Ghibli Trends : ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ల ‘జిబ్లీ ఆర్ట్’ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) యుగం. ఈతరం వారంతా ఛాట్ జీపీటీ, గ్రోక్, రన్ వే ఎంఎల్ వంటి ఏఐ టూల్స్‌ను వాడుతున్నారు. జిబ్లీ ఆర్ట్‌ను జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ ‘స్టూడియో జిబ్లీ’ తొలుత ప్రారంభించింది. నిజమైన ఫొటోలను దీనిలోకి అప్‌లోడ్ చేస్తే.. కార్టూన్ టైప్ ఫొటోలుగా మారిపోతాయి. ఈ జిబ్లీ ఆర్ట్‌ను అనేక ఏఐ కంపెనీలు తమ ఛాట్‌బోట్‌లకు అనుసంధానించాయి. నెటిజన్లు ఆయా ఛాట్ బోట్లలోకి వెళ్లి తమ అభిమాన నేతలు, నటులు, సెలబ్రిటీల ఒరిజినల్ ఫొటోలను అప్‌లోడ్ చేసి జిబ్లీ స్టైల్‌లోకి మార్చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఒరిజినల్ ఫొటోలను ఎలాంటి అనుమతులు పొందకుండా నేరుగా జిబ్లీ స్టైల్‌లోకి మార్చడం ఏఐ ఛాట్‌బోట్‌లకు కాపీరైట్ సమస్య ఎదురవుతోందని టెక్ పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
Also Read :Clocks Tree : క్లాక్ ట్రీ.. ఘడీ వాలే బాబా.. మంచి టైం తెచ్చే మర్రిచెట్టు
ప్రధాని మోడీ ఫొటోలు జిబ్లీలోకి..
ఛాట్ జీపీటీ అనేది అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ కంపెనీ నిర్వహించే ఛాట్ బోట్. ఇది తమ యూజర్ల కోసం ఇటీవలే జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. దీనిలోకి ఒరిజినల్ ఫొటోలను అప్‌లోడ్ చేస్తే.. జిబ్లీ కార్టూన్లుగా మారిపోతాయి. ప్రధాని మోడీకి చెందిన జిబ్లీ ఫొటోలను ఈ ‘జీబ్లీ ఫీచర్’తో క్రియేట్ చేసి MyGovIndia ఖాతాలో షేర్ చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని మోడీ జిబ్లీ ఫొటోలను MyGovIndia ఖాతాలో షేర్ చేసే క్రమంలో.. ‘‘ప్రధాన పాత్రధారా? కాదు. ఆయనే మొత్తం కథాంశం. స్టూడియో జీబ్లీ స్ట్రోక్స్‌లో నవ భారతాన్ని చూద్దామిలా’’ అని రాశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వంటి వారితో ప్రధాని భేటీ అయిన ఫొటోలు ఈ జాబితాలో ఉన్నాయి. మోదీ అయోధ్య సందర్శన, తేజస్‌లో ప్రధాని విహారం వంటి ఫొటోలను సైతం జిబ్లీ స్టైల్‌లోకి మార్చారు.
నారా లోకేశ్, చంద్రబాబు ఒకేరోజు..
ఏపీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆయన సైతం జిబ్లీ ట్రెండ్‌లోకి అడుగుపెట్టారు. మూడు జిబ్లీ కార్టూన్లను లోకేశ్(Ghibli Trends) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిలోని ఒక ఫొటోలో నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్, తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి ఉన్నారు. రెండో, మూడో ఫొటోలలో లోకేశ్ తన టీడీపీ మద్దతుదారులతో ఉన్నారు. అయితే చంద్రబాబు, లోకేశ్‌లు ఒకేరోజు కొన్ని నిమిషాల తేడాతో జిబ్లీ కార్టూన్లను తమ ఎక్స్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ లతో కలిసి బహిరంగ సభ వేదికపై నిలబడిన జిబ్లీ కార్టూన్‌ను చంద్రబాబు పోస్ట్ చేశారు.