Site icon HashtagU Telugu

AP New Districts: ప‌వ‌న్ అండ్ చంద్ర‌బాబు పై.. మంత్రి పేర్ని నాని సెటైర్స్..!

Perni Nani Chandrababu Pawan Kalyan

Perni Nani Chandrababu Pawan Kalyan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పై అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం అవలంభించిన విధానాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సీఎం జగన్ నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని ప్ర‌తిప‌క్షాలు మండిపడ్డాయి. కేవలం రాజకీయ కోణంలో వీటిని ఏర్పాటు చేశారని, తాము అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామని టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు విష‌యంలో ప్రతిపక్షాల వ్యాఖ్యలకు మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో నవశకానికి ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి నాంది పలికారని, పరిపాలన, ప్రజా సౌకర్యార్థం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, జిల్లాల నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇక‌ చంద్రబాబుకు 40 ఏళ్ళ రాజ‌కీయ అనుభవం ఉండి ఏం లాభం అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.

1979 నాటికే 13 జిల్లాలు ఏర్పడినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత జనాభా పెరిగింది, ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలి.. ఆ మాత్రం తెలియదా.. అంటూ పేర్నినాని ప్రశ్నల వర్షం కురిపించారు. 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ సీఎం జగన్‌ను అభ్యర్థించారని పేర్నినాని గుర్తు చేశారు. చంద్ర‌బాబు చేయ‌లేనిది, సీఎం జ‌గ‌న్ చేసి చూప‌డంతో టీడీపీ నేత‌లు దిక్కుమాలిన ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని పేర్ని నాని మండిప‌డ్డారు.

ఇక జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంత అని చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే, ప‌వ‌న్ దూడను కట్టేస్తానని చెప్పే రకం అని పేర్ని నాని సెటైర్స్ వేశారు. ఇంత‌క ముందు కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ ఇచ్చిన‌ప్పుడు పవన్ క‌ళ్యాణ్ ఎక్కడున్నాడని ప్రశ్నించిన నాని, ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా అభిప్రాయాలను పంచుకున్నాడా అని నిలదీశారు. చంద్రబాబు ఆఫీసు నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏంచేశాడంటూ పవన్ క‌ళ్యాణ్ పై పేర్ని నాని ద్వ‌జ‌మెత్తారు. మ‌రి పేర్ని నాని వ్యాఖ్య‌ల‌పై టీడీపీ అండ్ జ‌న‌సేన వ‌ర్గాల ఎలా స్పందిస్తారో చూడాలి.