AP Politics: పిల్లి అంత సాహసం ఎందుకు చేశారు? జగన్ కావాలని చేయిస్తున్నారా?

ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్ చేశారు.

  • Written By:
  • Publish Date - May 20, 2022 / 02:00 PM IST

ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్ చేశారు. సొంత పార్టీ ఎంపీ.. జగన్ ప్రభుత్వంపై ఈ ఆరోపణ చేసినప్పుడు సహజంగానే రాజకీయంగా పెద్ద రచ్చ, చర్చ జరగాల్సింది. కాని, అలా జరగలేదు. రైతులు ఈ-కేవైసీ నింపకపోవడం వల్ల ఈ-క్రాప్ నమోదులో పెద్ద స్కాం జరుగుతోందన్నారు.
ఆధార్‌తో లింక్ లేకపోవడంతో పెద్ద వ్యాపారులు, మిల్లర్లు పేర్లు తారుమారు చేస్తూ భారీగా లాభం పొందుతున్నారని చెప్పుకొచ్చారు. సుమారు 17వేల మంది రైతుల అడ్రస్సులు గల్లంతయ్యాయని ఆరోపించారు. ముఖ్యంగా అధికారులే ఈ స్కామ్‌ను దగ్గరుండి చేయిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి అధికార పార్టీ ఎంపీ నోటి నుంచి స్కామ్ అనే మాట రావడం జరగదు. దీంతో దీని వెనక సీఎం జగన్ గాని ఉండి నడిపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పీకే మార్క్ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయన్నది ప్రతిపక్షాల వాదన కూడా.

ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణాన్ని ప్రతిపక్షం బయటపెట్టి ఉంటే నానా రచ్చ జరిగేది. అదే అధికార పార్టీ నేతనే చేస్తే. చూసారా.. మా పార్టీ నేతలు అవినీతిని సహించరు అని చెప్పుకోవచ్చు. తమ ప్రభుత్వమే అయినా సరే.. తప్పు చేస్తే ఎలాంటి అధికారినీ వదిలిపెట్టం అని గట్టిగా ప్రచారం చేసుకోవచ్చు. పైగా రైతులకు అండగా నిలిచే ప్రభుత్వమని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వబోమనే సంకేతాలు పంపొచ్చు.
ఇదంతా పార్టీకి, ప్రభుత్వానికి మంచి మైలేజీ తీసుకొస్తాయి కూడా. కాని, పిల్లి సుభాష్ చేసిన కుంభకోణం ఆరోపణలు అంత ప్రకంపనలేం సృష్టించలేదు. నిజంగా జగనే దీని వెనక ఉండి ఉంటే.. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని అర్ధం. అందుకే, మంత్రి కారుమూరి హడావుడిగా నష్టనివారణకు దిగారు. ఈకేవైసీలో జాప్యం గురించి మాత్రమే పిల్లి సుభాష్ మాట్లాడారని చెప్పుకొచ్చారు.