Site icon HashtagU Telugu

Modi, Chandrababu : ఔను! వాళ్లిద్ద‌రూ మ‌ళ్లీ భేటీ ఖాయం!!

Modi option

Chandrababu naidu modi

మ‌రోసారి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి పూర్తిస్థాయి రాజ‌కీయ మీటింగ్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ఉండ‌బోతుంద‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కేంద్రంగా కేవ‌లం 5 నిమిషాల పాటు మోడీ, చంద్ర‌బాబు భేటీతో వ‌చ్చిన రాజ‌కీయ సానుకూల అంశాల‌ను ఏపీ బీజేపీ ఢిల్లీ చేర‌వేసింది. పైగా చంద్ర‌బాబులాంటి విజ‌న‌రీ మ‌రొక‌రు ఉండ‌రంటూ ఏపీ బీజేపీ చీఫ్ వీర్రాజు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే, మునుగోడు ఉప ఎన్నిక‌ల కంటే ముందుగా కీల‌క భేటీ చంద్ర‌బాబు, మోడీ మ‌ధ్య ఉండే అవ‌కాశం లేక‌పోలేదు.

ఢిల్లీ రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి క్లోజ్ గా చూస్తున్నారు. అంతేకాదు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి కూడా బీజేపీ, టీడీపీ మ‌ధ్య కుదిరిన ఒప్పందం ఏమిటో చెప్పేస్తున్నారు. ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మ‌ద్ధతు బీజేపీ కోరుకుంటోంది. ఏపీ రాష్ట్రంలో బీజేపీ పొత్తును టీడీపీ ఆశిస్తోంది. ఇదే ఈక్వేష‌న్ రెండు రాష్ట్రాల్లోనూ అమ‌లు చేయ‌డానికి నాగ‌పూర్ కేంద్రంగా పెద్ద స్కెచ్ త‌యారు అయిందని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని టాక్‌.

మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందుగా బీజేపీ, టీడీపీ మ‌ధ్య జ‌రిగే ప‌రిణామాలు వేగంగా ముందుకు వెళ్ల‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఒక వైపు ఎన్డీయే నుంచి జేడీయూ వెళ్ల‌పోవ‌డంతో ఆ స్థాయి నాయ‌కుని కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. బీహార్ సీఎం ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన లోపాన్ని చంద్ర‌బాబుతో భ‌ర్తీ చేయాల‌ని క‌మ‌ల‌నాథుల యోచ‌న‌గా ఉంద‌ట‌. ప‌లుమార్లు ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావాల‌ని వైసీపీని ఒత్తిడి పెట్టింది. కానీ, బ‌య‌ట నుంచి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ్డ ఆ పార్టీ ఎన్డీయేతో జ‌ట్టు క‌ట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. కానీ, టీడీపీ భాగ‌స్వామ్యానికి రెడీగా ఉందని తెలుస్తోంది. పైగా పూర్వ‌పు కూట‌మిలో కూడా ఆ పార్టీ కీల‌కంగా ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా ఇప్ప‌టికీ చంద్ర‌బాబు చేసిన అభివృద్ధి గురించి ప్ర‌జ‌లు మాట్లాడుకుంటారు. ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ రెవెన్యూ గురించి ప్ర‌స్తావించాల్సి వ‌స్తే ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు గుర్తు వ‌స్తారు. ఆ విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో మంత్రి కేటీఆర్ కూడా గుర్తు చేశారు. రాజ‌కీయంగా విభేదించ‌డానికి అవ‌కాశం ఉందిగానీ, చంద్ర‌బాబు విజ‌న‌రీని ఎవ‌రూ కాద‌న‌లేర‌ని కేటీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీ కీల‌క నేత‌లు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి హ‌డావుడి చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల‌ను పొంద‌డానికి ప‌లు ప్ర‌య‌త్నాల‌ను టీఆర్ఎస్ చేస్తోంది. అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండూ టీడీపీ సానుభూతి ఓట్లు, లీడ‌ర్లు, క్యాడ‌ర్ కోసం ప‌లుర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అందుకే, ఇప్పుడు చంద్ర‌బాబు ద్వారా తెలంగాణ ఆప‌రేష‌న్ ను విజ‌య‌వంతంగా చేయాల‌ని బీజేపీ స్కెచ్ వేసింది.

తెర‌వెనుక వ్యూహాల‌ను ర‌చించ‌డంలో చంద్ర‌బాబును మించిన లీడ‌ర్ ఉండ‌రని అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న చ‌తుర‌త‌ను మునుగోడు ఉప ఎన్నిక‌ల్లోనూ తెర‌వెనుక ఉప‌యోగించుకోవాల‌ని బీజేపీ తొంద‌ర‌ప‌డుతోంది. పైగా మ‌ళ్లీ కలుద్దాం అంటూ మోడీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వేదిక‌గా చెప్పారు. ఆ క్ర‌మంలో త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు, మోడీ భేటీ ఉండ‌బోతుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఈసారి వాళ్లిద్ద‌రి క‌ల‌యిక తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మార‌నుంది.