AP Politics: ఏపీపై `పీకే-కేసీఆర్` ఆప‌రేష‌న్

దేశ రాజ‌కీయాలు ఏమోగానీ, ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చ‌బోతున్నారు.

  • Written By:
  • Updated On - September 12, 2022 / 10:44 PM IST

దేశ రాజ‌కీయాలు ఏమోగానీ, ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చ‌బోతున్నారు. అందుకోసం రెండేళ్ల నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసిన‌ట్టు ఆల‌స్యంగా వెలుగుచూస్తోంది. హైద‌రాబాద్ కేంద్రంగా గ‌త ఏడాది జ‌రిగిన బీసీ, కాపు నేత‌ల స‌మావేశం కేసీఆర్ వ్యూహంలో భాగ‌మ‌ని రాజ‌కీయవ‌ర్గాల్లోని తాజా చ‌ర్చ‌. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, బీసీల‌తో కొత్త పార్టీని పెట్టించాల‌ని వ్యూహం ఆనాడు వేశార‌ట‌. కానీ, ఆ వ్యూహం ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు జాతీయ పార్టీ రూపంలో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు బీసీ, బ‌లిజ‌, వెల‌మ, ఒంట‌రి సామాజిక‌వ‌ర్గాల ఈక్వేష‌న్ తీసుకుంటున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ఏపీలోని ప్ర‌ధాన పార్టీలు వైసీపీ, టీడీపీ ఉన్నాయి. మూడో ప్ర‌త్యామ్నాయంగా జ‌న‌సేన కనిపిస్తోంది. మూడు ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన అధిప‌తులు ఆ పార్టీల‌ను న‌డిపిస్తున్నారు. కానీ, బీసీల‌కు ఒక పార్టీ కావాల‌ని కేసీఆర్ స‌రికొత్త ప్ర‌ణాళిక‌ను ర‌చించార‌ని తెలుస్తోంది. ఆయ‌న పెట్ట‌బోయే జాతీయ పార్టీకి బీసీ నాయ‌కుని ఏపీ చీఫ్ గా నియ‌మించ‌డం ద్వారా ఓటు బ్యాంకును భారీగా చీల్చ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చిన స‌ర్వేలోని సారాంశంగా గులాబీ శ్రేణుల్లోని వినికిడి.

Also Read:   CM KCR : అందరి అభిష్టం మేరకు త్వరలోనే జాతీయ పార్టీ…!!!

క‌న‌బ‌డ‌కుండా రాజ‌కీయ శూన్య‌త ఏపీలో ఉంద‌ని పీకే అనూహ్య స‌ర్వే రిపోర్ట్ ఇచ్చార‌ట‌. వెనుక‌బ‌డిన వ‌ర్గాల జాబితాలోని బ‌లిజ‌, ఒంట‌రి , కులాలు జ‌న‌సేన వైపు పెద్ద‌గా మొగ్గు చూప‌డంలేద‌ట. ఇక కేసీఆర్ సొంత సామాజిక‌వ‌ర్గం ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో బీసీ కేట‌గిరీలో ఉన్నారు. వాళ్లంద‌రూ దాదాపుగా కేసీఆర్ ఎంట్రీ కోసం చూస్తున్నార‌ని పీకే స‌ర్వే అంచ‌నా. రాజ్యాధికారాన్ని సుదీర్ఘంగా అనుభ‌విస్తోన్న క‌మ్మ‌, రెడ్డి సామాజిక‌వ‌ర్గాల్లోని పేద‌లు అటు టీడీపీ ఇటు వైసీపీ వైపు సాలిడ్ గా లేర‌ని తేల్చార‌ట‌. అంతేకాదు, ఆ రెండు కులాల్లోని పారిశ్రామిక‌, వాణిజ్య‌, వ్యాపార‌వేత్త‌లు ఎక్కువ మంది కేసీఆర్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. వాళ్లు హైద‌రాబాద్‌, తెలంగాణ‌లోని ఆస్తుల‌ను కాపాడుకోవ‌డానికి అనివార్యంగా కేసీఆర్ కు మ‌ద్ధ‌తు ఇస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

Also Read:   VRAs Issues: వీఆర్ఏలకు బతుకు భరోసా ఇవ్వని కేసీఆర్!

వ‌ల‌స కూలీలు ఎక్కువ‌గా ద‌ళితులు ఉంటారు. వాళ్లు కూడా కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నార‌ని పీకే ఇచ్చిన స‌ర్వేలోని ప్ర‌ధాన అంశంగా ఉంద‌ట‌. అందుకే, ఎస్సీ, ఎస్టీ, బ‌లిజ‌, ఒంట‌రి , వెల‌మ సామాజిక‌వ‌ర్గాల‌తో ఏపీలోని రాజ‌కీయ శూన్య‌త‌ను భ‌ర్తీ చేయడానికి కేసీఆర్ సిద్ధం అయ్యార‌ని తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల స‌మాచారం. పూర్వం నుంచి ప‌లువురు టీడీపీ లీడ‌ర్ల‌తోనూ ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటిని ప్లే చేయ‌డం ద్వారా పెద్ద శ‌క్తిగా ఏపీలో ఎద‌గాల‌ని స్కెచ్ వేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం బీజేపీకి ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌ద్ధ‌తు ప‌లుకుతోన్న టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీల‌కు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఏపీ నుంచి ఎద‌గ‌డానికి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే, ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం పూర్తిగా మార‌నుంది.