CM Chandrababu: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu)తో ప్రధానమంత్రి మోదీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి ప్రధాని ఆరా తీశారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని, అవసరమైన సహాయాన్ని తక్షణమే అందజేస్తుందని ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
పీఎంవోతో సమన్వయానికి లోకేశ్
తుఫాను తీవ్రత, సహాయక చర్యలపై ప్రధానితో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేంద్ర సహకారం సకాలంలో అందేలా చూసే బాధ్యతను మంత్రి నారా లోకేశ్‌కు అప్పగించింది.
Also Read: Montha Toofan : తుఫాన్ పై చేస్తున్న అసత్య ప్రచారంపై పవన్ ఆగ్రహం
ప్రభుత్వం అప్పగించిన బాధ్యత మేరకు మంత్రి లోకేశ్ తక్షణమే పీఎంవోతో సమన్వయం చేయడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచే ఆయన తుఫాన్ ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని సమీక్షిస్తూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో నిరంతరం టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను లోకేశ్ ఆదేశిస్తున్నారు.
సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
మరోవైపు మొంథా తుఫాన్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) కేంద్రం ద్వారా మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కదలికలను ప్రతి గంటకూ గమనిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, విద్యుత్ పునరుద్ధరణ కోసం జనరేటర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం అక్టోబర్ 30 వరకు అధికారులకు సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం పూర్తి భరోసా ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సన్నద్ధతలతో మొంథా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
