెస్ కు తీసుకెళ్లారు. ఆ త‌రువాత కూడా ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విధానంపై మాట్లాడేందుకు క‌లిసిన విష‌యం విదిత‌మే. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న మూడు రాజ‌ధానుల విధానాన్ని స‌మ‌ర్థించిన హీరో చిరంజీవి. ఆనాటి నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహంతో కూడిన సాన్నిహిత్యం కొనసాగుతోంద‌ని ప‌లువురు గ్రహించారు.

టాలీవుడ్ పెద్ద‌గా చిరంజీవిని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గుర్తించారు. అందుకే, మా అధ్య‌క్షుడు మంచు విష్ణుతో సంబంధంలేకుండా హీరో చిరంజీవితో ఆన్ లైన్ టిక్కెట్ల వ్య‌వ‌హారంపై సంప్ర‌దింపులు జ‌రిపారు. పైగా చిరంజీవి ఎలా కావాలంటే ఆ విధంగా చేయండ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్ప‌ట్లో ఆదేశాలు ఇచ్చార‌ట‌. ఇప్పుడు తాజాగా భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ వేదిక‌పై చిరంజీవికి ఏపీ సీఎం ప్రాధాన్యం ఇచ్చారు. అంత‌కంటే ఎక్కువ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆప్యాయ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను చూస్తుంటే, భ‌విష్య‌త్ లో చిరంజీవి బీజేపీలోకా? వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా? అనే భావం క‌లుగుతోంది.

భీమ‌వరం వేదిక మీద‌కు వ‌చ్చిన మోదీ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేయ‌డానికి వేదిక ముందు వైపు వ‌చ్చారు. ఆయ‌న ప‌క్కనే నిల‌బ‌డి ముందుకు రావ‌డ‌దానికి సంశ‌యిస్తున్న‌ట్లుగా క‌నిపించిన జ‌గ‌న్‌ను మోదీ చేయి ప‌ట్టి ముందుకు పిలిచారు. ఆ టైంలో స‌త్క‌రించేందుకు వ‌చ్చిన చిరంజీవితో ఉద్వేగంగా మోడీ మాట్లాడ‌డం క‌నిపించింది. చిరు భుజం త‌ట్టి మ‌రీ ప్రోత్స‌హిస్తున్న‌ట్లుగా మాట్లాడిన మోదీ, ఓ నిమిషం పాటు చిరుతో ఏదో మాట్లాడారు. మోదీ చెప్పిన మాట‌ల‌ను విన్న చిరు ఉద్వేగంతో మోదీకి న‌మ‌స్క‌రించారు. చిరుతో మాట్టాడుతున్నంత సేపు మోదీ ఆయ‌న చేతుల‌ను విడిచిపెట్ట‌కుండా ప‌ట్టుకున్న దృశ్యం ఆస‌క్తి రేకెత్తించింది. ప‌లు రాజ‌కీయ ఊహాగానాల‌కు తావిస్తోంది.